పోడు భూములకు హక్కులు కల్పిస్తాం..

Sun,January 20, 2019 11:58 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : ఏజెన్సీలో పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ బలపరుస్తున్న అభ్యర్థులు గెలుపు ఖాయమని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ పేర్కొన్నారు. ఆదివారం భద్రాచలంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పోడు భూములకు హక్కులు కల్పిస్తామని సీఎం ఇచ్చిన మాటను నెరవేర్చుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని, గత ఐదేళ్లుగా పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు, గిరిజనేతరులకు హక్కులు కల్పించేందుకు అధికారులతో మాట్లాడుతున్నామని తెలిపారు. ప్రజలంతా అభివృద్ధినే కోరుకుంటున్నారని, టీఆర్‌ఎస్ మద్దతుతో సర్పంచ్‌లుగా బరిలో దిగిన వారిని కొందరు కావాలనే భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. పర్ణశాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించామని, అభివృద్ధి పనులు చేపడతామని పేర్కొన్నారు. భద్రాచలం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రకటించిన నిధులు త్వరలోనే ఇచ్చే వీలుందన్నారు.

తన పరిధిలో 5వేల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు పేదలకు కట్టించి ఇవ్వాలని సీఎంను కోరానని, ఎవ్వరి స్థలంలో వారు ఇండ్లు కట్టుకునేలా ఏర్పాటు చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఎంపీ అభ్యర్థిగా తనను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపా రు. గతంలో మున్సిపాలిటీగా చేసిన మణుగూరుకు ఇంత వరకు ఎన్నికలు కూడా పెట్టలేదని, ప్రస్తుతం అధికారులే బాధ్యతలు చూస్తున్నారని తెలిపారు. అలాంటప్పుడు భద్రాచలం, సారపాకలను మున్సిపాలిటీలుగా ప్రపోజర్‌లో పెట్ట డం ఎంత వరకు సమంజసమన్నారు. దీనిపై తాను కేంద్రంతో మాట్లాడుతున్నానని, వినతిపత్రాలు కూడా అందజేశానని తెలిపారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, నాయకులు మానె రామకృష్ణ, భాస్కర్, జానీ పాల్గొన్నారు.

రామయ్యను దర్శించుకున్న ఎంపీ
భద్రాచలం సీతారామచంద్రస్వామిని ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ ఆదివారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు సంప్రదాయబద్ధంగా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ గర్భగుడిలో రామయ్యను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలోని లక్ష్మీతాయారు, భయాంజనేయస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించి సీతమ్మ నగలను తిలకించారు.

111
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles