రాజుకున్న పంచాయతీ వేడి..!


Sat,January 19, 2019 12:22 AM

-రెండో విడుత బరిలో 343 సర్పంచ్ అభ్యర్థులు
-మూడో విడుతకు నామినేషన్ల స్వీకరణ పూర్తి
-నేడు నామపత్రాల పరీశీలన
-రేపు ఉప సంహరణలకు అవకాశం
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాప్రతినిధి,నమస్తే తెలంగాణ : పంచాయతీ ఎన్నికలకు మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో పల్లెలో రాజకీయ వేడి రాజుకుంటోంది. మొదటి విడత ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆ గ్రామాల్లో ప్రచారం హోరెత్తుతోంది. కొత్త పంచాయతీలు, కొత్త వార్డుల వల్ల వేలాది మంది కొత్తగా రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం లభించింది. గృహిణులుగా ఉన్న వారు, ప్రైవేటు, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసుకునే వారికి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పూర్తిగా గిరిజన ప్రాంతం కావడం, సర్పంచ్ పదవులు, వార్డు మెంబర్ల పదవులు 99 శాతం గిరిజనులకే రిజర్వు కావడంతో ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. సర్పంచ్ పోటీ చేస్తున్న వారు, ఉప సర్పంచ్ పదవిని ఆశించే వారు తమకు అనుకూలమైన వ్యక్తులను వార్డు మెంబర్లుగా నిలబెడుతున్నారు. ఎక్కడైతే అభ్యర్థులు దొరక్క ఇబ్బంది ఉందో అలాంటి వార్డుల్లో ఉప సర్పంచ్ పదవిని ఆశించే వారు అర్హత కలిగిన అభ్యర్థుల కోసం వెతికి వారి కుటుంబ సభ్యులను ఒప్పించి నామినేషన్లు దాఖలు చేయిస్తున్నారు. జిల్లాలోని 21 మండలాల్లో మూడు దశల్లో జరుగుతోన్న ఎన్నికల్లో భాగంగా తొలి విడత అశ్వాపురం, బూర్గంపాడు, చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు, పాల్వంచ, ములకలపల్లి మండలాల్లో, రెండవ దశ అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, కరకగూడెం, పినపాక, అశ్వారావుపేట, దమ్మపేట, చంచుపల్లి మండలాల్లోని గ్రామ పంచాయతీలకు, వార్డులకు జరగనున్న ఎన్నికలకు ఆయా గ్రామ పంచాయతీల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. మూడో విడత నామినేషన్లు శుక్రవారంతో ముగిసింది. ఉప సంహరణల తరువాత మూడవ విడత ఎన్నికల బరిలో ఉన్న వారు కూడా ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. దీంతో జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో పంచాయతీ ప్రచారం మరింత ముమ్మరం కానుంది.


తొలి, రెండో విడత ఎన్నికల ప్రచారం జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతోంది. ఎక్కడికక్కడ అభ్యర్థులు తమ గెలుపు కోసం ఓటర్లను ప్రత్యక్షంగా కలుసుకొని తమను గెలిపిస్తే పంచాయతీని, వార్డులను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని, సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీలిస్తున్నారు. జిల్లాలో తొలిదశలో 22 మంది సర్పంచ్ ఏకగ్రీవం కాగా, రెండు సర్పంచ్ పదవులకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. ఈ నెల 21న జరగనున్న తొలివిడత ఎన్నికల్లో 150 సర్పంచ్ పదవులకు 450 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి ప్రచారం చేస్తున్నారు. 321 మంది వార్డు మెంబర్లు తొలిదశలో ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, మిగిలిన 1181 వార్డు మెంబర్ల పదవులకు 2815 మంది మొత్తం 3265 మంది ఎన్నికల బరిలో నిలిచారు. రెండవ విడత ఈ నెల 25వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 142 సర్పంచ్ స్థానాల్లో 20 సర్పంచ్ పదవులకు ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నిక కాగా మిగతా 122 సర్పంచ్ పదవులకు 343 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి ప్రచారాన్ని ప్రారంభించారు. మొత్తం 1294 వార్డులకు గాను 289 వార్డులు ఏకగ్రీవం కాగా, ఐదు వార్డులకు నామినేషన్లు అర్హత సాధించలేకపోయాయి. మిగిలిన వెయ్యి వార్డులకు 2325 మంది అభ్యర్థులు పోటీలో నిలిచి తమ వార్డుల్లో ప్రచారం కొనసాగిస్తున్నారు. మొత్తం మీద రెండవ విడుత 2668 మంది అభ్యర్థులు పోటీలో నువ్వానేనా అనే విధంగా ప్రజాక్షేత్రంలో తమ భవిష్యత్ పరీక్షించుకుంటున్నారు.

75
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles