ప్రాణానికి రక్ష..హెల్మెట్


Sat,January 19, 2019 12:20 AM

కొత్తగూడెం క్రైం : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని కొత్తగూడెం డీఎస్పీ ఎస్ ఆలీ అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ ఆదేశాల మేరకు కొత్తగూడెం సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలోని పోస్టాఫీస్ సెంటర్ నుంచి లక్ష్మీదేవిపల్లి వరకు పోలీసులు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ ఆలీ మాట్లాడుతూ... ద్విచక్రవాహనాలను ఉపయోగించే పట్టణ, పరిసర ప్రాంత ప్రజలు ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ఉపయోగించాలని ఈ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. పోలీస్ సిబ్బంది, అధికారులు ఇప్పటి నుంచి తప్పని సరిగా హెల్మెట్ వాడాలని సూచించారు. తాజాగా జిల్లాలో అమలు చేసిన ఈ-చలానా విధానంలో భాగంగా హెల్మెట్ ఉపయోగించని, సరైన పత్రాలు చూపించని వారికి జరిమానాలు విధించడం జరుగుతుందని అన్నారు. ద్విచక్రవాహనాలను ఉపయోగించే వారు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ ఉపయోగించకపోవడంతోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. అందరూ తమ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని రోడ్డు భద్రత నియమాలు పాటించాలని సూచించారు. ఈ ర్యాలీలో వన్ సీఐ కుమారస్వామి, టూటౌన్ సీఐ శ్రీనివాస్, త్రీటౌన్ సీఐ ఆదినారాయణ, ఎస్సైలు నరేష్, వరుణ్ ప్రసాద్, రవీందర్, రాఘవ, శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.

101
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles