పల్లెల్లో ఎన్నికల వేడి..!


Fri,January 18, 2019 01:03 AM

-మూడవ విడతకు రెండవ రోజు భారీగా నామినేషన్లు
-సర్పంచ్ స్థానాలకు 331, వార్డు స్థానాలకు 978 దాఖలు
-నేటితో ముగియనున్న చివరి దశ నామపత్రాల స్వీకరణ
-రెండో విడుత ఎన్నికలకు 20 మంది సర్పంచ్‌లు ఏకగ్రీవం
భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ: పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. తొలిదశ ఎన్నికల గడువు సమీపిస్తుండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారాన్ని ఇంటింటికీ తీసుకెళ్తున్నారు. తమకు కేటాయించిన గుర్తులను ఓటర్లకు వివరిస్తూ గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. తొలివిడత ఎన్నికల పో లింగ్ సోమవారం జరగనుంది. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రెండో విడత నామినేషన్ల ఉప సంహరణ గురువారంతో ముగిసింది. జిల్లాలోని సుమారు 20 పంచాయతీల సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అనధికార సమాచారం ప్రకారం తెలిసింది. పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. రెండో విడత ఎన్నికలు జరగాల్సిన మొత్తం 142 పంచాయతీలకు గాను చివరి సమాచారం అందే సరికి 20 సర్పంచ్ స్థానాలకు, 232 వార్డు మెంబర్ల పదవులకు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది. మొదటి విడత, రెండో విడత ఎన్నికల ప్రచారం శుక్రవారం నుంచి మరింత ఊపందుకోనుంది.


పంచాయతీ ఎన్నికల మూడో విడత నామినేషన్ల ఘట్టం రెండో రోజు కోలాహలంగా జరగడంతో పాటు శుక్రవారంతో ముగియనున్నందున చివరిరోజు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఎక్కడికక్కడ మంతనాలు జరుపుతూ.. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు రాజకీయాలకతీతంగా కొందరు వ్యూహరచన చేస్తుండగా రాజకీయ పార్టీల మద్దతుతో మరికొందరు గెలుపుకోసం పావులు కదుపుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎక్కువ సంఖ్యలో సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులను కైవసం చేసుకునేందుకు, ఉప సర్పంచ్ పదవులను సైతం చేజిక్కించుకునేందుకు ఆయా గ్రామాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు తమవంతు కృషి చేస్తున్నారు. ఎన్నికల సందడితో పల్లెలన్నీ రాజకీయ చర్చలతో వేడెక్కుతున్నాయి. ప్రచారం జోరుగా సాగుతున్నప్పటికీ మైక్‌లు, హంగామాలు లేకుండా ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకొని తమను గెలిపించాలని గుర్తులను పరిచయం చేస్తున్నారు.

ఏకగ్రీవ పంచాయతీలు ఇవే...
చండ్రుగొండ మండలంలో ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు : దామరచర్ల, చండ్రుగొండ, వెంకట్యాతండా, పినపాక మండలంలో సీతంపేట, భూపాలపట్నం, పాతరెడ్డిపాలెం, కరకగూడెం మండలంలో భట్టుపల్లి, కొత్తగూడెం, సమత్‌మోతె, చుంచుపల్లి మండలంలో అంబేద్కర్‌నగర్ కాలనీ, అశ్వారావుపేట మండలంలో మొద్దులమడ, అచ్యుతాపురం, దమ్మపేట మండలంలో ఏకగ్రీవమైన సర్పంచ్ స్థానాలు : అల్లిపల్లి, ఆకినేపల్లి, మందలపల్లి, పూసుకుంట, వడ్లగూడెం, గండుగులపల్లి, సీతారాంపురం, గణేష్‌పాడు

ఏకగ్రీవమైన వార్డు మెంబర్ల వివరాలు...
దమ్మపేట మండలంలో 92 మంది, చండ్రుగొండ మండలంలో 40 మంది, అశ్వారావుపేట మండలంలో సుమారు 30 మంది, అన్నపురెడ్డిపల్లి మండలంలో 25 మంది, పినపాక మండలంలో 45 మంది, కడపటి సమాచారం అందే సరికి మొత్తం 232 మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవమైనట్లు తెలుస్తోంది.

99
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles