సందడిగా సంక్రాంతి..!


Thu,January 17, 2019 01:47 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సంప్రదాయాలకు ప్రతీకగా.... సరదాలకు సరికొత్త శోభనిచ్చే విధంగా సంక్రాంతి పండుగ సందడిగా జరిగింది. భోగి రోజు నుంచి కనుమ వరకు మూడు రో జుల పాటు జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబురాలు అంబురాన్నంటాయి. కొత్త కోడళ్లు, అల్లుళ్లు రాకతో కొత్తగా పళ్లైన ఇళ్లల్లో సరికొత్త రీతిలో సంబురాలు జరుపుకున్నారు. దూర ప్రాంతాల్లో ఉండే వారంతా తమ స్వగ్రామాలకు చేరుకోవడంతో కుటుంబ సభ్యులంతా కలిసి పిల్లాపాపలతో మూడు రోజులు ఆనందోత్సాహాలతో సంక్రాంతి పండుగను సరికొత్త కాంతులు నింపేలా... పిండివంటలతో, ఘుమఘుమలాడే ఆహార పదార్థాలను వండుకొని సకుటుంబ సమేతంగా... బంధుమిత్ర సపరివారంగా జరుపుకున్నారు. కొత్త దుస్తులు ధరించి పిల్లలు ఆనందంతో మురిసిపోయారు. జిల్లాలోని 23 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలలో ప్రతీ గ్రామం, ప్రతీ వార్డులో, గల్లీగల్లీలో రంగవల్లులతో మహిళలు ఇంద్రధనస్సును మరిపించేలా ముగ్గులతో వాకిళ్లను తీర్చిదిద్దారు. జిల్లాలోని వీధులన్నీ ముగ్గులతో గొబ్బెమ్మలతో సరికొత్త అందాన్ని సంతరింపజేసుకొని రథం ముగ్గులతో కనుమ రోజు తరలి వెళ్లాయి. రైతులు, కార్మికులు, అన్ని వర్గాల ప్రజలు సంప్రదాయ రీతిలో సంక్రాంతి పండుగను మూడు రోజుల పాటు ముచ్చట గొలిపేలా పువ్వులు, నవ్వులు వికసించేలా జరుపుకోవడం ఒక ప్రత్యేకతగా నిలిచింది. జిల్లాసరిహద్దుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో జరిగిన కోడిపందాలకు సరిహద్దు గ్రామాలకు చెందిన వారుపెద్దసంఖ్యలో తరలివెళ్లి కోడిపందాలను వీక్షించారు.

జిల్లాలోని భద్రాచలం పుణ్యక్షేత్రంలో ప్రత్యేక పూజలు జరిగాయి. వేలాది మంది మకర సంక్రాంతి సందర్భంగా గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేశారు. జిల్లాలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో వేలాది మంది పుణ్యస్నానాలు ఆచరించి భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకున్నారు. గోదావరి నదీ తీరాలలో ఉన్న అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దైవదర్శనం చేసుకొని భగవంతుని ఆశీస్సులు పొందారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోని దేవాలయాల్లో అమ్మవారికి, స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు జరిగాయి. కుటుంబ సమేతంగా భక్తులు దైవదర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి దేవుని కరుణా కటాక్షాలు ఎల్లప్పుడూ తమపై ఉండాలని కోరుకున్నారు. దానధర్మాలు చేశారు. గంగిరెద్దులు డూడూ బసవన్నల సందడి పిల్లలను ఆనందడోలికల్లో ముంచెత్తింది. దేశవిదేశాల నుంచి కూడా కుటుంబ సభ్యులు తమ స్వగ్రామాలకు చేరుకొని ముచ్చటగా మూడ్రోజుల పాటు జరిగిన సంక్రాంతి పండుగను అందరితో కలిసి ఆనందంతో మరిచిపోని తీపి గుర్తులుగా జరుపుకున్నారు. జిల్లాలోని దర్శనీయ ప్రాంతాలను,పర్యాటక ప్రాంతాలను సందర్శించి కొత్త సినిమాలను వీక్షించారు. సామూహికంగా షాపింగ్‌లుచేసి పరస్పర అభిమానాన్ని చాటుకున్నారు.


ముగ్గులతో నిండిన వాకిళ్లు..
సంక్రాంతికి పర్యాయ పదం ముగ్గులు... ముగ్గులు అంటేనే సంక్రాంతి... అనే నానుడికి ప్రత్యక్ష తార్కాణంగా జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు సంక్రాంతి ముగ్గులతో వాకిళ్లన్నీ ఇంద్రధనస్సుల్లా దర్శనమిచ్చాయి. అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను భావితరా లకు కొనసాగింపుగా ప్రతీ ఒక్కరూ భోగి, సంక్రాంతి, కనుమ మూడు రోజుల పాటు రంగవల్లులతో తమ వాకిళ్లను మహిళలు అలంకరించారు. గొబ్బెమ్మలను పెట్టి సంప్రదాయాన్ని ఉట్టిపడేలా ఇంటిముంగిట సంక్రాంతిని ముగ్గులతో కొలువుదీర్చారు. కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక, భద్రాచలం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని 23 మండలాలు, నాలుగు మున్సిపాలిటీలతో పాటు కొత్త గ్రామ పంచాయతీలతో కలిపి మొత్తం 479 గ్రామ పంచాయతీల పరిధిలోని ప్రజలంతా సంక్రాంతికి ముగ్గులతో సరికొత్త క్రాంతిని తీసుకొచ్చే విధంగా రంగు రంగుల ముగ్గులను వేసి తమ ఇళ్ల ముందు వాకిళ్లను పోటాపోటీగా అలంక రించారు. పంచాయతీ ఎన్నికల సందడి కూడా సంక్రాంతి పండుగను మరింత ఎక్కువగా జరుపుకునేలా చేసింది.

పతంగులతో పిల్లల సందడి..
పతంగులు అంటేనే పిల్లలు... పిల్లలకు తోడుగా పెద్ద లు... పతంగులు ఎగురవేస్తూ జిల్లా వ్యాప్తంగా పిల్లలు, యువతీ, యువకులు సంక్రాంతిని పతంగులతో సంబురంగా జరుపుకున్నారు. పతంగులు ఎగురవేసే దృశ్యాలు ఎక్కడ చూసినా కోలాహలంగా కనిపించాయి. జిల్లాలోని విద్యార్థులు, యువ తీ, యువకులు మూడు రోజుల పాటు పతంగులతో ఆడుకొని నిత్యజీ వితంలో చదువులు, ఇతరత్రా పనులతో బిజీగా ఉండే వాతావరణానికి భిన్నంగా మధురమైన అనుభూతిని పొందారు. సంక్రాంతి సెలవులను సరదాగా గడిపేం దుకు ముగ్గులు, పతంగులు ఒక సరికొత్త మార్గాలుగా పిల్లలు, యువతీ యువకులు ఆస్వాదించారు.

కోడిపందాల కోసం సరిహద్దు ప్రాంతాలకు...
జిల్లాకు సరిహద్దుగా ఉన్న తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు కోడిపందాలను వీక్షించేందుకు జిల్లా సరిహద్దు ప్రాంతాల నుంచి ఆసక్తి ఉన్న వారు పెద్దసంఖ్యలో తరలి వెళ్లారు. జిల్లాలో కోడిపందాలకు అవకాశం లేనందున ముందుగానే కొందరు కోడిపందాలను వీక్షించేందుకు, సరిహద్దు రాష్ట్రంలో ఉన్న తమ బందువుల పిలుపు మేరకు ఈ కార్యక్రమాలకు హాజరయ్యారు. మద్యం విక్రయాలు కూడా జోరుగా జరిగాయి.

158
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles