బరిలో 450మంది అభ్యర్థులు


Tue,January 15, 2019 05:05 AM

- మొదటి విడతకు 22మంది సర్పంచ్‌లు, 321మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవం
- ఎన్నికల సామగ్రి పంపిణీ.. ఈ నెల 21న పోలింగ్‌కు ఏర్పాట్లు
- ప్రచారంపై అభ్యర్థుల దృష్టి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ :స్థానిక పాలకులను ఎన్నుకునే సమరానికి సమయం ఆసన్నమైంది. గ్రామపంచాయతీ ఎన్నికల తొలి దశ ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఘట్టం, ఉపసంహరణలు ముగిసిన తర్వాత భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో సర్పంచ్ పదవులకు 450మంది, వార్డు మెంబర్ల పదవులకు 2815మంది మొత్తం 3,265మంది ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత సోమవారం అధికారికంగా వివరాలను ప్రకటించారు. దీంతో ఎన్నికల ప్రచారానికి అభ్యర్ధులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 22మంది సర్పంచ్‌లు ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, 321మంది వార్డు మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించారు. పాల్వంచ మండలంలో రెండు సర్పంచ్ పదవులకు ఎలాంటి నామినేషన్లు దాఖలు కాలేదు. జిల్లాలోని 32వార్డులకు కూడా నామినేషన్లు రాలేదు. దీంతో మొత్తం 150 సర్పంచ్ పదవులకు, 1181 వార్డుల మెంబర్ల పదవులకు తొలి విడత ఎన్నికలు ఈ నెల 21న జరగనుండటంతో అభ్యర్ధులకు గుర్తులు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది.


గుర్తుల కేటాయింపుతో పాటు తొలి విడత ఎన్నికలు జరగనున్న గ్రామపంచాయతీలకు బ్యాలెట్ పేపర్లు, పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం నాడు జిల్లా కేంద్రంలోని సింగరేణి సీఈఆర్ క్లబ్‌లో జిల్లా పంచాయతీ అధికారిణి ఆశాలత పరిశీలించారు. సర్పంచ్‌లు, వార్డు స్థానాలకు తగిన విధంగా పోటీలో ఉన్న అభ్యర్ధుల గణాంకాల ప్రకారం పోలింగ్ బూత్‌లవారీగా బ్యాలెట్ పత్రాలను పంపిణీ చేస్తున్నారు.

తొలుత ఆయా మండలాలకు పంపిణీ తర్వాత అక్కడి నుంచి అన్నీ గ్రామపంచాయతీలకు వార్డుల వారీగా పోలింగ్ బూత్‌లకు చేర్చనున్నారు. కొత్త పంచాయతీలు ఏర్పాటైన తర్వాత జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలోని తొలి పంచాయతీ ఎన్నికలలో గెలుపు కోసం అభ్యర్ధులు ఎవరికీ వారు తమ వంతు ప్రచారంతో పాటు ఓటర్ల అభిమానాన్ని చూరగొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజకీయపార్టీల మద్దతుతో కొందరు, స్వతంత్రులుగా మరికొందరు తమ భవిష్యత్‌ను పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.తండాలు, గూడేలు, దళితవాడల్లో పంచాయతీ ఎన్నికల తొలి దశ కోలాహాలం ప్రారంభమైంది. ఒక వైపు సంక్రాంతి సంబురాలు, మరోవైపు పంచాయతీ ఎన్నికల సందడి గ్రామీణ ప్రాంత వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరగనున్న సర్పంచ్ స్థానాలు, వార్డు మెంబర్ల స్థానాలకు 3265మంది బరిలోఉండటంతో ఏడు మండలాల్లోని 150 పంచాయతీల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్ధులు ఎవరికివారు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. తమ ఎన్నికల గుర్తులను ఓటర్లకు పరిచయం చేయడంతో పాటు తాము గెలిస్తే ఏం చేస్తామో కూడా చెప్తున్నారు. బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం జోరందుకోనుంది. తొలి దశ ఎన్నికలు జరగనున్న మండలాలవారీ వార్డులు, ఏకగ్రీవం అయిన తర్వాత ఎన్నికలు జరగనున్న వార్డుల సంఖ్య, బరిలో నిలిచిన వార్డు మెంబర్ల అభ్యర్ధుల వివరాలిలా ఉన్నాయి.

93
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles