భద్రాద్రి కొత్తగూడెం జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: పల్లెపోరులో రెండవ విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఈనెల11న పంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ఆదివారంతో కోలాహలంగా ముగిసింది. చివరిరోజు కావడంతో సర్పంచ్ పదవులకు, వార్డు మెంబర్ల పదవులకు నామినేషన్లు వేసేందుకు ఆయా గ్రామాల పరిధిలో రాజకీయ పార్టీల మద్దతుతో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. ఎవరికివారు ఏకగ్రీవ ఎన్నిక కోసం ఒక వైపు ప్రయత్నాలు చేస్తూ మరో వైపు ఎన్నికల నామినేషన్లకు చివరిరోజు ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేశారు.. రెండవ విడత నామినేషన్ల ముగింపు జిల్లాలో కోలాహలంగా ముగిసింది. అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, కరకగూడెం, పినపాక, అశ్వారావుపేట, దమ్మపేట, చుంచుపల్లి మండలాలలో 142 సర్పంచ్ పదవులకు 602 నామినేషన్లు దాఖలు కా గా, 1294 వార్డు మెంబర్ల పదవులకు 3007 నామినేషన్లు దాఖలయ్యాయి. ఎవరికి వారు ముందు నామినేషన్లు వేసి తరువాత ఉప సంహరణల నాటికి పరస్పర చర్చల ద్వారా ఏకాభిప్రాయం కోసం ప్రయత్నాలు చేసే పనిలో పడ్డారు. ఏ విధంగానైనా పోటీలో ఉండాలనే పట్టుదలతో మరికొందరు నామినేషన్లు దాఖలు చేశారు.
టీఆర్ పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు అభ్యర్థులను ఆయా గ్రామాల స్థాయిలో ఎక్కడికక్కడ ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తూ, సంప్రదింపులు జరిపి అభ్యర్ధులతో నామినేషన్లు వేయించారు. ఉపసంహరణల నాటికి ఏకగ్రీవం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొన్ని పంచాయతీల్లో సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు అభ్యర్థుల కోసం అన్వేషణ చేస్తుండగా, కొన్ని మేజర్ పంచాయతీల్లో ఆయా పార్టీలలోనే సర్పంచ్ పదవులకు, వార్డు మెంబర్ల పదవులకు గట్టి పోటీ నెలకొంది. ఏకాభిప్రాయం చేసుకోవాలని పార్టీ నేతలు అక్కడి స్థానికులకే బాధ్యతలు అప్పగించారు. ఉప సంహరణల నాటికి బుజ్జగింపుల ద్వారా ఏకాభిప్రాయాలు, ఏకగ్రీవాలు చేయాలనే తలంపుతో నామినేషన్ల ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఆశావహులు స్థానిక పోరులో ఖచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు పోతున్నారు. ఈ పంచాయతీ ఎన్నికలతో పల్లె వాతావరణం సందడిగా మారింది. ఒకవైపు చలి, మరోవైపు ఎన్నికల వేడి, సంక్రాంతి భోగి మంటలు గ్రామీణ ప్రాతాలను పదునెక్కిస్తున్నాయి.