రెండో రోజూ కొనసాగిన నామినేషన్లు


Sun,January 13, 2019 12:50 AM

-నేటి సాయంత్రం ఐదు గంటలతో రెండవదశ నామినేషన్లు పూర్తి
-జిల్లాలో సర్పంచ్ స్థానాలకు 270-, వార్డు మెంబర్ల స్థానాలకు -1137
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల పర్వం రెండో రోజుకు చేరింది. నేటితో మొదటి దశ నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తి కానుంది. నేటితో రెండో దశ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే పల్లె రాజకీయాలు ఎన్నికల వాతావరణంతో వేడెక్కిపోయాయి. పోటీపడే అభ్యర్థులు గెలుపు కోసం శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఉప సంహరణల కోసం అభ్యర్థులను బుజ్జగిస్తూ మరో వైపు ఏకగ్రీవాల కోసం మంతనాలు జరుపుతున్నారు. రాజకీయ పార్టీలు వారి ప్రాభల్యం పెంచుకునేందుకు మధ్యవర్తులతో బేరసారాలు చేస్తూ పంచాయతీ సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇప్పటికే మొదటి విడత నామినేషన్ల పర్వం పూర్తి కావడంతో ఆరు మండలాల్లో ఉపసంహరణల నాటికి బరిలో ఉండే అభ్యర్థులను ప్రసన్నం చేసుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థులు ఎవరైనా మన పార్టీ వారై ఉండాలని ఎవరికి వారు రాజకీయ ఎత్తుగడలను వేస్తున్నారు. జిల్లాలో అన్ని సర్పంచ్ పదవులు గిరిజనులకే రిజర్వు కావడంతో గిరిజనులు పంచాయతీల్లో పీఠం ఎక్కనున్నారు.


రెండో దశ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారంతో రెండో రోజుకు చేరుకుంది. ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో ఎట్టి పరిస్థితుల్లో గడువు ముగిసేలోగా నామినేషన్లు దాఖలు చేయాలని గ్రామాల్లోని సర్పంచ్, వార్డు మెంబర్ల పదవులకు పోటీ పడుతున్న వారు పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. దీంతో తొలివిడత ఎన్నికలు జరగనున్న జిల్లాలోని అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ, కరకగూడెం, పినపాక, అశ్వారావుపేట, దమ్మపేట, చుంచుపల్లి మండలాల్లో గ్రామ వాతావరణం ఒక్కసారిగా రకరకాల మలుపులు తిరుగుతోంది. ఏది ఏమైనప్పటికీ రెండో విడత ఎన్నికల నామినేషన్ల ఘట్టం ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు సమాప్తం కానున్నందున ఆశావహులు తొలుత నామినేషన్లు దాఖలు చేసి ఉప సంహరణల సమయానికి ఏదో విధంగా సర్దుబాటు చేసుకొని రాజీమార్గాలను, బుజ్జగింపు ప్రయత్నాలను చేపట్టాలని యోచిస్తున్నారు. కొందరు సర్పంచ్ స్థానాలకు మాత్రమే పోటీ చేయాలని భావిస్తుండగా మరికొందరు వార్డు పదవులకు మాత్రమే పోటీ చేసి ఉపసర్పంచ్ పదవులను కైవసం చేసుకోవాలని పావులు కదుపుతున్నారు. ఏకగ్రీవం కోసం చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కిరాకపోవడంతో ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేయాలని పట్టుదలతో అవసరమైన ధృవీకరణ పత్రాలను పొందుతున్నారు.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles