లక్ష్యానికి మించి ధాన్యం సేకరణ

Sun,January 13, 2019 12:49 AM

-కస్టం మిల్లింగ్ శరవేగంసీఎంఆర్ సేకరణ..
-ఇప్పటికే 40శాతం పూర్తి
-ప్రభుత్వ యంత్రాంగం నిత్య పర్యవేక్షణ ఫలితం
ఖమ్మం, నమస్తే తెలంగాణ: జిల్లాలో అధికారుల అంచనాలకు మించి ధాన్యం సేకరణ జరుగుతుంది. ఇప్పటికే నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తిచేశారు. ఈ ఖరీఫ్ సీజన్ జిల్లాలో 1లక్షా 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించే లక్ష్యంగా జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు ప్రణాళికను రూపొందించారు. అయితే వారి అంచనాలకు మించి మరో 20వేల టన్నుల ధాన్యాన్ని సేకరించబోతున్నారు. ప్రభుత్వం అమలు చేసిన మిషన్ కాకతీయ పనుల కారణంగా చెరువుల ఆయకట్టు స్థిరీకరణ పెరగడం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు నీటిని వదలడం, జిల్లాలో పాలేరు, వైరా, లంకసాగర్ ప్రాజెక్టులు నిండి ఉండటం వల్ల ఖరీఫ్ రైతులకు ఇబ్బందులు ఎదురుకాలేదు. తద్వారా వరి పంట ఎక్కువగా సాగుచేసినందున ధాన్యం ఊహించిన దానికంటే అధిక మొత్తంలో పంట దిగుబడి వచ్చింది.
సహజంగా రైతులు ఖరీఫ్ వచ్చే ధాన్యాన్ని సొంత అవసరాలకు మిగిల్చి, మిగిలిన ధాన్యాన్ని మాత్రమే విక్రయిస్తారు. దీని వల్ల ఎక్కువ మొత్తంలో ధాన్యం సేకరణ జరగకపోవచ్చని అధికారులు భావించారు. జిల్లాలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తామని నిర్ణయించగా, గురువారం నాటికి 1.42 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. దీనిలో గ్రేడ్-ఏ రకం 1 లక్ష 15 వేల 574 మెట్రిక్ టన్నులు కాగా, కామన్ రకం 25,428 మెట్రిక్ టన్నులు. జిల్లాలో 84 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు 14,542 మంది రైతులకు 202కోట్ల 74లక్షల రూపాయలు చెల్లించారు. ఇంకా 4కోట్ల 63లక్షల రూపాయలను రైతులకు చెల్లించాల్సి ఉంది.

నాలుగు సంవత్సరాలుగా వందశాతం సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను సాధించిన అధికారులు ఈసారి కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని సేకరించిన అధికారులు వాటిని వెంటనే మిల్లర్లకు అందిస్తూ.. అంతే వేగంగా సీఎంఆర్ సేకరిస్తున్నారు. నాలుగేళ్లుగా లక్ష్యాన్ని పూర్తిస్థాయిలో చేరుకోవడం ద్వారా రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపారు. ఈ సంవత్సరం కూడా జిల్లాలోని 40 రైస్ మిల్లులకు ధాన్యం అప్పగించిన అధికారులు ఇప్పటికే 40శాతం సీఎంఆర్ సేకరించారు. లక్ష్యం చేరుకునేందుకు నెలరోజుల సమయమున్నా మరో వారం రోజుల్లోనే నూరుశాతం సాధించే దిశగా పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. నిరుపేదలకు రేషన్ దుకాణాల ద్వారా చౌక ధరలకు బియ్యం సరఫరా చేసేందుకు ప్రభుత్వం ప్రతీ సంవత్సరం పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఐకేపీ, సీఏసీఎస్ ద్వారా రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసి వాటిని బియ్యంగా మార్చే బాధ్యతను రైస్ అప్పగిస్తోంది.

క్వింటా ధాన్యానికి బదులుగా పారాబాయిల్డ్ బియ్యం అయితే 68కేజీలు, సాధారణ బియ్యం అయితే 67కేజీల చొప్పున మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ప్రభుత్వం ఒక్కో క్వింటాల్ రూ.50 చొప్పున చెల్లిస్తుంది. ధాన్యం నుంచి బియ్యం తీసే క్రమంలో వచ్చే నూకలు, తవుడు వంటివి మిల్లర్లే తీసుకుంటారు. ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్ ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసంవత్సరం జిల్లాలో లక్ష 40వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. వారి అంచనాలు తలకిందులు చేస్తూ 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల ద్వారా కోనుగోలు చేశారు. ఈధాన్యాన్ని జిల్లాలోని 40 మిల్లులకు అందించారు.
.
అక్రమాలకు అడ్డుకట్ట..
గతంలో ప్రతీ సంవత్సరం అధికారులు ఎంత వెంటపడ్డా... ఒకటికి రెండుసార్లు గడువును పొడిగించినా... లక్ష్యం పూర్తయిన సందర్భాలు చాలా అరుదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నాలుగు సంవత్సరాలుగా నిర్దేశించిన సమయానికంటే ముందుగానే సీఎంఆర్ లక్ష్యాన్ని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు చేరుకుంటున్నారు. ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ విధానంలో బియ్యంగా మార్చి ఇచ్చే క్రమంలో మిల్లర్లు అక్రమాలకు పాల్పడకుండా తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. మిల్లర్లు తీసుకున్న ధాన్యం బియ్యంగా మార్చి ఇచ్చేందుకు ఆగస్టు నెలాఖరు వరకు గడువు విధించింది. గడువు దాటితే జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. జరిమానా కింద వారికిచ్చే సీఎంఆర్ చార్జీల్లో కోత విధించాలని నిర్ణయించింది. గతంలో మిల్లర్లు తమ ఇష్టానుసారంగా వ్యవహరించే మిల్లర్ల విషయంలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అయినా కొందరు సొంతానికి వాడుకుని బియ్యం ఇవ్వకుండా మొండికేస్తున్నారు. అలాంటి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటున్నారు. ఆలస్యం చేస్తే చార్జీల్లో కోత విధించడంతో పాటు సీఎంఆర్ విధానం అప్పగించడం, బియ్యం అందజేసే వివరాలను ఎప్పటికప్పుడు కంప్యూటరీకరించాలని, విజిలెన్స్ అధికారుల తనిఖీలు కూడా చేయాలని నిర్ణయించారు. దీంతో పరిస్థితి మెరుగు పడుతోంది.

మెట్రిక్ టన్నులు సేకరణ..
జిల్లాలో సీఎంఆర్ సేకరణకు అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. వానాకాలం సీజన్ సంబంధించిన ధాన్యం కొనుగోలు చేస్తున్న సందర్భాల్లో వెంటవెంటనే మిల్లర్లకు సరఫరా చేశారు. తిరిగి అంతే వేగంగా బియ్యం సేకరిస్తున్నారు. జిల్లాలో 40 మిల్లులకు 1.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించారు. లావు రకం ధాన్యం కావడంతో నిబంధనల మేరకు 67శాతం బియ్యం సంబంధిత రైస్ మిల్లుల వారు ప్రభుత్వ ఆహార సంస్థకు సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన 91,732 మెట్రిక్ టన్నుల బియ్యం ఫిబ్రవరి చివరి నాటికి అందించాల్సి ఉండగా, ఇప్పటికే అధికారులు 40శాతం పూర్తిచేసి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచారు. గత యాసంగి పంటకు సంబంధించి సీఎంఆర్ లక్ష్యం నూరుశాతం పూర్తి చేసుకోవడంతో బియ్యం సేకరణ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలు, చర్యల వల్ల ఈసారి వేగంగా సేకరణ జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles