భక్తిశ్రద్ధలతో కూడారై ఉత్సవం..!

Sat,January 12, 2019 01:05 AM

-ధనుర్మాసోత్సవాల్లో భాగంగా వేడుకలు
-గోదాదేవికి ప్రత్యేక పూజలు
-108 గంగాళాలతో పాయస్నానం
-అధిక సంఖ్యలో భక్తుల హాజరు
భద్రాచలం, నమస్తే తెలంగాణ/దుమ్ముగూడెం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహిస్తున్న ధనుర్మాసోత్సవాలలో భాగంగా 27వ రోజు శుక్రవారం కూడారై ఉత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈసందర్భంగా గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. తిరుప్పావై, తిరుపల్లేచి అనే ద్రవిడ ప్రబంధాలను నివేదన సమయంలో అనుసంధానం చేశారు. గోదాదేవి అమ్మవారు శ్రీరంగనాథునితో తన వివాహం జరిగితే 108 గంగాళాలతో పాయస్నానం నివేదన చేస్తానని సుందర భూస్వామికి మొక్కుకుంటుంది. ఈసమయంలో అమ్మవారితో శ్రీరంగనాథుని కళ్యాణం జరగడం, ఆయనలో ఐక్యం కావడం జరిగిందని ప్రతీతి. ఈ క్రమంలో రామానుజుల వారు అమ్మవారి మొక్కులను భక్తి ప్రపత్తులతో తీర్చుతారు. ఏటా ధనుర్మాస మహోత్సవాల సమయంలో కూడారై ఉత్సవాన్ని అమ్మవారిని స్మరించుకుంటూ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

అందులో భాగంగా రామాలయంలో 108 గంగాళాలతో పాయస్నానం అమ్మవారికి ఎదురుగా ఏర్పాటు చేసి నివేదన గావించారు. ఈ సమయంలో మహిళా ముత్తుదువులకు గోదాదేవి ప్రతిమలు ఇచ్చి షోడషోపోచారాలతో శ్రీకృష్ణగోద అష్టోత్తరాన్ని భక్తిప్రపత్తులతో పఠించారు. చివరిగా కూడారై అనే పాశురాన్ని నక్షత్ర హారతితో నీరాజనం ఇస్తుండగా పఠించారు. ప్రసాద వితరణ గావించారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన దుమ్ముగూడెం పర్ణశాల శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో కుడారై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ఆండాళ్లమ్మ తల్లికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా 27వ పాశురాన్ని గోదాదేవికి వేదపండితులు పఠించారు. 108 వెండి కలశాలతో గంగాజలం, పరవన్నంతో ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని ఆండాళ్లమ్మ తల్లికి సమర్పించారు. దేవస్థానం ఈవో తాళ్లూరి రమేష్ పర్యవేక్షకులు కత్తి శ్రీనివాస్, ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, అమరవాధి విజయరాఘవన్, గోపాలకృష్ణమాచార్యులు, అమరవాది శ్రీనివాస రామానుజం పాల్గొన్నారు. శ్రీసీతారామచంద్రస్వామివారికి శుక్రవారం స్వర్ణకవచలాంకరణ చేశారు. అర్చకులు కిరణ్ భార్గవాచార్యులు, ఆల య ఇన్ వాసు, రమేష్ పాల్గొన్నారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles