త్వరలో ప్రజా ఆశీర్వాద సభ..!


Fri,September 21, 2018 12:52 AM

- ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలు కలిపి ఒకేచోట సభ
- మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు..
- ఒక్కో మండలానికి ఐదు రోజుల చొప్పున ప్రచారం
- ఓటరు నమోదు ప్రక్రియలో అందరూ భాగస్వాములు కావాలి..
- పాలేరులో రూ.400 కోట్ల పనులు మిగిలిపోయాయి..
- అపూర్వ స్వాగతం పలికిన ప్రజలకు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు
- కార్యకర్తలతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
(కూసుమంచి, నమస్తే తెలంగాణ) ఖమ్మం, పాలేరు నియోజకవర్గ కార్యకర్తలకు జిల్లా కేంద్రంలో త్వరలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లండించారు. కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం మంత్రి తుమ్మల కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం జిల్లాకు కేసీఆర్ రానున్నారని, ఏర్పాట్లు చేయాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సారి ప్రతీ మండలానికి ఐదురోజుల చొప్పన సమయాన్ని కేటాయిస్తానని తెలిపారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆరే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణలో జరిగిన గణనీయమైన అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉండాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకొంటున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి త్వరలో ముఖ్యమంత్రి సభ ఉంటుందని తెలిపారు. ప్రచారానికి అంతా సిద్ధం కావాలని సూచించారు. ప్రతి మండలానికీ ఐదు రోజుల చొప్పున తాను ప్రచారం చేస్తానన్నారు. ఓటర్ల చేర్పుల సమయం ఈ నెల 25 వరకూ ఉన్నందున అందరూ కొత్త ఓటర్ల చేర్పులపై దృష్టి సారించాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు అణుగుణంగా చేపట్టిన పనులు నిరాటంకంగా జరగాలంటే,సంక్షేమం, అభివృద్ధి తెలంగాణ ప్రజల ముంగిటకు చేరాలంటే మళ్లీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావాలని, సీఎంగా కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తుమ్మల అన్నారు. కూసుమంచిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం తుమ్మల టీఆర్‌ఎస్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తా కొత్త ఓటర్ల చేర్పులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. ఏ మండలంలో ఎన్ని ఓట్లు చేర్పించారు? అనే విషయాలను నాలుగు మండలాల టీఆర్‌ఎస్ అధ్యక్షులు బొల్లపల్లి సుధాకర్‌రెడ్డి, బెల్లం వేణు, వెన్నెపూజల సీతారాములు, బోడా మంగీలాల్‌లను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువగా కొత్త ఓటర్లను చేర్పించాలని కోరారు. ఏ రోజుకు ఆరోజు మండలాల్లో జరుగుతున్న చేర్పులు మార్పులపై సమాచారాన్ని సేకరించాలని సూచించారు.
త్వరలో జిల్లాకు సీఎం రాక.. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో ఎన్నికల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ జిల్లాకు త్వర లో వస్తారని మంత్రి తెలిపారు. రెండు ని యోజకవర్గాలు కలుపుకొని ఖమ్మంలో సమావేశం ఉంటుందన్నారు. రెండు నియోజకవర్గాలకు అనువుగా కూసుమంచి,ఖమ్మం రూరల్ మధ్య సభ ఏర్పాట్లు చేయాలని నాయకులు మంత్రిని కోరారు. ప్రచారం విషయంలో ప్రతి ఒక్కరూ కార్యోన్ముఖులు కావాలని కోరారు.

టూర్ బాధ్యత మండల నాయకులదే.. ఎన్నికల ప్రచార బాధ్యత మండల పార్టీ నాయకులదేనని, టూర్ ప్రోగ్రాం ఎలా ఏర్పాటు చేయాలనేది స్థానికంగా చర్చించి తెలియజేయాలని కోరారు. మండలాల్లో ఈ నెల ఆఖరి వరకూ ఒక సారి టూర్ ప్రోగ్రాం పూర్తయ్యేలా చూడాలని ప్రతి మండలానికీ ఒక రోజు చొప్పున టూర్ ఏర్పాటు చేయాలని సూచించారు. నాయకులంతా కలిసి నిర్ణయం తీసుకోవాలని తెలియజేశారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పర్యటించాల్సి ఉన్నందన ఎక్కువ సమయాన్ని పాలేరుకు కేటాయించటం సాధ్యం కాదనే విషయాన్ని కార్యకర్తలకు తెలియజేశారు.
రూ.400 కోట్ల పనులు మిగిలి పోయాయి.. పాలేరు నియోజకవర్గంలో ఇంకా రూ.400 కోట్ల పనులు మిగిలి ఉన్నాయని మంత్రి తెలిపారు. వాటిని కూడా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధిలో అంతా భాగస్వాములు కావాలని కోరారు. ఇంటింటికీ నల్లా కలెక్షన్ విషయంలో స్థానిక నాయకులు మిషన్ భగీరథ అధికారులకు తగిన విధంగా సహకారం అందివ్వాలని సూచించారు. పాలేరు నియోజకవర్గంలో 163 ఆవాస ప్రాంతాలకు ఇంటింటికీ కనెక్షన్‌లు ఇచ్చామని, ఇంకా 170 ఆవాస ప్రాంతాలకు ఇవ్వాల్సి ఉందని అన్నారు. ఎన్నికల సమయం నాటికి అంతా ఇస్తామని తెలిపారు. మంచి పనులు చేస్తున్న ప్రభుత్వానికి బాసటగా నిలవాలని కోరారు.

ఘన స్వాగతానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.. పాలేరు అభ్యర్థిగా సీఎం ప్రకటన చేసిన తరువాత జిల్లాకు ఈ నెల 14న వచ్చిన సందర్బంగా తనకు అపూర్వ స్వాగతం పలికారని, సీఎం కూడా ప్రజాదరణ విషయంలో ఆనందం వ్యక్తం చేశారని తుమ్మల పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా కదిలి ఘన స్వాగతం పలికినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ఖమ్మం రూరల్ మండలం సాయిప్రభాత్ నగర్ అభివృద్ధి కమిటీ బాధ్యులు కాంతేశ్వరరావు, వెంకటేశ్వరర్లు మంత్రి తుమ్మలను సన్మానించారు. ఐడీసీ చైర్మన్ బేగ్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, జడ్పీటీసీ రామచంద్రునాయక్, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, నాలుగు మండలాలపార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతోపాటు ఇంటూరి శేఖర్, ఉన్నం బ్రహ్మయ్య, నెల్లూరి భద్రయ్య, వీరవెల్లి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

101
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...