కూటమి కట్టినా గెలుపు టీఆర్‌ఎస్‌దే..!

Tue,September 18, 2018 12:46 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : మరికొద్ది రోజుల్లో సార్వత్రిక సంగ్రామానికి తెరలేవనున్నది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం యావత్ అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలయ్యింది. అన్నిరకాల సాంకేతికతను జోడిస్తూ తన పని తాను చేసుకుపోతున్నది. ఈ నేపధ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో తీవ్రమైన చర్చ కొనసాగుతున్నది. పది అసెంబ్లీ సెగ్మెంట్లకు టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు, వారికి ధీటైన అభ్యర్థులు కాంగ్రెస్‌లో ఎవరు..? ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎందరితో చేతులు కలిపినా ముందుకొచ్చే పోటీదారులే కానరాక హస్తం నేతలు మల్లగుల్లాలు పడుతున్నరు. ఇటీవల కాలంలో పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో కొంతమంది పేర్లు తెరమీదకు వస్తున్నప్పటికీ కారు జోరుకు తట్టుకుని నిలబడలేరని సాధారణ ప్రజలతోపాటు కాంగ్రెస్ వర్గాలు సైతం కొట్టిపారేస్తుండటం గమనార్హం. దీనికితోడు పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలు పోటీదారులను హడలిపోయేలా చేస్తున్నాయి. ఆవేశపడి రంగంలోకి దిగి ఇల్లు, ఒళ్లు గుళ్ల చేసుకోవటం ఎందుకని ఎవరికి వారే వెనకడుగు వేస్తున్నరు.

కాంగ్రెస్ వర్గపోరుకు కేరాఫ్ కొత్తగూడెం..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావు పేరు ఖరారయ్యింది. కేవలం నాలుగేండ్లలో దాదాపు రూ.2వేల కోట్ల నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన జలగం ప్రజల మనసుల్లో చెరగని ముద్రవేసుకున్నరు. పటిష్టమైన కార్యాచరణతో కొత్తగూడెం పట్టణాన్ని, సెగ్మెంట్ పరిధిలోని ఇతర ప్రాంతాలను తీర్చిదిద్దిన ఆయన గెలుపు ఇప్పటికే ఖాయమైంది. కాగా ఆయన్ని ఎదుర్కోవాలనే నెపంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నా సయోధ్య కుదిరేలా లేదు. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, ఎంపీ రేణుకాచౌదరి వర్గీయుడు ఎడవల్లి కృష్ణ టిక్కెట్ తమకే కేటాయించాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పైరవీలు చేస్తున్నరు.

రిజర్వుడ్ సెగ్మెంట్లలోనూ అవే పరిస్థితులు..
ఉభయ జిల్లాలో మూడు జనరల్, రెండు ఎస్సీ, మిగతా ఐదు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఎస్టీ రిజర్వుడ్ స్థానాలు. మధిర, సత్తుపల్లి రెండు స్థానాల్లో కాంగ్రెస్, టీడీపీ కలిసి పోటీచేయాలని భావిస్తున్నప్పటికీ సిట్టింగ్ అభ్యర్థులు మల్లుభట్టి విక్రమార్క, సండ్ర వెంకటవీరయ్యపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు. వారు ఎమ్మెల్యేగా కొనసాగిన కాలంలో నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషిచేయలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మధిర నుంచి పోటీచేస్తున్న లింగాల కమల్‌రాజ్, సత్తుపల్లిలో బరిలోకి దిగుతున్న పిడమర్తి రవి ఈదఫా ఖచ్చితంగా గెలిచితీరుతరనే ప్రచారం జోరుగా సాగుతోంది. వైరా, అశ్వారావుపేట, భద్రాచలం సెగ్మెంట్ల పరిధిలో కాంగ్రెస్, టీడీపీల నుంచి ఎవరు పోటీచేస్తరో ఇప్పట్లో తేలేలా లేదు. వైరా నియోజకవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషిచేసిన టీఆర్‌ఎస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్, అశ్వారావుపేటను కొత్త పుంతలు తొక్కించిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు గెలుపు నల్లేరు మీద నడకేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నవి. పినపాకలో కాంగ్రెస్ తరుపున మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేరు వినిపిస్తున్నది. కానీ గత నాలుగేండ్ల కాలంలో మారుమూల ప్రాంతాల అభివృద్ధికి, అడవి బిడ్డల సంక్షేమానికి అహోరాత్రులు శ్రమించిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రజల మనసుల్లో ప్రత్యేకస్థానం సంపాదించారు. భద్రాచలంలో సైతం టీఆర్‌ఎస్ నుంచి బరిలోకి దూకుతున్న తెల్లం వెంకట్రావ్ గెలుపు ఇప్పటికే ఖాయమైందనే ప్రచారం జోరుగా సాగుతున్నది.

ఖమ్మంలో కానరాని అభ్యర్థులు..
వచ్చే సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఒక్కటే ఒంటరిగా బరిలోకి దిగుతున్నది. సీఎం కేసీఆర్ సారధ్యంలో ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై నెలకొన్న కొండంత విశ్వాసంతో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యింది. ఆ పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే సత్తాలేక కాంగ్రెస్, తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడిన టీడీపీ, వామపక్షాల్లో ఒకటైన సీపీఐ కూటమిగా ఏర్పడ్డాయి. పొత్తుల పేరుతో కుంపటి రాజేసుకుని ఖమ్మం, భద్రాద్రి జిల్లాల ప్రజల ముందుకు రావాలని నిశ్చయించుకున్నాయి. కానీ..! ఉభయ జిల్లాల పరిధిలో అత్యంత బలమైన శక్తిగా ఎదిగిన టీఆర్‌ఎస్ పార్టీని ఎదురొడ్డి కాంగ్రెస్ లేదా దాని మిత్రపక్షాల తరుపున నిలబడే నాయకుడెవరన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

పాలేరులో పోటీకి దిగేవారెవరు..?
తెలంగాణ ఆవిర్భావానికి పూర్వం పాలేరు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరం అని నిస్సంకోచంగా చెప్పారు. ప్రస్తుతం పాలేరు అంటే అభివృద్ధికి కేరాఫ్ అని, ఈ ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందని ప్రతిఒక్కరూ మాట్లాడుతున్నరు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి మరణానంతరం జరిగిన ఉప ఎన్నికల్లో గులాబీ అభ్యర్థిగా బరిలోకి దిగి అఖండ మెజారిటీతో గెలుపొందిన రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారధ్యంలో పాలేరు పరవశించి పోతున్నది. ఈ నేపధ్యంలో రాజకీయ భీష్ముడిగా, అభివృద్ధి ప్రదాతగా ముద్రపడిన తుమ్మలను ఢీకొట్టగలిగే నాయకుడు ఆయా పార్టీలకు ఇప్పటికీ దొరకలేదు.

దూకుడుపెంచిన టీఆర్‌ఎస్ అభ్యర్థులు..
ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ సాధారణ సంగ్రామానికి శంఖారావం పూరించటంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు చాపకింద నీరులా ప్రజల్లోకి చొచ్చుకుని వెళుతున్నరు. హంగూ, ఆర్భాటాలకు దూరంగా ఉభయ జిల్లాల పరిధిలోని పది అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఊరూ, వాడా తిరుగుతూ ప్రజామద్దతు కూడగడుతున్నరు. ఆత్మీయ సమ్మేళనాలు, సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తూ గెలుపు బాటలు వేసుకుంటున్నరు. అభ్యర్థుల ప్రచారానికి మెచ్చిన ఇరు జిల్లాల ఓటర్లు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పదికి పది అసెంబ్లీ సెగ్మెంట్లలో గులాబీకే పట్టం కడతామని ప్రతిజ్ఞ చేస్తుండటం గమనార్హం.

142
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles