టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిద్దాం


Tue,September 18, 2018 12:44 AM

కొత్తగూడెం, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్రంలోని కోల్‌బెల్టు ఏరియాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులుగా పోటీలో ఉన్న వారిని భారీ మెజార్టీతో గెలిపించాలని సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీఆర్‌ఎస్ అనుబంధ టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు బీ వెంకట్రావ్, మిరియాల రాజిరెడ్డి అన్నారు. సోమవారం బస్టాండ్ సెంటర్‌లోని టీబీజీకేఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. సింగరేణి చరిత్రలో ఏ యూనియన్ చేయలేని పనులు టీబీజీకేఎస్ చేసిందని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన కార్మిక సంఘాలకు కేసీఆర్ బాసటగా నిలిచారన్నారు. సకల జనుల సమ్మె జీతం, తెలంగాణ ఇంక్రిమెంట్, ఎనిమిదవ వేజ్‌బోర్డు వేతనాలను కార్మికులకు ఇప్పించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని అన్నారు.

సింగరేణి కార్మికులకు కరెంటు ఖర్చులను రద్దు చేయాలని ఎంతో కాలంగా యాజమాన్యానికి విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోతే కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొని కార్మికులకు కరెంటు ఖర్చులు తగ్గించారన్నారు. కార్మికులకు చనిపోతే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇప్పించారని, కార్మికుల పక్షపాతి కేసీఆర్ అని అన్నారు. తండ్రీకొడుకుల ఉద్యోగాలు ఇప్పించేందుకు సీఎం కృషి చేస్తే జాతీయ కార్మిక సంఘాలు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసి కారుణ్య నియామకాలను అడ్డుకున్నారని ఆరోపించారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎంపీ కల్వకుంట్ల కవిత నాయకత్వంలో కార్మికులంతా ఐక్యంగా కలిసి పని చేసి తెలంగాణ రాష్ట్రంలోని టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తామన్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రతిపాదించిన అభ్యర్థి జలగం వెంకటరావును గెలిపించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. పార్టీలో యూనియన్ నాయకుల్లో కొంత అసంతృప్తి ఉన్నా వాటంతటా అవే తొలగిపోతాయని, అందరూ కలిసి కట్టుగా పని చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడం జరుగుతుందన్నారు. సీఎం చేసిన పనులే తెలంగాణలో అభ్యర్థుల విజయానికి దోహదపడతాయని అన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కొత్తగూడెం కార్పొరేట్, ఏరియా ఉపాధ్యక్షులు ముప్పాని సోమిరెడ్డి, ఎండీ రజాక్, రీజియన్ కమిటీ మెంబర్ కూసన వీరభద్రం, కాపు కృష్ణ, రాజలింగం, హరిలాల్, రవీందర్, ఎస్‌కే గౌస్, ప్రభాకర్, ఎండీ గౌస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...