గాంధీభవన్ ఎదుట కొత్తగూడెం కాంగ్రెస్ లొల్లి..


Wed,September 12, 2018 01:17 AM

-పొత్తుల్లో ఇతర పార్టీలకు కేటాయించరాదని డిమాండ్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్‌లో అసెంబ్లీ సీట్ల కోసం లొల్లి మొదలైంది. జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గ సీటును పొత్తుల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు వర్గీయులు మంగళవారం హైదరాబాద్ వెళ్లి గాంధీభవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ వీధుల్లో తొలుత ప్రదర్శన నిర్వహించిన కొత్తగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ వనమా అనుచరులు గాంధీభవన్‌కు చేరుకొని తమ డిమాండ్‌తో కూడిన నిరసనను పార్టీఅధిష్టానానికి తెలిపేందుకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. దీంతో కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుల్లో సీటు ఏ పార్టీకి దక్కుతుందనే అంశంపై ఆ పార్టీ అధిష్ఠానాలు ఒక నిర్ణయానికి రాకముందే కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని డిమాండ్ చేయడంతో పొత్తుల వ్యవహారం ఫలిస్తుందా లేదా అనే విషయంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీలోని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి ప్రధాన అనుచరునిగా, టీపీసీసీ కార్యవర్గ సభ్యుపిగా ఉన్న ఎడవల్లి కృష్ణకు కొత్తగూడెం సీటును కేటాయించాలని ఆయన అనుచరులు జిల్లా కేంద్రంలోని రేణుకా చౌదరి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు. మాజీ మంత్రి వనమా, ఎంపీ రేణుకా చౌదరి అనుచరుడు ఎడవల్లి కృష్ణ కాంగ్రెస్ పార్టీ పరంగా కొత్తగూడెం అసెంబ్లీ స్థానంపై గురిపెట్టారు. పొత్తుల్లో భాగంగా సీపీఐ, టీడీపీలు కూడా కొత్తగూడెం అసెంబ్లీ సీటును తమకు కేటాయించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు తనయుడు వనమా రాఘవేందర్‌రావు ఆధ్వర్యంలో గాంధీభవన్ ఎదుట వనమా అనుచరులు జడ్పీటీసీ గిడ్ల పరంజ్యోతి, పాల్వంచ సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావుతో పాటు ఎంపీటీసీలు జక్కుల నళిని, మోతి, రాంనాయక్, శారద పాల్గొన్నారు. మధిర తాజా, మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కను కలిసి వనమా అనుచరులు కొత్తగూడెం టిక్కెట్‌ను కాంగ్రెస్ పార్టీకే కేటాయించాలని విన్నవించారు.

గత ఎన్నికల్లో కూడా పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించడంతో మాజీ మంత్రి వనమా కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీ చేసిన విషయం తెలిసిందే. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కొత్తగూడెం అసెంబ్లీ స్థానంపై పొత్తుల్లో భాగంగా సీపీఐకి కేటాయించే అవకాశాలు ఉన్నట్లు సంకేతాలు అందడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి వనమా అనుచరులు ఏకంగా గాంధీభవన్ ఎదుట బలప్రదర్శన ద్వారా తమ ఉనికిని చాటిచెప్పారు. ఏది ఏమైనప్పటికీ పొత్తులు కుదరకముందే కత్తులు నూరుకునే వాతావరణం నెలకొంటోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

134
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...