రిటర్నింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

Wed,September 12, 2018 01:16 AM

-వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ రజత్‌కుమార్ షైనీ
భద్రాచలం, నమస్తే తెలంగాణ: పోలింగ్ కేంద్రాలను రిటర్నింగ్ అధికారు లు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు అందజేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ షైనీ అన్నారు. మంగళవారం భద్రాచలం ఐటీడీఏ సమావేశపు హాలు నుంచి జిల్లాలోని అందరు తహసీల్దార్లతో ఎన్నికలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... తహసీల్దార్లు మండలంలోని ప్రతీ హ్యాబిటేషన్‌లో పర్యటించి గ్రామానికి పోలింగ్ కేంద్రానికి ఎంత దూరం ఉందో వివరాలను ఎన్నికల అధికారుల ద్వారా ధ్రువీకరించి శనివారం నాటికి తమకు పంపాలని తెలిపారు. జిల్లాలో కొత్త ఓటరు నమోదు, ఓటరు జాబితాలో తప్పులను సరిచేయుట, అభ్యం తరాలు తదితర వాటిపై 7,556 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణమే అవి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పోలింగ్ కేంద్రాలు గ్రామానికి దూరంగా ఉన్నట్లయితే తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు అందజేసినట్లయితే వాటిని మార్చుటకు రాష్ట్ర ఎన్నికల అధికారి ద్వారా ఎన్నికల సంఘానికి సిఫారస్ చేయనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఓటరు జాబితా నుంచి మరణించిన వారి పేరును తొలగించేందుకు ఆయా పార్టీల ఏజెంట్లు సహకారాన్ని తీసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లో మరణించిన వారి పేరు ఓటరు జాబితాలలో ఉండటానికి వీల్లేదని, పోలింగ్ కేంద్రాలు, సెక్టార్, రూట్ మ్యాప్‌లు తయారు చేయాలని ఎన్నికల అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. ప్రతీ పోలింగ్ కేంద్రానికి రహదారి సౌకర్యం ఉండాలని ఆ విధంగా ఎక్కడైనా లేనట్లయితే తక్షణమే తమకు నివేదికలు పంపాలన్నారు. పోలింగ్ కేంద్రాలలో విద్యుత్ సమస్యల లేకుండా చూడాలని, అదేవిధంగా మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. మండల స్థాయిలో అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహించాలని, ఇప్పటికే కొన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగిందని, ఎక్కడైనా నిర్వహించకపోతే రెండు రోజుల్లో నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఐటీడీఏ పీవో పమేలా సత్పతి, భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్‌మిశ్రా తదితరులు పాల్గొన్నారు.

148
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles