మావోయిస్టుల చేతిలో గాయపడిన వ్యక్తి మృతి


Wed,September 12, 2018 01:13 AM

మరొకరి పరిస్థితి విషమం
దుమ్ముగూడెం/చర్ల, సెప్టెంబరు 11 : మావోయిస్టుల చేతిలో గాయపడి ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. చర్ల మండలం కుర్నపల్లి గ్రామానికి చెందిన ఇర్పా వెంకటేశ్వర్లు, ఇర్పా నాగేశ్వరరావు, ఇర్పా సుశీల, ఇర్పా నర్సింహారావు, చిట్టిబాబు, పూనెం సర్వేశ్వరరావులను శుక్రవారం అర్ధరాత్రి మావోయిస్టులు వారి స్థావరానికి తీసుకువెళ్లారు. గత రెండు నెలల క్రితం మావోయిస్టు డిప్యూటీ దళకమాండర్ అరుణ్‌కుమార్(సుంకరి రాజ్‌కుమార్) పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన నేపథ్యంలో వీరిపై అనుమానం వచ్చిన మావోలు వీరిని ఇంటి నుంచి అటవీప్రాంతంలోకి తీసుకువెళ్లారు. సోమవారం 50మంది గ్రామస్తులు అటవీ ప్రాంతానికి వెళ్లగా ప్రజాకోర్టు ఏర్పాటు చేసి వీరికి శిక్ష విధించినట్లు తెలిసింది. అనంతరం ఎన్‌కౌంటర్ ఎలా జరిగిందనే దానిపై గ్రామస్తులను మావోలు ప్రశ్నించినట్లు తెలిసింది. ప్రజాకోర్టులో శిక్ష అనంతరం వీరిని గ్రామస్తులతో పంపిస్తూ వైద్యం ఎక్కడా చేయించకుండా ఇంటి వద్దే నాటువైద్యం చేయించాలని, ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని హెచ్చరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇర్పా వెంకటేశ్వర్లు పరిస్థితి విషమించడంతో భద్రాచలం తరలిస్తుండగా సీతానగరం చేరుకోగానే మార్గమధ్యలో మృతిచెందాడు. అయితే మరో వ్యక్తి ఇర్పా నాగేశ్వరరావు పరిస్థితి విషమంగా ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా మృతదేహానికి చర్ల సీఐ సత్యనారాయణ, ఎస్సై రాజువర్మలు పోస్టుమార్టం నిర్వహించి కేసునమోదు చేసినట్లు తెలిసింది.

119
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...