టీఆర్‌ఎస్ దూకుడు..!

Tue,September 11, 2018 12:40 AM

-సార్వత్రిక పోరుకు సై..అంటున్న టీఆర్‌ఎస్ శ్రేణులు
-జిల్లాలో ప్రచార పర్వం షురూ..!
-గ్రామ, వార్డుల స్థాయిలో కమిటీలు
-పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచారానికి ఏర్పాట్లు
-కొత్తగూడెంలో డిజిటల్ స్క్రీన్ ద్వారా జలగం వినూత్న ప్రచారం
-కోరం ఆధ్వర్యంలో నేడు ఇల్లెందులో భారీ ర్యాలీ
-పార్టీ ముఖ్యనాయకులతో పాయం, తాటి సమావేశం
-దుమ్ముగూడెంలో తెల్లం ఆధ్వర్యంలో పార్టీలో చేరికలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లా వ్యాప్తంగా టీఆర్‌ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని నేతలు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో నామినేషన్ల ప్రక్రియ కంటే ముందుగానే, ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు ఎవరన్నది ఇంకా తేలకముందే.. టీఆర్‌ఎస్ పార్టీ పరంగా అభ్యర్థుల విషయంలో ఎలాంటి అపోహలకు, అనుమానాలకు, సందిగ్ధతతకు తావు లేకుండా పార్టీ రథసారధి, సీఎం కేసీఆర్ ముందుగానే జిల్లాలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ప్రచారం విషయంలో టీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ముందుకెళ్తోంది. ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అభ్యర్థులు ఎవరు, పొత్తుల వ్యవహారం ఎలా కొలిక్కివస్తుందనే సందేహాలతో సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతున్నారు. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, అనుబంధ సంఘాల వారు వివిధ రూపాల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి తమవంతు కర్తవ్యం నిర్వర్తిస్తూ నామినేషన్ల ప్రక్రియ తరువాత వినూత్న రీతిలో ప్రచారం చేపట్టాలని యోచిస్తున్నారు. ఎన్నికల బరిలో ఓటర్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్‌ఎస్ అభ్యర్థులు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. సోమవారం టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు పోలింగ్ బూత్‌ల వారీగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను ఎన్నికల ప్రచారానికి సమాయత్తం చేసేందుకు సమావేశాలు నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన ప్రజాసంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలిపేందుకు గ్రామం, పట్టణం, వార్డుల స్థాయిల్లో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు కమిటీలు ఏర్పాటు చేసుకొని ముందుకెళ్లాలని పార్టీ బాధ్యులకు సూచించారు.

కొత్తగూడెం నియోజకవర్గ అభ్యర్థి జలగం వెంకటరావు కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ముఖ్య కార్యకర్తలను కలిసి ఓటర్ల జాబితాలో సవరణలు, కొత్త ఓటర్ల నమోదుపై దిశానిర్దేశం చేశారు. ప్రత్యేక వ్యూహరచనతో చేసిన కార్యక్రమాలనే ప్రజలకు తెలిపి రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి, తిరిగి కేసీఆర్ సీఎం కావడానికి కృషి చేయాలన్నారు. రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గంలో ప్రగతి రథచక్రం ఆగిపోకుండా కొనసాగాలంటే టీఆర్‌ఎస్‌ను ప్రజలు ఆశీర్వదించాలని, ఆ దిశగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని సూచించారు. మంగళవారం ఇల్లెందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య పదివేల మందితో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు, సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్ నాయకులు గ్రామాల్లు, బొగ్గుగనుల వద్ద విస్తృత ప్రచారం చేశారు. భద్రాచలం నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావ్ దుమ్ముగూడెంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. అశ్వారావుపేట నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై పోలింగ్ బూత్‌ల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయాలని సూచించారు. పినపాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? అనే అంశంపై చర్చించారు. ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఒక ప్రణాళికా బద్ధంగా ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు.

కొత్తగూడెంలో డిజిటల్ ప్రచారం..
టీఆర్‌ఎస్ పార్టీలోనే ఒక ప్రత్యేకతగా నిలిచి ఉమ్మడి జిల్లాలోని పది స్థానాల్లో 2014లో జరిగిన ఎన్నికల్లో ఏకైక టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఘన విజయాన్ని సాధించిన మాజీ ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావు వినూత్న ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సోమవారం కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో డిజిటల్ స్క్రీన్‌తో ప్రత్యేక వాహనం ద్వారా నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ సహకారంతో చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై 45 నిమిషాల నిడివి గల దృశ్యరూపకాన్ని సుజాతనగర్ మండల కేంద్రంలో ప్రదర్శించారు. ఈ ప్రత్యేక ప్రచార వాహనం జిల్లాలోనే టీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో తొలి ప్రచార వాహనంగా ఈ ఎన్నికల్లో ఒక స్పెషాలిటీని సంతరింపజేసుకుంది. గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కళ్లకు కట్టినట్లు ప్రజలకు చూపించడంతో పాటు టీఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించి తిరిగి కేసీఆర్‌ను సీఎంగా చేయాలనే సంకల్పంతో ఈ దృశ్యరూపకాన్ని ప్రజలకు చూపిస్తున్నారు.

జలగం వెంకటరావుకు పూసల సంఘం మద్దతు..
జిల్లా పూసల సంఘం ప్రతినిధులు కొత్తగూడెం నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావుకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్వచ్ఛందంగా లక్ష్మీదేవిపల్లిలోని ఆయన క్యాంపు కార్యాలయానికి వచ్చి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సంఘం తరఫున టీఆర్‌ఎస్ అభ్యర్థి జలగం వెంకటరావును గెలిపించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. వెంకటరావును అభినందించి పుష్పగుచ్ఛాలు అందజేశారు. శాలువతో సత్కరించారు. పూసల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పొదిలి సరవయ్య, పొదిలి ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు ముదరకోళ్ల సత్యం, గౌరవ సలహాదారుడు మద్దినేని వెంకటేశ్వర్లు, ప్రతినిధులు సంగు కృష్ణ, లక్ష్మణ్‌రావు, నరేష్, మురళి, ముదరకోల మహేష్, శ్రీనివాస్, సత్యం, పొదిల నర్సింహారావు, రాధాకృష్ణ, గీత, మంగమ్మ, పద్మావతి, చిన్నా, మురళి, బోసు, చిన్న వెంకటేశ్వర్లు, గోపిరాజ్, గిరి, శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, సారయ్య, నర్సింహారావు మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు.

మద్దతు ప్రకటించిన మాజీ సైనిక ఉద్యోగులు
కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాజీ సైనిక ఉద్యోగులు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకటరావును కలిసి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా కొత్తగూడెం నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్ఛం అందజేసి తమ మద్దతును ప్రకటించారు. గౌడ సంఘం అధ్యక్షుడు మోడెం మోహన్‌రావు కూడా తన మద్దతు ప్రకటించి శుభాకాంక్షలు
తెలిపారు.

పాయం సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరికలు
మణుగూరు, నమస్తేతెలంగాణ : టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు. పినపాక నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తా అని పినపాక నియోజకవర్గం టీఆర్‌ఎస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం వివిధ గ్రామాల నుంచి 50 మంది యువకులు టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి అనంతరం మాట్లాడారు. ప్రజలందరూ టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో కీసర శ్రీనివాసరెడ్డి, పల్లపు తిరుమలేష్, బర్ల సురేష్, విజయ్‌కుమార్, శ్రీకాంత్, ఇజాజ్, లోకేష్, బ్రహ్మతేజ పాల్గొన్నారు.

190
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles