ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి

Tue,September 11, 2018 12:39 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : జిల్లాలో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే జోషి కలెక్టర్ రజత్‌కుమార్ శైనీని ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ సాధారణ పరిపాలన కార్యాలయం నుంచి ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్తగూడెం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్ షైనీ, ట్రైనీ కలెక్టర్ ఇలా త్రిపాఠి, భద్రాచలం సబ్ కలెక్టర్ భవేష్ మిశ్రా, ఓఎస్డీ ఉదయ్‌కుమార్‌రెడ్డి, జేసీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎస్ జోషి మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రీఅండ్ ఫెయిర్‌గా నిర్వహించడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనందున బదిలీ అయిన ఎన్నికల విధులను నిర్వహించే అధికారులను తక్షణం విధుల నుంచి విడుదల చేయాలని, విడుదలైన అధికారులు బదిలీ అయిన స్థానంలో మంగళవారం నాటికి విధుల్లో చేరేలా చూడాలని ఆదేశించారు. విధుల్లో చేరని ఎన్నికల అధికారులపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యాన్ని పురస్కరించుకొని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ముందుగానే పోలింగ్ కేంద్రాలను పరిశీలన చేసి ఏర్పాట్లలో లోపాలు లేకుండా చూడాలన్నారు.

ఎన్నికల నిర్వహణ సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని, ఈవీఎంలు భద్రపరిచేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల సంఘం పర్యవేక్షణ ఉంటుందని, అందువల్ల అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పినపాక నియోజకవర్గానికి ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న భద్రాచలం ఐటీడీఏ ఎస్‌డీసీ బదిలీ అయినందున, ఆ స్థానంలో ఎన్నికల విధుల నిర్వహణకు మరో అధికారిని నియమించాలని కలెక్టర్ రజత్‌కుమార్ కోరారు. ఎన్నికల అధికారుల నియామకానికి సంబంధించి జాబితా పంపుతున్నట్లు సీఎస్‌కు తెలుపగా కలెక్టర్లు పంపిన జాబితా ప్రకారం ఎన్నికల అధికారులను నియమిస్తామన్నారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. అన్ని పనులు ప్రణాళికా బద్దంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

206
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles