మత్స్య సిరి..!

Sat,September 8, 2018 12:48 AM

-నేటి నుంచి చేపపిల్లల పంపిణీ
-657 చెరువుల్లో 1.14 కోట్ల పిల్లలు
-రూ.1.35 కోట్ల నిధులు కేటాయింపు
-సింగభూపాలెంలో లాంఛనంగా చేప పిల్లలు వదలనున్న మత్స్యశాఖ
కొత్తగూడెం, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో మత్స్యకారులకు మహర్దశ పట్టింది. సీఎం కేసీఆర్ మత్స్యసంపద పెంచి మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉచితంగా చేప పిల్లలు పంపిణీ చేస్తున్నారు. దీంతో మత్స్యకారుల కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం అవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 657 చేపల చెరువుల్లో శనివారం నుంచి చేప పిల్లలు వదిలేందుకు కార్యాచరణ రూపొందించారు. జిల్లాకు రూ.1.35 కోట్ల నిధులు కేటాయిస్తూ మత్స్యశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. చేప పిల్లలను ఇప్పటికే గుత్తేదారులు టెండర్ల ద్వారా ఆంధ్రా ప్రాంతం నుంచి తీసుకొచ్చి పిల్లలను వదిలేందుకు సిద్ధమయ్యారు. జిల్లాలో 657 సీజనల్ ట్యాంకుల్లో 1,14,19,500 చేప పిల్లలను వదలనున్నారు. మరో 39 పెద్ద చెరువుల్లో 67.47 లక్షల చేప పిల్లలను వదలనున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని సుజాతనగర్ మండలంలో సింగభూపాలెం చెరువులో 7.41 లక్షల చేప పిల్లలను మత్స్యశాఖ అధికారులు వదలనున్నారు. బొచ్చ, రాగండి, మోస చేప పిల్లలను చెరువుల్లో వదలనున్నారు.

మత్స్యకారులకు నూరుశాతం సబ్సిడీ..
గత పాలక ప్రభుత్వాలు జాలరులను చిన్నచూపు చూడటంతో మత్స్యకారులు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లి నానా ఇబ్బందులకు గురయ్యారు. తెలంగాణ ప్రభుత్వం జలసిరి ఉన్న చోట మత్స్యసిరి కూడా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో 44 వేల చెరువులకు సుమారు రూ.50 కోట్ల వ్యయంతో చేప పిల్లలను మత్స్యశాఖ కార్మికులకు నూరుశాతం సబ్సిడీతో అందించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు రానున్న రోజుల్లో మత్స్య ఉత్పత్తిని పెంచేందుకు మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల కార్యక్రమాన్ని ప్రారంభించారు.

బలోపేతం కానున్న సహకార సంఘాలు...
ప్రభుత్వం నిర్ణయంతో సహకార సంఘాలు బలోపేతమవుతున్నాయి. ఉచితంగా అందించే చేప పిల్లలపై కార్మికులు దృష్టి సారించారు. సొసైటీల పరిధిలో ఉన్న వారికి వలలు, వ్యాపారాభివృద్ధికి సైకిళ్లు, నిల్వ ఉంచేందుకు ఐస్ బాక్సులు ప్రభుత్వం అందజేస్తున్నది. సొసైటీ సభ్యులకు జీవిత బీమా రూ.2 లక్షలకు పెంచింది. ఆధునిక పద్ధతుల్లో చేపల పెంపకం చేపట్టేలా మత్స్యకారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా, ఇతర రాష్ర్టాలకు పంపించి తర్ఫీదు ఇస్తుంది. కేజ్ కల్చర్ పైలెట్ ప్రాజెక్టు ద్వారా పలు జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.

జిల్లాలోని అన్ని చెరువులకూ చేపపిల్లలు
జిల్లాలో శనివారం నుంచి చేప పిల్లలను ఆయా మండలాల్లో ఉన్న చెరువుల్లో వదలనున్నారు. 35-40 మిల్లీ మీటర్ల చేపపిల్లలతో పాటు వంద మిల్లీమీటర్ల సైజు ఉన్న చేపలను కూడా ఆయా చెరువుల్లో వదలనున్నారు. 35- 40 మిల్లీ మీటర్ల చేప పిల్లలు కొత్తగూడెంలో 59 చెరువుల్లో 11.46 లక్షలు, అశ్వారావుపేటలో 133 చెరువుల్లో 26,65,500, భద్రాచలంలో 234 చెరువుల్లో 33,28,500, పినపాకలో 125 చెరువుల్లో 26,34,000, ఇల్లెందులో 96 చెరువుల్లో 14,73,000, వైరా నియోజకవర్గంలోని తొమ్మిది చెరువుల్లో 1,72,500, 80 మిల్లీ మీటర్ల నుంచి వంద మిల్లీ మీటర్ల చేపలను జిల్లాలోని 39 పెద్ద ట్యాంకుల్లో వదలనున్నారు. కొత్తగూడెంలోని ఆరు చెరువుల్లో 11,47,500, అశ్వారావుపేటలోని పది చెరువుల్లో 19,45,500, భద్రాచలంలో రెండు చెరువుల్లో 10,47,000, పినపాకలో 12 చెరువుల్లో 17,65,500, ఇల్లెందులో ఎనిమిది చెరువుల్లో 64,65,000, వైరాచెరువులో 1,95,000 పిల్లలను వదలనున్నారు.

ప్రభుత్వ సహకారం మరువలేనిది..
లింగం లక్ష్మయ్య, మత్స్య సహకార సంఘం చైర్మన్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత మత్స్యకారుల ప్రోత్సాహకాలు లభిస్తున్నాయి. కుటుంబాలకు నూరుశాతం సబ్సిడీతో చేప పిల్లలను ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. గతంలో ఎవరికి వారే చేపలను పెంచుకోవడం, విక్రయాలు సాగించడం, మధ్య దళారులు దండుకోవడం వంటివి జరిగేవి. ఇప్పుడు అలాంటి ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు సహకార సంఘాలను బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. మత్స్యకారుల కుటుంబాల్లో ప్రతి ఒక్కరూ ఈ సంఘంలో సభ్యులుగా ఉండాలి. అప్పుడే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి.

మత్స్యకారులకు అండగా ప్రభుత్వం..
వరదారెడ్డి, జిల్లా మత్స్యశాఖాధికారి
సింగభూపాలెం చెరువులో 7,41,000 చేప పిల్లలను వదులుతున్నాం.మూడు రకాల జాతుల చేపలను ఈ చెరువులో వేస్తున్నాం. గతేడాది పంపిణీ చేసిన చేపలు మత్స్యకారులు ఎదగడంతో ఆర్థికంగా బలపడ్డారు. ప్రభుత్వం మళ్లీ సీజనల్ ట్యాంకుల్లో చేపలు వదిలేందుకు రంగం సిద్ధం చేసింది. మత్స్యశాఖ జిల్లాలోని 657 చెరువులకు చేప పిల్లలు అందజేస్తుంది. ఇందుకు గాను రూ.1.35 కోట్ల నిధులు వెచ్చిస్తున్నాం.

89
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles