సింగరేణికి మరో జాతీయ స్థాయి అవార్డు

Sat,September 8, 2018 12:47 AM

-సంస్థకు దక్కిన ఎంజీఎంఐ అవార్డు
-ఢిల్లీలో అవార్డు అందుకున్న సంస్థ కార్పొరేట్ జీఎం
-సింగరేణి పురోభివృద్ధిపై ప్రశంసల వర్షం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:సింగరేణి సంస్థ శక్తి సామర్థ్యాలకు, పురోభివృద్ధికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.. ప్రముఖ ఎంజీఎంఐ (మైనింగ్ జియోలాజికల్ అండ్ మెట్లర్జికల్ ఇన్‌స్టిట్యూట్) సింగరేణి సాధిస్తున్న అత్యుత్తమ ఉత్పత్తి, ఉత్పాదకతలను పరిగణనలోనికి తీసుకొని జాతీయ స్థాయిలో భారీ బొగ్గు ఉత్పత్తి సంస్థల విభాగంలో ఎక్స్‌లెనర్స్ ఇన్ పెర్ఫార్మెన్స్ అవార్డు ప్రకటించింది. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో జరిగిన ఏడో కోల్ సమిట్ - 2018 సదస్సు ముగింపు వేడుకల్లో ఈ అవార్డును సింగరేణి సంస్థకు అందజేసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన కేంద్ర బొగ్గు, మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి అలోక్ పార్ది, ఎంజీఎంఐ అధ్యక్షుడు పీఎస్ ఉపాధ్యాయ, కోలిండియా లిమిటెడ్ మాజీ చైర్మన్ నారాయణ్ సింగరేణి సీఎండీ తరఫున హాజరైన జీఎం (కార్పొరేట్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్) వై.రాజేశ్వర్‌రెడ్డికి అందజేశారు.

సిరులవేణికి ప్రశంసల వర్షం
సింగరేణి సాధిస్తున్న విజయాలను వేదికపై పలువురు ప్రముఖులు ప్రస్తావిస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. 350 కిలో మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి, 9000 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్న సింగరేణి సంస్థ దక్షిణ భారత దేశ ఇంధన అవసరాలు తీర్చడంలో అలుపెరుగని కృషి చేస్తోందని, ఈ క్రమంలో దేశంలో భారీ స్థాయి బొగ్గు ఉత్పత్తి సంస్థలలో అగ్రగామిగా అత్యధిక బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకత సాధించి అవార్డు గెలుచుకుందని ప్రశంసించారు. అవార్డు అందుకున్న సంస్థంగా జీఎం రాజేశ్వర్‌రెడ్డి సంస్థ తరపున తన ధన్యవాదాలు తెలియజేస్తూ.. సింగరేణి సంస్థ తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ సహకారం, సీఎండీ శ్రీధర్ ప్రతిభావంతమైన నాయకత్వం కారణంగా 129 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ సాధించని వృద్ధిని, ఉత్పత్తి, ఉత్పాదకతను, లాభాలను సాధిస్తూ ముందుకు పోతుందన్నారు. అంకితభావంతో పనిచేసే కార్మికులు, అధికారులు సింగరేణి ప్రగతిలో ప్రధాన భూమిక పోషిస్తున్నారని, ఈ అవార్డు అందరికీ చెందుతుందన్నారు. సంస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే మూడు అంతర్జాతీయ స్థాయి అవార్డులను అందుకుందని, ఏషియా పసిఫిక్ ఎంటర్ ప్రైన్యూర్‌షిప్ అవార్డు, అవుట్ స్టాండింగ్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డులను సీఎండీ అందుకున్నారు. ఇటీవలనే ఏషియాలో అత్యంత విశ్వాసనీయ కంపెనీ అవార్డును డైరెక్టర్ భాస్కర్‌రావు అందుకున్నారు. మైనింగ్ మేధావులు, ఇంజినీర్లు, ఇంధన, ఖనిజ విభాగాల్లో నిష్ణాతులు, అనుభవజ్ఞులతో కూడిన ఎంజీఎంఐ సంస్థ సింగరేణిని జాతీయ స్థాయిలో అత్యుత్తమ అవార్డుకు ఎంపిక చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది. 1906లో ప్రారంభమైన ఈ స్వచ్చంద సంస్థ మైనింగ్, మెట్లర్జికల్ విభాగాల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ వస్తోంది. అదే విధంగా అత్యుత్తమ ప్రతిభావంతంగా పనిచేస్తున్న కంపెనీలకు, వ్యవస్థలకు బహుమతులు ఇస్తూ ప్రోత్సహిస్తున్నది.

94
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles