సిట్టింగులకే సీట్టు..!

Fri,September 7, 2018 01:28 AM

ఖమ్మం ప్రధానప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరనే ఉత్కంఠకు అందరి కంటే ముందుగానే టీఆర్‌ఎస్ తెరదించింది. టిక్కెట్ల కేటాయింపుపై కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి అభ్యర్థుల ప్రకటనతో పుల్‌స్టాప్ పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏడు స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్లను కేటాయించింది. మిగిలిన మూడు నియోజకవర్గాలకూ అభ్యర్థుల పేర్లను కేసీఆర్ ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం పువ్వాడ అజయ్‌కుమార్, వైరా బానోతు మదన్‌లాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీట్లు ఖరారు కాగా.. మధిర లింగాల కమల్‌రాజు, సత్తుపల్లి పిడమర్తి రవికుమార్ పేర్లు జాబితాలో ఉన్నాయి. కొత్తగూడెం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, ఇల్లెందు కోరం కనకయ్య, పినపాక పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట తాటి వెంకటేశ్వర్లు, భద్రాచలం సీటు టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకటరావుకు కేటాయించడంతో టీఆర్‌ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. మొత్తంగా టీఆర్‌ఎస్ అధినేత వ్యూహంతో ప్రతిపక్షాలకు ముచ్చెమటలు పడుతున్నాయి. గులాబీ దళం సమరోత్సాహానికి సంసిద్ధమవుతుండటంతో కాంగ్రెస్, తెదేపా, వామపక్షాలు కంగుతింటున్నాయి.

తెలంగాణలో ఎన్నికల సంగ్రామం మొదలైంది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. కొన్ని రోజులుగా ఉన్న రాజకీయ ఉత్కంఠకు కేసీఆర్ తెరదించారు. టీఆర్‌ఎస్‌కు చెందిన 105 మంది అభ్యర్థుల పేర్లు గురువారం ప్రకటించి ఒక్కసారిగా రాజకీయ ప్రకంపనలకు శ్రీకారం చుట్టారు. దేశచరిత్రలో ఏనాడు ఎక్కడా లేనివిధంగా ఇంకా తొమ్మిది నెలల గడువు ఉన్నప్పటికీ ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేబినెట్ నిర్ణయాన్ని గవర్నర్ వెంటనే ఆమోదం తెలిపారు. ఎన్నికలు జరిగే వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కేసీఆర్‌ను కోరారు. దీంతో ఒక్కసారిగా రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. దీంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో శాసనసభకు ఎన్నికలు జరగటం దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ తరఫున పోటీచేసే 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. కాగా, పూర్త ఖమ్మం జిల్లాల్లో 7 స్థానాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే తిరిగి టికెట్లు కేటాయించారు. మిగిలిన 3 నియోజకవర్గాలకు కూడా అభ్యర్థుల పేర్లు ప్రకటించారు.

ఉమ్మడి ఖమ్మంలో సిట్టింగ్‌లకే
మళ్లీ సీట్లు..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్లు ఇస్తున్నట్లు చంద్రశేఖర్‌రావు హైదరాబాద్‌లో ప్రకటించారు. ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పువ్వాడ అజయ్‌కుమార్, పాలేరు- తుమ్మల నాగేశ్వరరావు, వైరా- బాణోత్ మదన్‌లాల్, కొత్తగూడెం-జలగం వెంకటరావు, ఇల్లెందు -కోరం కనకయ్య, పినపాక- పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట- తాటి వెంకటేశ్వర్లు, మధిర- లింగాల కమల్‌రాజ్, సత్తుపల్లి- పిడమర్తి రవి, భద్రాచలం- డాక్టర్ తెల్లం వెంకట్రావ్‌లకు సీట్లు ఖరారు చేశారు. టికెట్ల కేటాయింపుపై కొన్ని రోజులుగా వివిధ నియోజకవర్గాల్లో కొనసాగుతున్న ప్రచారాలకు అభ్యర్థుల ప్రకటనతో తెర పడినట్లయింది.

పనితీరు ఆధారంగానే సీట్ల కేటాయింపు..
రాష్ట్రంలో శాసనసభ్యులు, మంత్రులు, పార్టమెంటుసభ్యుల పనితీరు ఆధారంగానే వారికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని చంద్రశేఖర్‌రావు అనేక సందర్భాల్లో ప్రకటించారు. ముఖ్యమంత్రిగా 2014 జూన్2న ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచి గురువారం అసెంబ్లీని రద్దు చేసేవరకు కూడా శాసనసభ్యుల పనితీరును తెలుసుకునేందుకు అనేక సర్వేలను చేయించారు. ప్రభుత్వం అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎమ్మెల్యేలు ఏవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో, ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉంటున్నారో.. తదతర అంశాల్లో సర్వేలు చేయించారు. వారి పనితీరుతోపాటు నియోజవకర్గంలోని ప్రజల అభిప్రాయాలు కూడా తెలుసుకున్నారు. కొన్ని సర్వేల్లో జిల్లాలో వెనుకబడిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలను హెచ్చరించిన సందర్భాలు కూడా చోటుచేసుకున్నాయి.. ఇలా వారి పని విధానం వల్లే టీఆర్‌ఎస్ అధినేత వారికి మరొకసారి టికెట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.. మధిర నియోజవర్గం నుంచి లింగాల కమల్‌రాజ్ ఆ నియోజకవర్గంలో విస్త్రతమైన పరిచయాలు ఉండటం.. గతంలో సీపీఎంలో చురుకైన పాత్ర పోషించడం వల్ల ఆయనకు సీటు ఖరారు చేశారు. అలాగే సత్తుపల్లి నియోజకవర్గం నుంచి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవికి సీటు ఖరారు చేశారు. ఈ నాలుగేండ్ల నుంచి ఆ నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. 2014 ఎన్నికల్లో కూడా పిడమర్తి టీఆర్‌ఎస్ నుంచి ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చెందారు. భద్రాచలం నియోకవర్గం నుంచి ప్రముఖ వైద్యుడు తెల్లం వెంకట్రావుకు సీటు ఖరారు చేశారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీ నుంచి భద్రాచలం పార్లమెంటు స్థానానికి పోటీచేసి ఓటమి చెందారు. రెండేళ్ల క్రితం టీఆర్‌ఎస్‌లోచేరి పార్టీ రాష్ట్ర కార్మదర్శిగా పనిచేస్తున్నారు.

2014లో జలగం ఒక్కడే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలలో కొత్తగూడెం నుం టీఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన జలగం వెంకట్రావు ఒక్కరే ఆ ఎన్నికల్లో గెలుపొందారు. మిగిలిన తొమ్మిది సీట్లలో టీఆర్‌ఎస్ ఓటమి చెందింది. ఆ తరువాత జిల్లాలో జరిగిన అనేక పరిణామాలు ఖమ్మం జిల్లాను గులాబి జిల్లాగా మార్చివేశాయి. ఖమ్మం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన పువ్వాడ అజయ్‌కుమార్, ఇదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీచేసి ఓటమి పాలైన తుమ్మల నాగేశ్వరరావు ఇద్దరు కూడా ఆర్‌ఎస్‌పార్టీలో చేరారు. అదేవిధంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ వైరా నుంచి గెలుపొందిన మదన్‌లాల్, పినపాక నుంచి గెలుపొందిన పాయం వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట నుంచి గెలుపొందిన తాటి వెంకటేశ్వర్లులు కూడా గులాబీ గూటికి రావడంతో ఆ పార్టీ మరింత బలమైన పార్టీగా అవతరించింది. అంతేకాకుండా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీగా గెలుపొందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇల్లెందు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందిన కోరం కనకయ్య కూడా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. దీంతో ఉమ్మడి ఖమ్మంలో గులాబీ జెండాకు తిరుగులేకుండా పోయింది. ఆ తరువాత జరిగిన పాలేరు ఉప ఎన్నికల్లో, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తిరుగులేని విజయం ఎగురవేసింది. జిల్లాలో మిగిలిన అన్ని పార్టీల కంటే టీఆర్‌ఎస్ అతిపెద్ద పార్టీగా

దటీజ్ చంద్రశేఖర్‌రావు..
ఎవరూ ఊహించని రీతిలో సిటింగ్‌లకు సీట్లు కేటాయించి మాట నిలబెట్టుకున్న వ్యక్తి కేసీఆర్. ఆయన ఆశీర్వాదంతో ఖమ్మం ఖిల్లాపై గులాబీ జెండా ఎగురవేస్తాం. ఇప్పటికే ఆశించిన స్థాయిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ప్రజల మద్దతు పొందాం.ప్రజలందరూ టీఆర్‌ఎస్ పార్టీతోనే ఉన్నారు.. ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపట్టారు.. అందుకే ప్రజలు కేసీఆర్ విశ్వసిస్తున్నారు.. జిల్లాలో అన్ని సీట్లు గెలుచి కేసీఆర్‌కు కానుకగా అందిస్తాం. రాష్ట్ర ప్రజలందరూ మళ్లీ ఆయన్నే సీఎం కావాలని కోరుకుంటున్నారు. తప్పకుండా ప్రజలందరూ టీఆర్‌ఎస్ పార్టీని ఆశీర్వదిస్తారు..
-పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం టీఆర్‌ఎస్ అభ్యర్థి


ఇచ్చిన మాటకు కట్టుబడే నాయకుడు కేసీఆర్..
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడు కేసీఆర్. సిట్టింగ్‌లందరికీ రానున్న ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తానని చెప్పి ఆ హామీ ప్రకారమే ఇవ్వడం గొప్ప విషయం. దేశంలోనే ఇలాంటి నాయకుడు ఒక్కరూ కూడా లేరు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు విజయం చేకూర్చేలా చేస్తాయి. ఈ నాలుగు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి దేశంలోని ఏరాష్ట్రంలో కూడా జరుగలేదు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని ప్రతీ కుటుంబం లబ్ధి పొందింది. ఆయన్నే మళ్లీ ప్రజలు ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు.
-బానోత్ మదన్‌లాల్, వైరా టీఆర్‌ఎస్ అభ్యర్థి

విద్యార్థి ఉద్యమకారునిగా లభించిన గుర్తింపు..
తెలంగాణ రాష్ట్ర సాధనలో విద్యార్థి ఉద్యమ నాయకునిగా పాల్గొని రాష్ట్రం సాధించిన తరువాత కేసీఆర్ నిర్ణయంతో గత ఎన్నికల్లో సత్తుపల్లి నుంచి పోటీ చేశాను. ఆయన సహకారంతో నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. సత్తుపల్లి నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు ఆశీసులతో, జలగం వెంకటరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మువ్వా విజయబాబుల సహకారంతో భారీ మెజార్టీతో సాధిస్తా.. కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలు పార్టీకి శ్రీరామరక్షగా నిలుస్తాయి.. రాష్ట్ర ప్రజలందరూ చంద్రశేఖరుని వైపే ఉన్నారు.. తప్పకుండా గెలుపు మాదే..
-డాక్టర్ పిడమర్తి రవి, సత్తుపల్లి టీఆర్‌ఎస్ అభ్యర్థి

కేసీఆర్‌కు రుణపడి ఉంటా..
నాపై నమ్మకం ఉంచి మధిర సీటు కేటాయించిన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కు రుణపడా ఉంటాను. రానున్న ఎన్నికల్లో మధిరలో టీఆర్‌ఎస్ గెలుపునకు కృషిచేస్తాను. ఈ నాలుగు ఏండ్లలో ప్రభుత్వం అమలు చేసిన పథకాలే నా విజయానికి దోహదం చేస్తాయి. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే అభ్యర్థులను ప్రకటించడం నిజంగా గ్రేట్. తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాసరెడ్డిల సహకారంతో భారీ మెజార్టీ సాధిస్తాం..ప్రతిపక్షాలు ఎన్ని కుయుక్తులు పన్నినా విజయం మాదే.. కేసీఆర్ అన్నివర్గాల ప్రజలకు ప్రవేశపెట్టారు.. అవి చాలు గెలుపుఖాయం..
-లింగాల కమల్‌రాజ్, మధిర టీఆర్‌ఎస్ అభ్యర్థి

చరిత్ర సృష్టించారు..
టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయాలు రాజకీయ మేధావులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. దేశంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి టికేట్లు కేటాయించడంలో చరిత్ర సృష్టించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 105 మందికి సీట్లు ఇవ్వడం ఎంతో మంచి నిర్ణయం. సిట్టింగ్‌లు అందరికీ సీట్లు ఇవ్వడంతో గెలుపు ఖాయమైనట్లే. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే తీర్పును ప్రజలు ఇవ్వనున్నారు. నాలుగేళ్లలో ఇప్పటి వరకు ప్రజాసంక్షేమానికి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.. అన్నీ ప్రజాకర్షక పథకాలే.. సునాయసంగా గెలిపిస్తాయి..
-తాత మధు, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి

టీఆర్‌ఎస్‌దే అధికారం..
టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న అసెంబ్లీ రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆయనకు మద్దతుగా ప్రతి నేత ఉన్నారు. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసమే. దూరదృష్టి ఉన్న నాయకుడు.. ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తున్న అబివృద్ధి, సంక్షేమ పథకాలు మున్ముందు కూడా అమలు కావాలంటే టీఆర్‌ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలి. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. మరోసారి కేసీఆర్‌ను సీఎంగా ఎన్నుకుంటేనే రాష్ట్రం ముందుకు వెళ్తుంది.. రాష్ట్రంలో అమలైన అనేక అభివృద్ధి, సంక్షేమ ఫలాలతో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా తెలంగాణ వెలుగొందుతోంది..
-పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ

కేసీఆర్‌కు ప్రత్యేక అభినందనలు..
రానున్న ఎన్నికల కోసం కొత్తగూడెం శాసనసభ స్థానం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు కేసీఆర్‌కు ప్రత్యేక అభినందనలు. ఆయన చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోనే ముందుకు వెళ్తాను. కేసీఆర్, నియోజవర్గ ప్రజల ఆశీసులతో మళ్లీ గెలిచి, నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తాను. 2014 ఎన్నికల్లో కేసీఆర్, నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో గెలిచాను. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారిగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గులాబీజెండా రెపరెపలాడించిన అదృష్టం నాకు దక్కింది.
-జలగం వెంకటరావు, కొత్తగూడెం టీఆర్‌ఎస్ అభ్యర్థి

నమ్మకం, విశ్వాసాన్ని నిలబెట్టుకుంటా..
నాపై నమ్మకం, విశ్వాసంతో పినపాక నియోజకవర్గ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు పార్టీని మరింత బలోపేతం చేస్తాను.. భారీ మెజార్టీతో గెలిచి పార్టీ అధినేత కేసీఆర్‌కు బహుమతిగా అందజేస్తాను. పినపాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమంతోనే భారీ మెజార్టీ ఖాయమైంది.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి దేశానికే ఆదర్శమం.. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలే నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తాయి.. మళ్లీ సీఎం కేసీఆరే తప్పకుండా అవుతారు..
-పాయం వెంకటేశ్వర్లు, పినపాక టీఆర్‌ఎస్ అభ్యర్థి

ప్రజలతో మమేకమై ముందుకు సాగుతా..
టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇల్లెందు అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు కృతజ్ఞతలు. గడిచిన నాలుగున్నరేళ్లలో నియోజకవర్గంలో ఊహించని అభివృద్ధి జరిగింది. వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధి చేశాం. రెండు జిల్లాలకు తలమానికమైన సీతారామ ప్రాజెక్టు రిజర్వాయర్ నియోజకవర్గంలో ఏర్పాటు కానుంది. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేయడంలో నావంతు పాత్ర పోషించా.. నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ పార్టీని బలమైన శక్తిగా నిలబెట్టా.. కార్యకర్తలతో సన్నిహిత సంబంధాలు, ప్రజలతో మమేకమై సేవా స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాను. నాకు టికెట్ ఖరారైనందుకు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటురన్నారు. పేరుపేరునా ప్రతీఒక్కరికి ధన్యవాదాలు..
- కోరం కనకయ్య, ఇల్లెందు టీఆర్‌ఎస్ అభ్యర్థి

గెలిచి కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతా..
అసెంబ్లీ రద్దు చేసి ప్రజల ఆశీస్సుల కోసం ముందుకు వెళ్తున్న కేసీఆర్‌కు అన్నివర్గాల ప్రజల మద్దతు కచ్చితంగా ఉంటుంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు పార్టీ గెలుపునకు దోహదం చేస్తాయి.. దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే ప్రగతి సాధించటంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించాను. నా పనితీరు. చిత్తశుద్ధిని గమనించి కేసీఆర్ టికెట్ కేటాయించటం ఆనందంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఆయన నమ్మకాన్ని నిలబెడతా...
-తాటి వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట టీఆర్‌ఎస్ అభ్యర్థి

ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తాం..
నాపై ఎంతో నమ్మకముంచి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ కేటాయించినందుకు ఎంతో రుణపడి ఉంటాను. ప్రజల ఆశీర్వాదంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తప్పక గెలుస్తాను. టికెట్ లభించడం ఎంతో ఆనందంగా ఉంది.. టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే పార్టీ విజయానికి ప్రధాన భూమిక పోషిస్తాయి.. నియోజకవర్గంలోని అన్నిప్రాంతాల్లో పర్యటించి పార్టీ బలోపేతానికి కష్టపడతాను. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అహర్నిశలూ శ్రమిస్తాను.
-భద్రాచలం టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ తెల్లం వెంకట్రావ్

138
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles