ముగిసిన రంగస్థల సంబురాలు

Mon,June 26, 2017 01:41 AM

చర్ల, జూన్ 25: తెలంగాణ సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీదేవభక్తుని నందీశ్వరుడు నాటక కళాపరిషత్ నిర్వహించిన రంగస్థల సంబురాలు ఆదివారంతో ముగిశాయి. మూడురోజులపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల నలుమూలల నుంచి వచ్చిన నాటక సమాజాలు ఈ సంబురాలలో పాల్గొన్నాయి. సమకాలీన సమాజంలోకి; సామాన్య, మధ్యతరగతి ప్రజల జీవితాలలోకి తొంగిచూసే ఎన్నో సమస్యలతోపాటు ప్రజల్లో సామాజిక చైతన్యం కలిగించే ఇతివృత్తాలు తమ నాటికల్లో చొప్పించి అర్థవంతంగా చెప్పడంలో నాటక సమాజాల వారు కృతకృత్యులయ్యాయి. మూడురోజులపాటు జరిగిన రంగస్థల సంబురాలు పండుగ వాతావరణాన్ని తలపింపజేశాయి.

నిరంతర కళాపోషణలో అగ్రభాగాన నిలిచే చర్ల నాటకరంగం రంగస్థల సంబురాల ద్వారా మరోమారు తన ఆదిపత్యాన్ని నిరూపించుకుంది. మూడు దశాబ్దాలుగా రాష్ట్రస్థాయి నాటికపోటీలు నిర్వహిస్తున్న చర్ల నాటకరంగం నుంచి ఎందరో కళాకారులు వెలుగుచూశారు. సుదీర్ఘంగా నాటక పరిషత్‌లు నిర్వహించిన చరిత్ర కలిగిన చర్ల మరోమారు తనకు నాటకరంగం పట్ల ఉన్న మక్కువను నాటక సంబురాల ద్వారా నిరూపించుకుంది.

హైదరాబాద్ వారి నాటిక మాతృక..
శ్రీదేవభక్తుని నందీశ్వరుడు నాటక పరిషత్ నిర్వహించిన నాటక సంబురాలలో మూడో రోజైన ఆదివారం యంగ్ థియేటర్ ఆర్గనైజింగ్ విజయవాడ వారి ప్రదర్శన అనగనగా, సిరిమువ్య కల్చరల్ హైదరాబాద్ వారు ప్రదర్శించిన మాతృక నాటికలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. అనాథ శరణాలయాల్లో ఉండేవారంటే గాలికి కొట్టుకువచ్చిన వారన్న ఏహ్యభావం, చీత్కారంగా చూసే సమాజంలో అన్నిటినీ భరిస్తూ ఉన్నత చదువులు చదివి సమాజంలో అడుగుపెట్టిన ఓ అనాథ ఎదుర్కొన్న చేదు అనుభవాలను మాతృకలో నాటికలో ఆనాథ పాత్రధారి సృజన్ పాత్రధారి మంజునాథ్ సమర్థవంతంగా పోషించాడు.

తనబతుకు ఛిద్రం చేసి తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసిన పరిస్థితులను ఎదుర్కొని ఓ బిడ్డకు తల్లయి కొడుకును ప్రేమగా పెంచి కొడుకుకు పెండ్లి చేసేందుకు చేసే ప్రయత్నంలో అనాథవంటూ సమాజం హేళనచేసిన, చేస్తున్న సమయంలో అనాథ స్త్రీ నిర్మలాదేవి పాత్రధారిని సురభి ప్రభావతి అభినయం ఆకట్టుకుంది. తనపుట్టుక గురించి, తండ్రి గురించి ఆరా తీస్తూ అవమానింపబడిన అనాథ కొడుకు పాత్రధారి నటన నాటకాన్ని రక్తికట్టించాయి. అనాథల జీవితాలకు అద్దం పడుతూ సాగిన మాతృక నాటికలో నటించిన మిగిలిన నటులు పాత్రోచితంగా రక్తి కట్టించారు.

విజయవాడ వారి నాటిక అనగనగా..
రాచరికమైనా, ప్రజాస్వామ్యమైనా, మరింకేదయినా దోపిడీకి గురైనప్పుడు ఉద్యమాలు తప్పవు. అటువంటి ఉద్యమాలు రావటానికి నెలలు, సంవత్సరాలు, యుగాలు పట్టొచ్చు. ప్రజలు మాత్రం విజృంభించటం ఖాయం అని తెలియజేప్పే ప్రయత్నం చేశారు విజయవాడ వారి యంగ్ థియేటర్ ఆర్గనైజింగ్ వారు అనగనగా నాటికలో. మంచివాడికి మాటంటే ప్రాణం. చెడ్డవాడికి స్వార్థం అంటే మక్కువ.

మాట మీద నిలబడ్డ సత్యహరిశ్చంద్రుడు వారసులకు దక్కింది ఏమిటి? అని ప్రశ్నిస్తూ సాగిన అనగనగా.. నాటిక రాచరిక వ్యవస్థలో బానిసలుగా బతికిన ఎందరో నిర్భాగ్యులు తిరుబాటుచేసే దృశ్యాలు నాటిక ప్రదర్శనను ఉన్నతస్థాయికి తీసుకువెళ్ళాయి. రాచరికపునాటి ఆహార్యం, హావభావ ప్రదర్శనను ఆసాంతం తిలకించేలా చేశాయి. ఈ నాటిక ప్రదర్శన ఇతివృత్తం ఒకప్పటికీ దోపిడీ, పీడనను ఇందులో పాల్గొన్న కళాకారులు కళ్ళకు కట్టినట్టు చూపారు. వారి అభినయం, హావభావ ప్రదర్శన ప్రశంసనీయంగా ఉంది. అనగనగా నాటిక ప్రదర్శన మంచి అనుభూతిని కలిగించింది.

87
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles