సీఎం ఆశించిన మిగులు విద్యుత్‌ను సాధిస్తాం


Thu,January 12, 2017 01:02 AM

-కేటీపీఎస్ ఏడోదశలో డిసెంబర్ నాటికి విద్యుదుత్పత్తి
-అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి
-25 వేల మెగావాట్ల ఉత్పత్తికి తెలంగాణ రాష్ట్రం
-దుష్టశక్తుల పన్నాగాల వల్లే ఆటంకాలు
-రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి

కొత్తగూడెం ప్రతినిధి, నమస్తే తెలంగాణ :విద్యుత్ ఉత్పాదనరంగంలో చేపట్టిన, చేపట్టనున్న అన్ని ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తామని, పాల్వంచలోని కేటీపీఎస్ ఏడోదశ విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయని, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఉత్పత్తి జరగనుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జీ.జగదీశ్‌రెడ్డి చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) ఏడోదశ విస్తరణ పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఆరోదశలో ఉత్పత్తి జరుగుతోన్న విధానాన్ని కంట్రోల్‌రూమ్ ద్వారా పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీపీఎస్ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడేళ్లలో 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించి మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా మార్చాలనే సంకల్పంతో కృషిచేస్తున్నామన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో సిబ్బంది ఇందుకోసం నిరంతరం శ్రమిస్తున్నారన్నారు.

ఆశించిన స్థాయిలో పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, సీఎం కేసీఆర్ నిర్దేశించిన విధంగా రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి, కొత్త ప్రాజెక్టుల రూపకల్పన వేగంగా జరుగుతోందన్నారు. గృహ, పారిశ్రామిక, వ్యవసాయ వినియోగదారులకు కరెంటు సమస్యలు ఉత్పన్నం కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి కూడా అనేక సమస్యలు ఉన్నప్పటికీ విద్యుత్‌ను కొనుగోలు చేసి సరఫరా చేశామన్నారు.

సీఎం కేసీఆర్ స్వీయ పర్యవేక్షణ వల్ల కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్, సింగరేణి జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లు త్వరిత గతిన పూర్తి చేసుకొని ఉత్పత్తి చేసుకోగలిగామన్నారు. త్వరలో కేటీపీఎస్, బీటీపీఎస్, యాద్రిద్రి, ఎన్‌టీపీసీ, సింగరేణి పవర్‌ప్లాంట్ మూడో యూనిట్, కేటీపీపీలో మరో యూనిట్‌లు పూర్తి కానున్నాయని, కేటీపీఎస్‌లోని పాత స్టేషన్లను తొలగించి ఎనిమిదో దశ విస్తరణ చేపడతామన్నారు. కొన్ని దుష్టశక్తుల పన్నాగాల వల్లే మణుగూరులో నిర్మిస్తోన్న భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నిర్మాణానికి ఆటంకాలు ఏర్పడ్డాయన్నారు.

ఇటీవల కాలంలోనే ఆ దుష్టశక్తుల చీడ వదిలిందన్నారు. ఈనెల 20న బీటీపీఎస్‌కు సంబంధించి అన్ని క్లియరెన్సులు రాగానే పనులు చేపట్టి 2018 మార్చి నాటికి విద్యుత్ ఉత్పత్తి జరిగే విధంగా తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. రైతులకు కూడా 24గంటలు విద్యుత్ సరఫరా చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఏకైక లక్ష్యమన్నారు. ప్రస్తుతం విద్యుత్ డిమాండ్ 8320 మెగావాట్లకు చేరిందన్నారు. 2014 జూన్‌లో 6500 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ డిమాండ్ కేవలం రెండున్నరేళ్లలోనే 8320 మెగావాట్లకు పెరగడాన్ని చూస్తే పారిశ్రామిక, గృహ, వ్యవసాయ వినియోగం పెరిగిందనడానికి నిదర్శమన్నారు.

ఈ విషయంపై ప్రతిపక్షాలు చేస్తోన్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. వాస్తవ అభివృద్ధిని చూడాలన్నారు. ట్రాన్స్‌కో, జెన్కో సిబ్బంది అన్ని స్థాయిల్లో నిరంతర కృషితో పనిచేయడం వల్లే విద్యుత్ రంగంలో తెలంగాణ రాష్ట్రం తలెత్తుకొని నిలబడగలిగిందన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి రానున్న రోజుల్లో 25 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు సహకరించాలన్నారు.

నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు రూ.2500 కోట్లతో డిస్ట్రిబ్యూషన్, హెచ్‌టీ లైన్స్, సబ్ స్టేషన్లను నిర్మించి విద్యుత్ సరఫరాలో అవాంతరాలను తొలగించామన్నారు. గతంలో తెలంగాణ ప్రాంత ప్రజలను రెండోతరగతి ప్రజలుగా చూశారని, ఇక్కడ జరిగే విద్యుత్ ఉత్పత్తిని ఆంధ్రాకు సరఫరా చేసి తెలంగాణ రైతులు వ్యవసాయం బంద్ పెట్టుకునే విధంగా పక్షపాతాన్ని ప్రదర్శించారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టారని, దీని వల్ల రైతులు, అన్ని వర్గాల వినియోగదారులు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, జెన్కో డైరెక్టర్ రాధాకృష్ణ, జాయింట్ కలెక్టర్ ముస్త్యాల రాంకిషన్ ఈ విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు.

తొలిసారిగా కేటీపీఎస్‌ను సందర్శించిన విద్యుత్‌శాఖ మంత్రి


తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి పర్యటన సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జీ.జగదీశ్‌రెడ్డి తొలిసారి కేటీపీఎస్‌ను సందర్శించారు. పాల్వంచలోని కేటీపీఎస్ 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఏడో దశ నూతన కర్మాగారాన్ని బుదవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సందర్శించారు. తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ 2017 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఆయన మంగళవారం రాత్రి కేటీపీఎస్ గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. మంత్రి గా పదవీ బాద్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటి సారిగా కేటీపీఎస్‌ను సందర్శించారు. బుదవారం ఉదయం 9.15గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి ఆయన కొత్తగూడెం ఎమ్మేల్యే జలగం వెంకటరావుతో కల్సి నేరుగా కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారంలోకి అడుగు పెట్టారు.

నూతన కర్మాగారంలోని చిమ్నీ, బాయిలర్, ఈఎస్పీలతో పాటుగా పవర్‌హౌస్ సందర్శించారు. ఆయా విభాగాలను క్షుణంగా పరిశీలించారు. ఆయన వెంట ఉన్న టీఎస్ జెన్కొ డైరెక్టర్ (ప్రాజెక్స్) సి.రాధాకృష్ణ ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రగతిని గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. యూనిట్‌కు సంబంధించిన లొకేషన్ మ్యాప్‌ను కూడా మంత్రి పరిశీలించారు. యూనిట్‌లోని పనులను 2017 డిసెంబర్ 31వ తేదీ కల్లా పూర్తి చేయనున్నట్లు డైరెక్టర్ ఈ సందర్బంగా మంత్రికి వివరించారు. పనులను మరింత వేగవంతం చేసి అనుకున్న సమయాని కల్లా విద్యుత్ ఉత్పత్తి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం ఆయన కేటీపీఎస్ 6వ దశ కర్మాగారాన్ని సందర్శించారు. ఈ యూనిట్‌లోని యుసీబీలోని కంప్యూటర్లలలో విద్యుత్ ఉత్పత్తి సంబంధించిన వాటిని పరిశీలించారు.

అ తర్వాత 6వ దశలోని ట్రైనింగ్ సెంటర్‌లో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, జెడ్పీ చైర్మన్ గడిపెల్లి కవిత, వైస్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, జెన్కొ సివిల్ సీఈ అజయ్, కేటీపీఎస్ సీఈలు మంగేష్ కుమార్, పి.రత్నాకర్, ఏడో దశ ఎస్‌ఈలు ఎం శ్రీనివాసరావు, యుగపతి, ఎల్లయ్య, డీఈలు శ్రీనివాసరావు, కిరణ్ కుమార్ టీఆర్‌ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, టీఆర్‌ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, విద్యార్థి విభాగం నాయకుడు ఎండి మసూద్ తదితరులు పాల్గొన్నారు.

56
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS