తొలిసారిగా కేటీపీఎస్‌ను సందర్శించిన విద్యుత్‌శాఖ మంత్రి


Thu,January 12, 2017 12:56 AM

పాల్వంచ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి పర్యటన సందర్భంగా రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జీ.జగదీశ్‌రెడ్డి తొలిసారి కేటీపీఎస్‌ను సందర్శించారు. పాల్వంచలోని కేటీపీఎస్ 800 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఏడో దశ నూతన కర్మాగారాన్ని బుదవారం తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి సందర్శించారు. తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ 2017 డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చిన ఆయన మంగళవారం రాత్రి కేటీపీఎస్ గెస్ట్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకున్నారు. మంత్రి గా పదవీ బాద్యతలు చేపట్టిన తర్వాత మొట్ట మొదటి సారిగా కేటీపీఎస్‌ను సందర్శించారు.

బుదవారం ఉదయం 9.15గంటలకు గెస్ట్‌హౌస్ నుంచి ఆయన కొత్తగూడెం ఎమ్మేల్యే జలగం వెంకటరావుతో కల్సి నేరుగా కేటీపీఎస్ ఏడో దశ కర్మాగారంలోకి అడుగు పెట్టారు. నూతన కర్మాగారంలోని చిమ్నీ, బాయిలర్, ఈఎస్పీలతో పాటుగా పవర్‌హౌస్ సందర్శించారు. ఆయా విభాగాలను క్షుణంగా పరిశీలించారు. ఆయన వెంట ఉన్న టీఎస్ జెన్కొ డైరెక్టర్ (ప్రాజెక్స్) సి.రాధాకృష్ణ ను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లోని ప్రగతిని గురించి కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు. యూనిట్‌కు సంబంధించిన లొకేషన్ మ్యాప్‌ను కూడా మంత్రి పరిశీలించారు. యూనిట్‌లోని పనులను 2017 డిసెంబర్ 31వ తేదీ కల్లా పూర్తి చేయనున్నట్లు డైరెక్టర్ ఈ సందర్బంగా మంత్రికి వివరించారు.

పనులను మరింత వేగవంతం చేసి అనుకున్న సమయాని కల్లా విద్యుత్ ఉత్పత్తి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. అనంతరం ఆయన కేటీపీఎస్ 6వ దశ కర్మాగారాన్ని సందర్శించారు. ఈ యూనిట్‌లోని యుసీబీలోని కంప్యూటర్లలలో విద్యుత్ ఉత్పత్తి సంబంధించిన వాటిని పరిశీలించారు. అ తర్వాత 6వ దశలోని ట్రైనింగ్ సెంటర్‌లో ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే జలగం వెంకటరావు, జెడ్పీ చైర్మన్ గడిపెల్లి కవిత, వైస్ చైర్మన్ బరపటి వాసుదేవరావు, జెన్కొ సివిల్ సీఈ అజయ్, కేటీపీఎస్ సీఈలు మంగేష్ కుమార్, పి.రత్నాకర్, ఏడో దశ ఎస్‌ఈలు ఎం శ్రీనివాసరావు, యుగపతి, ఎల్లయ్య, డీఈలు శ్రీనివాసరావు, కిరణ్ కుమార్ టీఆర్‌ఎస్ మాజీ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్, టీఆర్‌ఎస్ యువజన విభాగం మాజీ అధ్యక్షుడు మంతపురి రాజుగౌడ్, విద్యార్థి విభాగం నాయకుడు ఎండి మసూద్ తదితరులు పాల్గొన్నారు.

50
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS