24 గంటల విద్యుత్ సరఫరాకు చర్యలు


Thu,January 12, 2017 12:56 AM

అశ్వాపురం, జనవరి 11 : మిగులు విద్యుత్ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాద్రి పవర్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, 24గంటల విద్యుత్ సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. అశ్వాపురం మండలం మొండికుంటలో రూ.కోటి ముప్పై లక్షల నిధులతో నిర్మించిన 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను బుధవారం ఆయన రోడ్లు, భవనాలశాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు 5,800 మెగావాట్ల విద్యుత్ ఉండేదని ప్రస్తుతం 8,230 మెగావాట్ల విద్యుత్‌కు చేరుకున్నామన్నారు.

కోటి ఎకరాల సాగుకు కావలసిన విద్యుత్ సరఫరాను అందించడానికి నూతన కర్మాగారాలు నిర్మించడానికి వాటికి అవసరమైన నిరంతర విద్యుత్‌ను సరఫరా చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా కృషిచేస్తున్నారన్నారు. వ్యవసాయ సాగుకు పగలు 9గంటల నిరంతర విద్యుత్‌ను ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టంగా చర్యలు చేపట్టిందన్నారు. 24గంటల విద్యుత్ సరఫరా కోసం ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని, ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు కలుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు.

విద్యుత్ తయారీ కోసం ప్రస్తుతం నడుస్తున్న యూనిట్లను మరింత విద్యుత్ సామర్ధ్యం పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదివేల మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యాన్ని పెంచామన్నారు. రాబోయే మూడు సంవత్సరాలలో 25వేల మెగావాట్ల విద్యుత్ సామార్థ్యాన్ని పెంచి మిగులు విద్యుత్ ఉండేలా సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నారన్నారు. భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఎన్నో కుయుక్తులు పన్నుతూ పర్యావరణ పరిరక్షణ సాకుగా చూపుతూ పవర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారన్నారు.

భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం ఇప్పటికే సీఎం కేసీఆర్ కేంద్ర విద్యుత్‌శాఖ మంత్రితో చర్చించారని ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. మార్చి చివరికల్లా భద్రాద్రి పవర్ ప్రాజెక్టు నిర్మించి తీరుతామన్నారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మారుమూల గ్రామానికి వెళ్లినా నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టిందన్నారు. అందులో భాగంగానే అవసరమైన ప్రాంతాలలో కోట్ల రూపాయల నిధులు ఖర్చు పెట్టి విద్యుత్ సబ్‌స్టేషన్‌లు నిర్మిస్తుందన్నారు. తొలుత టీఆర్‌ఎస్ నాయకులు మంత్రులకు ఘనస్వాగతం పలికారు.

మంత్రి జగదీశ్‌రెడ్డి విద్యుత్ సబ్‌స్టేసన్‌ను ప్రారంభించి సబ్‌స్టేషన్ కార్యాలయాన్ని ప్రారంభించారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు స్విచ్ ఆన్‌చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, బూర్గంపహాడ్ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ విజయనిర్మల, ఎంపీపీ కొల్లు మల్లారెడ్డి, అశ్వాపురం జడ్‌పీటీసీ తోకల లత, మణుగూరు జడ్‌పీటీసీ పాల్వంచ దుర్గ, ఎంపీటీసీలు బలరాం, సావిత్రి, సర్పంచ్‌లు కొమరం ప్రబ, బేతం మల్లీశ్వరి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కారం శ్రీను, తెల్లం వీరబద్రం, టీఆర్‌ఎస్ నాయకులు ఆకిటి రవీందర్‌రెడ్డి, జాల రామకృష్ణారెడ్డి, గజ్జల లకా్ష్మరెడ్డి, తుక్కాని మధుసూదన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కందుల క్రిష్ణార్జునరావు, ఎస్‌కె ఖదీర్, ఓరుగంటి రమేష్‌బాబు, మేడవరపు సుధీర్, మిట్టకంటి శ్రీనివాసరెడ్డి, సురకంటి వెంకటరమణారెడ్డి, ఆవుల రవి, తూము చినరాఘవులు, అధికారులు ఎన్‌పీడీసీఎల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రమేష్, డీఈలు ప్రతాపరెడ్డి, జనార్దన్, ఏడీ తిలక్, తహసీల్దార్ విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.

49
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS