రహదారుల విస్తరణ, తాగునీటి పథకాలు..


Thu,January 12, 2017 12:55 AM

ప్రణాళికాబద్ధంగా చేపట్టాలి

కొత్తగూడెం ప్రతినిధి, నమస్తే తెలంగాణ:జిల్లాలో రహదారుల విస్తరణ, తాగునీటి పథకాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు అటవీశాఖ అనుమతులు పొందాలని కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు.. అధికారులకు సూచించారు. కొత్తగూడెం నియోజకవర్గం మీదుగా వెళ్తూ జరుగుతోన్న జాతీయ రహదారులు, మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్మాణ పనులపై సంబంధించి అధికారులతో బుధవారం ఎమ్మెల్యే జలగం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. తొలుత ప్రభుత్వ భూముల సమగ్ర వివరాలు నమోదు చేయాలని ఆర్డీవోను కోరారు. వాటిని సంరక్షించేందుకు చేపడుతున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

ప్రధానంగా పాల్వంచ మండలం దంతెలబోరలో మిషన్ భగీరథ పైపులు అస్తవ్యస్తంగా వేయడంపై అధికారులను ప్రశ్నిస్తూ ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేయడం తగదని, ముందస్తుగా సంబంధిత శాఖల అధికారులు సమావేశమై సమన్వయంతో పనులు చేపడితే ప్రజల నుంచి కూడా సానుకూలత లభిస్తుందని అన్నారు. మొర్రేడువాగు, గోధుమవాగులపై జాతీయ రహదారుల వంతెనలు నిర్మిస్తున్నందున ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తమ పైప్‌లైన్లను ఏ విధంగా వేస్తే బాగుంటుందో ఇప్పటి నుంచే ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.

త్రీ ఇైంక్లెన్‌లోని పంచాయతీ కార్యాలయం వెనుక భాగంలో ఫారెస్టు సర్కిల్ కార్యాలయానికి పదెకరాలు కేటాయించనున్నామన్నారు. సింగభూపాలెం చెరువుకు సాగునీటి జలాలు పెంచే తోగువాగును ఏ విధంగా వినియోగించుకుంటే నీటితో అధిక శాతం చెరువును నింపగలుగుతామో నీటిపారుదల శాఖాధికారులు, అటవీశాఖాధికారులు చర్చించి చర్యలు తీసుకోవాలన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు కావాల్సిన భూ సేకరణపై తగిన వివరాలు సేకరించి అందుకు అనుకూలమైన ప్రణాళికలను రూపొందించాలని ఆర్డీవోను కోరారు. ఎయిర్‌పోర్ట్‌కు కావాల్సిన భూమి విషయంలో అటవీశాఖ అధికారులతో చర్చించి సర్వే చేయించి నివేదికను అందించాలన్నారు. కిన్నెరసాని టూరిజంపై సమీక్షిస్తూ అటవీసంపదను రక్షించుకునేందుకే కిన్నెరసానిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు.

జింకల పార్కు సంరక్షణకు చర్యలు చేపట్టాలని డీఎఫ్‌వోను కోరారు. కిన్నెరసాని ప్రాజెక్టు పరిసరాలు పచ్చదనంతో అందమైన స్వాగత ద్వారాలు దర్శనమిచ్చే రీతిలో చూపరులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలన్నారు. మొర్రేడువాగు బ్రిడ్జీ నుంచి లక్ష్మీదేవిపల్లి నుంచి ఇల్లెందు క్రాస్‌రోడ్ మీదుగా పాల్వంచ వరకు విస్తరింపజేస్తున్న జాతీయ రహదారి పనులను వేగవంతం చేయాలని, ఇందులో మిషన్ భగీరథ, మున్సిపాలిటీ తాగునీటి పథకాల పైపులు ఉన్నందున ప్రణాళికతో, సమన్వయంతో అధికారులు పనులు చేపట్టాలని సూచించారు. ఆర్డీవో ఎంవీ రవీంద్రనాథ్, డీఎఫ్‌వో శర్వానన్, ఆర్‌డబ్ల్యూఎస్, నేషనల్ హైవే అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు, వైల్డ్ లైఫ్ అధికారులు పాల్గొన్నారు.

51
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS