భద్రాద్రి రామాలయంలో ఘనంగా కుడాఐ ఉత్సవం

Thu,January 12, 2017 12:49 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ జనవరి11: ధనుర్మాసోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో బుధవారం బేడా మండపంలో నిర్వహించిన కూడారై ఉత్సవం కనుల పండువగా సాగింది. తొలుత ఆండాళ్ అమ్మవారికి అభిషేకం నిర్వహించారు. 108 గంగాలాలతో పాయసం వండి నివేదన గావించారు. 108 భక్తురాళ్లచే శ్రీకృష్ణాష్టోత్తరం, గోదాఅష్టోత్తరశతనామార్చన, షోడశోపచారపూజ నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆలయ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ దేవాలయంలో కూడా కూడారై ఉత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కేకేవీ బులికృష్ణ, దేవస్థానం ఈవో రమేష్‌బాబు, తహసీల్దార్ రామకృష్ణ, స్థానాచార్యులు స్థలసాయి, దేవస్థానం ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథచార్యులు తదితరులు పాల్గొన్నారు.

రామాలయంలో పుష్యమాసోత్సవాలు


భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో ఈ నెల 12 నుంచి పుష్యమాసోత్సవాలు ప్రారంభమవుతాయని దేవస్థానం ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథచార్యులు నమస్తే తెలంగాణకు తెలిపారు. ఈనెల 12న పూర్ణిమ, పునర్వసు సేవలు పురస్కరించుకొని స్వామివారికి చుట్టుసేవ, పవళింపుసేవ లేదన్నారు. 13వ తేదీ శ్రీరామ పట్టాభిషేకం, బోగి పండుగ, శ్రీగోదాకళ్యాణం, రాత్రికి తిరువీధిసేవ జరపబడునని తెలిపారు. 14న మకర సంక్రాంతిని పురస్కరించుకొని రాత్రిపూట స్వామివారికి పెద్ద రథసేవ, శ్రీకృష్ణ రాయభారం తదితర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. 15వ తేదీ తాతగుడి వద్ద దొంగలదోపు ఉత్సవం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. 16న రాపత్తు సేవలో భాగంగా స్వామివారికి కల్కీ అవతారం గావించనున్నట్లు తెలిపారు.

157
Tags

More News

మరిన్ని వార్తలు...