ఇక సిరుల పంటలు


Wed,January 11, 2017 01:47 AM


(కొత్తగూడెం టౌన్):జిల్లాలో ఇక సిరుల పంటలు పండనున్నాయి. తెలంగాణలో టీఆర్‌ఎస్ సర్కారు సంకల్పంతో జిల్లా ఇక సస్యశ్యామలం కాబోతోంది. అన్నదాతలకు పుష్కలంగా సాగునీటిని అందించడం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ పథకం అద్భుత ఫలితాన్నిస్తోంది. ఈ పథకం కింద జిల్లాలో 2427 మైనర్ చెరువులకు మోక్షం లభించింది. రెండు విడతలుగా మొత్తం 959 ట్యాంకులకు ఇప్పటికే రూ.250 కోట్లు ఖర్చు చేసింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సీతారామ ప్రాజెక్టు వరప్రదాయినిగా మారుతోంది. వీటి ద్వారా జిల్లావ్యాప్తంగా 5.75 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. జిల్లాలో 10 టీఎంసీల నీటి వృథాకు తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోంది. జిల్లాలోనే అతిపెద్ద రిజర్వాయర్‌గా రోళ్ళపాడు అవతరించనుంది. దీని ద్వారా 2.57 లక్షల ఎకరాల బీడు భూమి సాగులోకి రానుంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 16 మండలాలు, ఖమ్మం జిల్లాలో 18 మండలాలకు కలిపి మొత్తం 5.5 లక్షల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయి.

మొదటి విడత పనులు పూర్తి


జిల్లాలో మిషన్ కాకతీయ ద్వారా చేపట్టిన మొదటి విడత పనులు దాదాపు పూర్తికావచ్చాయి. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో 442 చెరువులకు రూ.95 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేయగా వాటిలో 427 చెరువుల్లో రూ.58 కోట్లతో పనులు పూర్తయ్యాయి. 30 వేల ఎకరాలు సాగులోకి వచ్చాయి. చెరువుల్లో 41 లక్షల క్యూబిక్ మీటర్ల సిల్ట్‌ను తొలగించారు. దీని స్థానంలో 1.2 టీఎంసీల నీరు ట్యాంకులో నిల్వ ఉంది.

రూ.156 కోట్లతో రెండో విడత పనులు


జిల్లాలో రూ.156 కోట్లతో 517 చెరువులకు పునర్‌వైభవం తెచ్చే విధంగా రెండో దశలో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించగా ఆ శాఖ లెక్కల ప్రకారం 223 చెరువులను రూ.56 కోట్ల నిధులతో పనులు పూర్తి చేశారు. మిగిలిన 294 చెరువులను రాబోయే మే నెలలో పూర్తి చేసేలా పనులు కొనసాగుతున్నాయి. మూడో విడత కోసం 369 చెరువుల పనులు చేపట్టేలా ఆ శాఖాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు.

జిల్లాలో 10 టీఎంసీల నీటి వృథాకు అడ్డుకట్ట


గోదావరి నుంచి ఏటా సుమారు 300 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. జిల్లాలో ఉన్న కుంటలు, చెరువులు, వాగులు, ఇతర ప్రాజెక్టుల ద్వారా గోదావరిలో 10 టీఎంసీల నీరు వృథాగా కలుస్తోంది. రెండు విడతల మిషన్ కాకతీయ పనులతో ఆ పది టీఎంసీల నీటి వృథాకు చెక్ పడినట్లయింది. జిల్లాలో 2427 మైనర్ ఇరిగేషన్ చెరువులతో 5.75 లక్షల ఎకరాలు సాగులోకి రానున్నాయి. సీతారామ ప్రాజెక్టు ద్వారా 12 మండలాల్లో 2.57 లక్షల ఎకరాలు, మీడియం ఇరిగేషన్ కింద తాలిపేరుతో 27 వేల ఎకరాలు, కిన్నెరసాకి ద్వారా 10 వేల ఎకరాలు, చిన్ననీటి పారుదల కింద మరో 18 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. ఇది వరకే 1.84 లక్షల ఎకరాలు సాగులోకి వచ్చాయి. దీంతోపాటు మైనర్ ద్వారా పినపాక నియోజకవర్గంలో 7 వేల ఎకరాలు, వివిధ చెక్‌డ్యాంల ద్వారా మరో 8 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి. పనులు పూర్తయితే కిన్నెరసాని ప్రాజెక్టు ద్వారా గోదావరిపాలయ్యే 4 నుంచి 5 టీఎంసీల నీటికి అడ్డుకట్టపడనుంది. దీంతో పాటుగా ఇతర ప్రైవేట్ కుంటలు, బోర్లు, చెక్ డ్యాంలు, రీచార్జ్ కుంటలు, ఇండోర్‌వి కలుపుకొని మరింత భూమి సాగులో ఉంది. ఇదికాక ఆర్‌ఆర్‌ఆర్ ద్వారా రిపేరు, రెనోవేటు, రీ స్టోరేట్‌లో భాగంగా రూ.96 కోట్లతో ఆ శాఖాధికారులు 76 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వాటిలో 31 చెరువులు మంజూరయ్యాయి. 24 చెరువులకు టెండర్లు సైతం పూర్తయ్యాయి. అశ్వాపురం మండలంలోని తుమ్మలచెరువు అతిపెద్ద చెరువుగా అవతరించనుంది. దీంతోపాటు సింగభూపాలెం చెరువు కూడా మినీ సాగునీటి ప్రాజెక్టుగా రూపాంతరం చెందనుంది.

జిల్లాలో అపార నీటివనరులు


జిల్లాలో మిషన్ కాకతీయతో రైతులకు ఎంతో మేలు కలుగనుంది. ఇప్పటికే మొదటి దశ పనులు పూర్తి చేశాం. రెండో దశ పనులను మే నెలలోపు పూర్తి చేస్తాం. ఆరుగురు డీఈలు, 15 మంది జేఈలతో పనులను ముమ్మరంగా చేయిస్తున్నాం. మిషన్ పునరుద్ధరణతో పూడికతీత, చెత్త తొలగింపు, తలుపులు, షట్టర్స్ రిపేర్లు, అలుగు పునరుద్ధరణ పనులను చేపడుతున్నాం. జిల్లాలో ఇప్పటికే ఉన్న 2400 చెరువుల్లో 2070 చెరువులకు జియో ట్యాగింగ్ పూర్తి చేశాం. శాటిలైట్ లింకేజీ ద్వారా వాటి వివరాలు అందరూ తెలుసుకునే వీలుంటుంది.
-వెంకటేశ్వరరెడ్డి, జిల్లా నీటిపారుదల అధికారి

65
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS