మోముల్లో చిరునవ్వు చూసినప్పుడే మాకు సంతోషం...

Wed,January 11, 2017 01:44 AM

దమ్మపేట, జనవరి10 : ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ ప్రభుత్వంలో ప్రజల ముఖాల్లో చిరునవ్వు నింపేందుకే సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జీ.జగదీశ్‌రెడ్డి అన్నారు. 5మెగావాట్ల సామర్థ్యంతో రూ.కోటి వ్యయంతో దమ్మపేట మండలంలోని గట్టుగూడెం పరిధిలోని ఐదు గ్రామాలకు సరఫరా అవ్వనున్న విద్యుత్ ఉపకేంద్రాన్ని మంగళవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే దొంగలు పడతారు, కరువు వచ్చి కకావికలమవుతుంది, రాష్ట్రమంతా అతలాకుతలమై నాశనమవుతుందన్న వారి మాటలను కల్లలు చేస్తూ అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నామన్నారు.

నిజామాబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గంలో ఇక్కడిలాగే భూగర్భ జలాలు అడుగంటిపోయి విద్యుత్‌పై ఆధారపడి వ్యవసాయం చేస్తారన్నారు. కొద్దిరోజుల క్రితం అక్కడ పర్యటించగా సర్పంచ్‌ను పిలిచి మాట్లాడేందుకు ప్రయత్నించగా సబ్‌స్టేషన్ కమిటీ చైర్మన్‌ను నా ఎదుట నిల్చోబెట్టారని, పైన పోచంపాడు ఉన్నా కిందనున్న వీరికి నీరు రాకపోవడంతో మోటర్లతోనే వ్యవసాయం చేస్తారన్నారు. రైతులందరూ కలసి మూడేండ్లుగా సబ్‌స్టేషన్ సాధన కోసం పోరాడుతున్న ఆ ప్రాంతంలో ప్రభుత్వమే డిస్కంల సహాయంతో విద్యుత్ అవసరమున్న ప్రాంతాలను గుర్తించి ముందే సర్వేచేసి సబ్‌స్టేషన్ నిర్మాణాలను పూర్తి చేస్తున్నామన్నారు. ఒకటే రోజు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 11 ప్రారంభించగా రాత్రి అల్కనూర్‌లో రాత్రి గం.12.30 అయింది. ఊరు ఊరంతా సబ్‌స్టేషన్ కోసం ఎదురు చూసిన ఆ రోజు ప్రజలంతా పండుగ చేసుకున్నారు. నాకు సంతోషమేసింది. ఇదంతా తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమైంది.

అందరి బతుకుల్లో మార్పులొచ్చాయి...


ఈ రెండున్నరేళ్లలో అందరి బతుకుల్లో మార్పులొచ్చేలా అధికార ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు ఇస్తున్న 9గంటల నిరంతర విద్యుత్‌లో ఉదయం 6గంటలు, రాత్రి 3గంటలు కావాలని రైతులంతా తమను కోరారని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ఉద్యమాలతో సాధించుకున్న రాష్ట్రంలో 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా కోసం తాము కృషి చేస్తున్నామని, అందుకు ప్రజల సహకారం తప్పనిసరన్నారు. ఇష్టంలేని వాళ్లుకూడా శభాష్ అనిపించుకునేలా దేశంలోనే సీఎం కేసీఆర్ నెంబర్‌వన్‌గా నిలిచారన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాల కల్పన, సాగునీటి ప్రాజెక్ట్‌ల నిర్మాణం, నిరంతర విద్యుత్, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు వంటి పథకాలతో అందరి బతుకుల్లో మార్పులు వచ్చాయని మంత్రి అన్నారు.తెలంగాణ ప్రజలు మన పై పెట్టుకున్న ఆశలను నిజం చేయాలనే దూర దృష్టితో సీఎం కేసీఆర్ పనిచేస్తున్నాని తెలిపారు.ప్రజల నుంచి వచ్చిన.. ప్రజల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణ ఇలా కళకళలాడుతుందన్నారు.
నా ప్రాణమున్నంతవరకు

మీకు నష్టం జరగదు : మంత్రి తుమ్మల


ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారంటే సంక్షేమం దిశగా నడుస్తున్న ప్రభుత్వ పాలనే నిదర్శనమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సొంత మండలంలో వ్యవసాయంలో అన్ని దశలను చూసి అనుభవం నాకుందని మంత్రి అన్నారు. చేతిమోటార్ల నుంచి ఇప్పుడు పాతాళానికి సబ్ మెర్సిబుల్ పంపులతో వ్యవసాయం చేస్తున్న ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అవసరమున్న చోట విద్యుత్ ఉప కేంద్రాలను నిర్మిస్తూ విద్యుత్‌ను సరఫరా చేస్తూ రైతుల పక్షాన నిలుస్తున్నామన్నామని తెలిపారు. భూగర్భ జలాలు కిందికి పోయిన దమ్మపేట మండలంలో చెరువులు తక్కువని.. అక్కడక్కడా కుంటలున్నా నీటివనరులు తక్కువ కనుక ఉన్న జలాను జాగ్రత్తగా వాడుకోవాలని సూచించారు. సీఎం దయవల్ల సీతారామ ప్రాజెక్ట్ పూర్తయితే ఈ ప్రాంతమంతా సస్యశ్యామలమవుతుందని, ఇదే నిజమైతే మనకు ఏ పదవులు అవసరం లేదన్నారు. అన్నీ అర్ధం చేసుకుంటూ ప్రజలందరికీ సేవ చేసే అధికారులు, ప్రజా ప్రతినిధులు ఇక్కడ ఉన్నారని, నేను ఎక్కడ తిరిగినా నా మనసంతా ఇక్కడే ఉంటదని తెలిపారు.

మీరు అడక్కుండానే అన్నీ చేసి పెడతానని. గున్నేపల్లి నుంచి ఆంధ్రాకు రోడ్డు వేయిస్తానని, నిజాం వేసిన ఈ స్టేట్ హైవే తప్పా నేను మంత్రి అయ్యేసరికి ఒక్క సెంటీమీటర్ కూడా లేని ఊరు లేదంటే అది మీరు నాకు అందించిన సహకారమేనన్నారు. కష్టాలన్నీ తీరే సమయం వచ్చింది కాబట్టి అందరూ కలసికట్టుగా పనిచేద్దామని సూచించారు.. ఆవులతో వ్యవసాయం చేసి అధిక దిగుబడులు పొందేందుకు దృష్టి సారించాలని.. అలాంటి రైతులను అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, దిశ కమిటీ సభ్యులు మట్టా దయానంద్, జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎంపీపీ అల్లం వెంకమ్మ, జడ్పీటీసీ సభ్యులు దొడ్డాకుల సరోజిని, సర్పంచ్‌లు నారం రాజులు, ఆంగోతు బాలాజీ, సెంట్రల్ ఆలపాటి రామచంద్రప్రసాద్, ఆత్మ చైర్మన్ కేవీ సత్యనారాయణ, ఏఎంసీ చైర్మన్ తానం లక్ష్మి, అశ్వారావుపేట ఎంపీపీ బరగడ కృష్ణ, అంకత మల్లికార్జునరావు, సత్తుపల్లి, పెనుబల్లి జడ్పీటీసీలు హసావత్ లక్ష్మి, వాంకుడోతు రజిత, ఖమ్మం సీఈఓ భారతి, ఎస్‌ఈ కే.రమేష్, విద్యుత్ సరఫరా రాష్ట్ర బోర్డు సభ్యులు బుగ్గవీటి వెంకటేశ్వరరావు, దమ్మపేట, అశ్వారావుపేట టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పానుగంటి సత్యం, బండి పుల్లారావు, జిల్లా పార్టీ నాయకులు పైడి వెంకటేశ్వరరావు, దొడ్డాకుల రాజేశ్వరరావు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కాసగాని చెన్నారావు, దారా యుగంధర్, మాళోతు భోజ్యానాయక్, కొత్తూరు వెంకటేశ్వరరావు, కోటగిరి పుల్లయ్యబాబు, ఎర్రగొర్ల రాధాకృష్ణ, కోటగిరి సత్యంబాబు, నల్లగుళ్ల రామారావు, పానుగంటి రాంబాబు, కురిశెట్టి సత్తిబాబు, కాసాని నాగప్రసాద్, యార్లగడ్డ బాబు, బిర్రం వెంకటేశ్వరరావు తదితరులున్నారు.

24గంటల పాటు విద్యుత్ ఇస్తుంది


తెలంగాణ ప్రభుత్వమే : ఎంపీ పొంగులేటితెలంగాణ రాష్ట్ర ఏర్పడితే చిమ్మచీకటితో ఉంటామన్న చివరి సీఎం ప్రకటనను తిప్పికొడుతూ ఆరు నెలలు కష్టపడి 24గంటల విద్యుత్‌ను సాధించుకున్న ఘనత మన తెలంగాణ రాష్ర్టానికే దక్కుతుంది. ఇచ్చిన మాట ప్రకారం హామీలను అన్నిటిని నెరవేరుస్తున్న టీసర్కార్ అన్ని రంగాలలో మక్కువ చూపుతూ రైతుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలిచారన్నారు. రాష్ట్ర సీఎండీ ప్రభాకర్‌రావుతో తాను మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్‌తో పాటు ధీటుగా విద్యుత్‌ను ఇచ్చేందుకు ఆనాటి నుంచే సీఎం కేసీఆర్ ప్రణాళికలు ప్రత్యేకంగా వేసి అమలు చేసిన కృషే ఇప్పుడు అటంకం లేని నిరంతర విద్యుత్ అన్నారు.

గిరిజనుల కోసం పనిచేస్తున్న


ఏకైక ప్రభుత్వం మనదే : ఎమ్మెల్యే తాటి గతంలో ఎన్నిసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు మొర పెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని... ఇప్పుడు మాత్రం ఏ ఒక్కరి నోట నుంచి విద్యుత్‌లో సమస్య ఉందని తనకు ఎవరూ చెప్పలేదు. ఉమ్మడి ప్రభుత్వంలో తీవ్రమైన సంక్షోభం ఎదుర్కోగా అధికారుల నుండి ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితోనే పాలన సాగిస్తుండతోనే నిరంతర విద్యుత్ సాధ్యపడిందన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఇబ్బందలు తెలుసుకున్న మన ముఖ్యమంత్రి అందరి సమస్యలు తీర్చేందుకు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు. విద్యుత్ సౌకర్యం అన్ని ప్రాంతాలలో ఉండేలా కృషిచేస్తూ దేశంలోనే ఎక్కడా లేనట్లుగా సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం.

30
Tags

More News

మరిన్ని వార్తలు...