విత్తన శుద్ధి కర్మాగారం సిద్ధం


Fri,December 13, 2019 11:01 PM

-నేడు నిర్మల్‌ జిల్లాలో ప్రారంభించనున్న మంత్రులు నిరంజన్‌రెడ్డి, అల్లోల
- శుద్ధి కర్మాగారంతోపాటు మూడో గిడ్డంగి ఏర్పాటు
-కర్మాగారంతో రెండు జిల్లాల రైతులకు ప్రయోజనం


నిర్మల్‌, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: జిల్లాలో నేడు (శనివారం) రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పర్యటించనున్నారు. సారంగాపూర్‌ మండలంలోని చించోలి(బి) గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన విత్తన శుద్ధి కర్మాగారం, విత్తన గిడ్డంగులను ఇద్దరు మంత్రులు ప్రారంభించనున్నారు. అనంతరం రైతులకు పంపుసెట్లను పంపిణీ చేయనున్నారు. ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో జిల్లా కేంద్రానికి సమీపంలో గల చించోలి(బి) వద్ద 36చ.మీ గ్రామం వద్ద రూ. 4.80కోట్ల వ్యయంతో విత్తన శుద్ధి కర్మాగారం, విత్తన గిడ్డంగిని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్మించింది. దీని నిల్వ సామర్థ్యం ఐదు వేల మెట్రిక్‌ టన్నులుగా ఉంది. దీనిని రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి నేడు ప్రారంభించనున్నారు.

చించోలి (బి) వద్ద సుమారు 5 ఎకరాల్లో 80వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విత్తన శుద్ధి కర్మాగారంతో పాటు మూడు విత్తన గిడ్డంగులను నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ నిర్ణయించింది. సుమారు రూ. 13.63కోట్ల వ్యయంతో వీటిని నిర్మించగా.. ఇక్కడ విత్తన ఉత్పత్తితో పాటు వాటిని నిల్వ చేసేందుకు మూడు విత్తన శుద్ధి కర్మాగారాలు, విత్తన గిడ్డంగులను నిర్మించింది. వీటిని దశలవారీగా నిర్మాణం చేపట్టింది. గతంలోనే విత్తన శుద్ధి కర్మాగారాలు, విత్తన గిడ్డంగులు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా మరో విత్తన శుద్ధి కర్మాగారంతో పాటు మరో మూడు గిడ్డంగుల నిర్మాణం పూర్తయి ప్రారంభానికి సిద్ధమైంది. ఈ మూడు గిడ్డంగుల నిల్వ సామర్థ్యం 13,500 మె.టన్నులు. గంటకు 4టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో పని చేసే నాలుగు ఆధునాతన సాంకేతిక యంత్రాలను ఉపయోగిస్తున్నారు. మూడు యంత్రాలను సోయా చిక్కుడు, శనగ (బెంగాల్‌గ్రామ్‌) విత్తనాల శుద్ధికి ఉపయోగించగా.. ఒక యంత్రాన్ని వరి ధాన్యం శుద్ధికి వాడుతున్నారు.

ఇక్కడి నుంచే విత్తనాలు పొందే అవకాశం
వరి, సోయా చిక్కుడు, శనగ పంట ఉత్పత్తులను విత్తనాల కోసం కొనుగోలు చేసి ఇక్కడే విత్తన శుద్ధి చేసి నిల్వ ఉంచుతారు. ఇకపై విత్తనాలను రైతులు ఇక్కడి నుంచే పొందవచ్చు. రైతులకు ఫౌండేషన్‌ సీడ్‌ను తెలంగాణ సీడ్స్‌ కార్పొరేషన్‌ అందిస్తుంది. రైతులు పండించిన పంటలను కార్పొరేషన్‌ పరిశీలించి ప్రమాణాల ప్రకారం ఉన్న వాటిని కొనుగోలు చేసి విత్తనాలుగా మారుస్తుంది. వీటిని ప్రభుత్వం ప్రకటించిన సబ్సిడీ ధరలకు తిరిగి రైతులకు అందించనున్నారు. ఈ విత్తన శుద్ధి కర్మాగారాలు, గిడ్డంగులతో రెండు నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల రైతులకు లబ్ధి చేకూరనుంది. నిర్మల్‌ జిల్లాలోని ముథోల్‌, నిర్మల్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాలు, ఆదిలాబాద్‌ నియోజక వర్గంలోని బోథ్‌ నియోజకవర్గ రైతులకు ప్రయోజనకరంగా ఉండనుంది.

ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌
సారంగాపూర్‌ : మండలంలోని చించోలి(బి) గ్రామశివారులో నిర్మించిన విత్తన శుద్ధి కర్మాగారాన్ని శుక్రవారం కలెక్టర్‌ ప్రశాంతి పరిశీలించారు. రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి శనివారం విత్తన గిడ్డంగి, విత్తన శుద్ధికార్మాగారాలను ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను కలెక్టర్‌ పరిశీలించారు. మధ్యాహ్నం రెండు గంటలకు మంత్రులు రానున్నట్లు తెలిపారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ తుకారాం, ఎంపీడీవో గుమ్ముల గంగాధర్‌ ఉన్నారు.

78
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles