మూగజీవాలకు రక్షణ


Thu,December 12, 2019 01:04 AM

-రవాణాకు ప్రత్యేక వాహనాలు తప్పనిసరి
-ఇష్టానుసారంగా తీసుకెళ్తే కఠిన చర్యలు
-వాహనాల యజమానులతో అధికారుల సమావేశం
-జిల్లా మీదుగా మూగజీవాల రవాణా


ఆదిలాబాద్‌ / నమస్తే తెలంగాణ ప్రతినిధి:మూగజీవాల రవాణాలో నిబంధనలు పకడ్బందీగా అమలు చేసేందుకు అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. పశువుల రవాణాలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడంతో మృత్యువాత పడుతున్నాయి. పశువులకు రక్షణ కల్పించేలా నిబంధనలు పక్కాగా అమలు చేసేందుకు రవాణా శాఖ అధికారులు వాహనాల యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా మీదుగా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు నిత్యం పశువులు రవాణా అవుతుంటాయి. పశువుల రవాణాలు అనుసరించాల్సిన నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. వాహనాల్లో పశువులకు గాలి, వెలుతురు అందేలా చూడడంతోపాటు ఆహారం, నీరు సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.

నిబంధనలు పక్కాగా అమలు
జిల్లా మీదుగా వాహనాల్లో పశువుల రవాణా ఎక్కువగా జరుగుతుంది. ఆదిలాబాద్‌ మార్కెట్‌యార్డులో పశువుల విక్రయాలు జరుగుతాయి. జైనథ్‌, బేల, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్‌, ఉట్నూర్‌ ప్రాంతాల్లో పశువుల సంత జరుగుతుంది. నాగ్‌పూర్‌ నుంచి జాతీయ రహదారి మీదుగా, చంద్రాపూర్‌ కాగజ్‌నగర్‌ ఉట్నూర్‌ మీదుగా, నాందెడ్‌ నుంచి బజార్‌హత్నూర్‌ మండలం ఘన్‌పూర్‌ చెక్‌పోస్టు నుంచి, కిన్వట్‌ నుంచి లక్ష్మీపూర్‌ చెక్‌పోస్టు మీదుగా పశువుల రావాణా కొనసాగుతోంది. లారీలు, వ్యాన్‌లు, ట్రక్కులతో పాటు ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో పరిమితికి మించి వీటిని తీసుకుపోతున్నారు. ఒక్కో వాహనంలో 20 పశువులను కింద పడవేసి తాళ్లతో కట్టి తీసుకుపోతారు. ఎద్దులు, ఆవులు, బర్రెలు, మేకలు, గొర్రెలు, కోళ్లను హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలకు తరలిస్తారు. పక్కరాష్ట్రంలోని యావత్మల్‌, కిన్వట్‌, చంద్రాపూర్‌, మాండ్వి ప్రాంతాల నుంచి లారీ, వ్యాన్‌లలో ఎద్దులు, ఆవులు, లేగ దూడలు, బర్రెలను ఒక్కో దాంట్లో 20 వరకు రవాణా చేస్తున్నారు. మూగజీవాలను వాహనాల్లో కుక్కి, పడుకోబెట్టి పైన టార్పాలిన్‌ కవర్లు కప్పి వందల కిలోమీటర్లు దూరం నుంచి ఇష్టానుసారంగా తరలిస్తుండడంతో పశువులు ఊపిరాడకం, గాయాల బారిన పడి మరణిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి జాతీయ రహదారి మీదుగా వెళ్లే వాహనాలు ఎక్కువ స్పీడ్‌తో వెళ్తుండడంతో జిల్లాలోని పలుచోట్ల పశువుల వాహనాలకు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.

ఇష్టానుసారంగా రవాణా కుదరదు
మూగజీవాల రవాణాకు సంబంధించి వాహనాలకు నిబంధనలు విధిస్తూ రవాణాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు జిల్లా రవాణాశాఖ అధికారులు లారీలు, ట్రక్‌లు, వ్యాన్‌ల యజమానులతో సమావేశాలు నిర్వహించి వారికి మూగజీవాల తరలింపులో ఎలాంటి వాహనాలు, వినియోగించాలని విషయాలపై లారీల అసోసియేషన్ల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తున్నారు. రవాణాశాఖ అధికారులు ఆదేశాల మేరకు వాహనాల యజమానులు జీవాల శరీర పరిమాణం ప్రకారం, వాహనాల్లో అవి తిరిగేంత ప్రదేశం, గాలి, ఆహారం తీసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి. సెంట్రల్‌ మోటారు వెహికిల్‌ రూల్స్‌ 125 (ఈ) ప్రకారం వాహనాలను సమకూర్చుకుని వాటిల్లో మాత్రమే పశువుల రవాణా చేయాల్సి ఉంటుంది. ఆవులు, గేదెలు రవాణా చేసే వాహనాల పరిమాణం ఒక్కో జీవానికి 2 స్కేర్‌ మీటర్లు, గుర్రాలకు 2.25, మేకలు, గొర్రెలకు 0.3 పందులకు 0.6, మేకలు, గొర్రెలకు 0.3, స్కేర్‌ మీటర్లు, కోళ్లకు 40 సెంటీ మీటర్లు ఉండాలి. ఇలాంటి వాహనాల్లో ఒక్కో దానిలో 6 పెద్ద ఎడ్లు, ఆవులు, 9 దూడలు, ఇతర చిన్న పశువులను మాత్రమే తరలించాలి. మూగజీవాలను రవాణా చేసే వాహనాలు కేవలం వాటి కోసం మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. ఇతర సరుకులు, వస్తువుల రవాణా చేసేందుకు అవకాశం లేదు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రవాణాశాఖ అధికారులు త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. పశువుల రవాణాకు వినియోగించే ఆరు టైర్లు, పది టైర్లు, ఇతర వాహనాలను నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేస్తారు. మూగజీవాల రవాణాలో నిబంధన పాటించని వాహనాల యజమానులపై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటారు.

62
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles