ఆంగ్ల ఉపాధ్యాయులు వచ్చేస్తున్నారు..


Wed,November 13, 2019 02:05 AM

ఎదులాపురం : టీచర్‌ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఇంగ్లిష్‌ మీడియం సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) నియామకానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ షెడ్యూల్‌ విడుదల చేశారు. ఈ మేరకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా విద్యాశాఖ అధికారులకు పంపారు. జిల్లా విద్యాశాఖ అధికారి రావీందర్‌రెడ్డి షెడ్యూల్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా 105 ఎస్జీటీ ఇంగ్లిష్‌ మీడియం పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల కాగా.. టీఎస్‌పీఎస్సీ నుంచి 94 మంది అభ్యర్థుల జాబితాను విద్యాశాఖకు పంపించారు. 11 మంది అభ్యర్థులకు సంబంధించి వివిధ కారణాలతో నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంత అభ్యర్థులకు ఐటీడీఏ పీవో ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ సర్టిఫికెట్ల నిజనిర్ధారణ తర్వాత పోస్టింగ్‌ ఇవ్వనున్నారు. నియామక షెడ్యూల్‌ విడుదల కావడంతో అభ్యర్థుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. వారం రోజుల్లో ఉపాధ్యాయులు విధుల్లో చేరి విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. ఖాళీలు భర్తీ కావడంతో సర్కార్‌ బడుల్లో ఇంగ్లిష్‌ మీడియం చదివే విద్యార్థులకు ఉపాధ్యాయుల కొరత తీరి నాణ్యమైన విద్య అందనున్నది.


ఇదీ షెడ్యూల్‌...
ఈ నెల 11 నుంచి 20 వరకు నియామక ప్రక్రియ జరగనున్నది. 11న ఎంపికైన అభ్యర్థుల జాబితాను జిల్లా విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. అదే విధంగా నోటీసు బోర్డుపై జాబితాను అందుబాటులో ఉంచారు. ఖాళీల జాబితాను విడుదల చేశారు. 13న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన, 14న అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించి నియామక ఉత్తర్వులు అందించనున్నారు. 15న నియామకమైన అభ్యర్థులు ఆయ పాఠశాలల్లో రిపోర్టు చేయవలసి ఉంటుంది. కౌన్సెలింగ్‌కు హాజరు కాని అభ్యర్థులకు 18న రిజిస్టర్‌ పోస్టు ద్వారా నియామక ఉత్తర్వులు పంపిస్తారు. 19న ఎంఈవో, హెచ్‌ఎంలు పాఠశాలల్లో చేరిన అభ్యర్థుల వివరాలు జిల్లా విద్యాశాఖ అధికారికి సమర్పిస్తారు. 20న పాఠశాలల్లో రిపోర్టు చేయని అభ్యర్థుల వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు టీఎస్‌పీఎస్సీకి అందజేస్తారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles