సజావుగా బస్సు సర్వీసులు


Tue,November 12, 2019 12:00 AM

-జిల్లాలో మెరుగుపడిన ఆర్టీసీ సేవలు
-యథావిధిగా నడుస్తున్న వాహనాలు
-రోడ్డెక్కిన 195 వాహనాలు
-కనిపించని ఆర్టీసీ సమ్మె ప్రభావం
ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ సమ్మె ప్రభావం లేకుండా ప్రభుత్వం చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో బస్సు సర్వీసులు సజావుగా కొనసాగుతున్నాయి. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా పట్టణాలు, పల్లెలకు బస్సులు తిరుగుతున్నాయి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విద్యాసంస్థల సమయాల్లో అధికారులు షెడ్యూల్ కన్నా ఎక్కువ ట్రిప్పులను నడిపిస్తున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా బస్సులు యథావిధిగా నడిచాయి. దీంతో ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు.


కనిపించని సమ్మె ప్రభావం
సమ్మె కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. జిల్లాలోని ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల పరిధిలో బస్సులు యథావిధిగా నడిచాయి. ఆదిలాబాద్, ఉట్నూర్ బస్ డిపోల పరిధిలో 195 వాహనాలు నడిచాయి. మారుమూల గ్రామాలకు బస్సులను నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక డ్రైవర్లు 103 మంది, కండక్టర్లు 105 మందిని నియమించారు. ఆదిలాబాద్ డిపో పరిధిలో ఆర్టీసీ బస్సులు 82 నడపాల్సి ఉండగా.. 40 బస్సులు నడిచాయి. అద్దె బస్సులు 34కు గాను 33 బస్సులు తిరిగాయి. ఉట్నూర్ డిపో పరిధిలో ఆర్టీసీ బస్సులు 27కు గాను 24 బస్సులు, అద్దె బస్సులు 5కు 5 బస్సులు నడిచాయి. రెండు డిపోల పరిధిలో క్యాబ్‌లు కాంట్రాక్ట్ క్యారేజ్‌లు 22, క్యాబ్‌లు 70 మొత్తం 195కు పైగా వాహనాలను ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడిపించారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సత్ఫలితాలు
జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్ డిపోల వద్ద భద్రతతో పాటు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తాత్కాలిక కండక్టర్లు ప్రయాణికుల నుంచి టిక్కెట్ ధరకు అదనంగా డబ్బులు వసూలు చేయకుండా అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ ఆర్‌ఎం విజయ భాస్కర్‌తో పాటు డీవీఎం, డీఎం ఇతర సిబ్బంది ప్రతిరోజూ రూట్ల వారీగా బస్సులను తనిఖీ చేస్తున్నారు. ప్రతి కండక్టర్ టీమ్స్ ద్వారా టికెట్లు జారీ చేసేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం డ్రైవర్లు, కండక్టర్లు విధుల్లో చేరడానికి హాజరు కాగానే ముందుగా వారికి పోలీసులు బ్రీత్ ఎనలైజర్ మిషన్ ద్వారా పరీక్షలు, బీపీ చెకప్ చేసిన తర్వాతే వారికి విధులను కేటాయిస్తున్నారు.

86
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles