ప్రయాణం..నిరాటంకం


Mon,November 11, 2019 12:50 AM

-మారుమూల గ్రామాలకు ఆర్టీసీ సేవలు
-నడిచిన 195 బస్సులు
-ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు
ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చేపడుతున్న ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఆదివారం ఆదిలాబాద్, ఉట్నూర్ బస్ డిపోల పరిధిలో 195 వాహనాలు నడిచాయి. మారుమూల గ్రామాలకు బస్సులను నడుపుతూ ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నారు. దీంతో జిల్లాలో ఎక్కడా ప్రయాణికులకు ఇబ్బందులు కలుగలేదు. జిల్లావ్యాప్తంగా ప్రజలు అవసరాలకు అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లను ఆధికారులు చేశారు. తాత్కాలిక డ్రైవర్లు 103 మంది, కండక్టర్లు 105 మందిని నియమించారు. ఆదిలాబాద్ డిపో పరిధిలో ఆర్టీసీ బస్సులు 82 నడపాల్సి ఉండగా..40 బస్సులు నడిచాయి. అద్దె బస్సులు 34కు గాను 33 బస్సులు తిరిగాయి. ఉట్నూర్ డిపో పరిదిలో ఆర్టీసీ బస్సులు 27కు గాను 24 బస్సులు, అద్దె బస్సులు 5కు 5బస్సులు నడిచాయి.


రెండు డిపోల పరిధిలో క్యాబ్‌లు కాంట్రాక్ట్ క్యారేజ్‌లు 22, క్యాబ్‌లు 70 మొత్తం 195కు పైగా వాహనాలను ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడిపించారు. ప్రయాణికులు గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేశాయి. ఆదిలాబాద్, ఉట్నూర్ డిపో నుంచి హైదరాబాద్‌తో పాటు అన్ని రూట్లలో బస్సులను నడుపుతున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్, రవాణా, ఆర్టీసీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాంగానే రెండు డిపోల పరిధిలో విధులకు చేరే ముందు డ్రైవర్లకు బ్రీత్ అన్‌లైజర్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రవాణాశాఖ అధికారులు పలు రూట్లలో బస్సులను తనిఖీలు చేస్తున్నారు అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో జిల్లాలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles