తేమ కష్టాలు


Sun,November 10, 2019 12:17 AM

-మారిన వాతావరణంతో రైతులకు ఇబ్బందులు
-దక్కని మద్దతు ధర
-మార్కెట్ యార్డుల్లో ఆరబెడుతున్న రైతులు
-సోయా కొనుగోళ్లకు ఆటంకం


ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి
జిల్లా వ్యాప్తంగా సోయా కొనుగోళ్లు 15 రోజులు క్రితం ప్రారంభం కాగా ఈ నెల 6 నుంచి పత్తి కొనుగోళ్లు జరుతున్నాయి. జిల్లాలోని మార్కెట్‌యార్డుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా సోయా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సీసీఐ ప్రైవేటు వ్యాపారులు పత్తిని కొంటున్నారు. వానాకాలం సీజన్‌లో పంటల సాగుకు వానలు అనుకూలించడంతో దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. మద్దతు ధరలపై ఆశలు పెట్టుకున్న సోయా, పత్తి రైతులు జిల్లాలో ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా తేమ శాతం ఎక్కువగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నారు. వానాకాలం సీజన్ ముగియగా చలికాలం ప్రారంభంలోనే పొగమంచు విపరీతంగా కురుస్తున్నది. దీనికి తోడు ఎండలు సైతం ఎక్కువగా లేకపోవడంతో పంటలో నీటి సాంద్రత అధికంగా ఉంటున్నది. 10 రోజులుగా రాత్రి, ఉదయం సమయంలో మంచు బాగా పడుతున్నది. దీంతో సోయా, పత్తి పంటలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీంతో నిబంధనల పేరిట పంట విక్రయాలు జరుగకపోవడంతో రైతులు తమ పంటలను మార్కెట్‌యార్డుల్లో ఆరబెట్టుకుంటున్నారు.

పత్తి రైతుల ఇబ్బందులు
జిల్లాలో ఐదు రోజులు కిందట పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తొమ్మిది మార్కెట్‌యార్డుల్లో అధికారులు పంట కొనుగోళ్లు జరిగేలా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,550 ప్రకటించగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ప్రైవేటు వ్యాపారులు రైతుల వద్ద నుంచి పంట కొనుగోళ్లు చేసేలా చర్యలు తీసుకున్నారు. నిబంధనల ప్రకారం సీసీఐ 8 నుంచి 12 శాతం తేమ ఉంటేనే పంటను కొనుగోలు చేస్తుంది. అంతకు మించి తేమ ఉంటే రైతులు తమ పంటను ప్రైవేటు వ్యాపారులకు విక్రయించారు. ప్రైవేటు వ్యాపారులు 8 శాతం తేమకు రూ.5000 చెల్లిస్తున్నారు. ఒక్కో శాతం పెరిగినా కొద్ది క్వింటాకు రూ.50 చొప్పున కోత విధిస్తారు. మొదటి రోజు పంట కొనుగోళ్లలో ప్రతిష్టంభన నెలకొన్నది. ఆదిలాబాద్ మార్కెట్‌యార్డులు రైతులు భారీగా పత్తిని తీసుకురాగా పంటలో తేమ ఎక్కువగా ఉండడంతో సీసీఐ కొనుగోళ్లు సరిగా జరుగలేదు. దీంతో ఎక్కువ శాతం రైతులు ప్రైవేటు వ్యాపారులకు పంటను విక్రయించారు.

రైతులు విక్రయానికి తీసుకువస్తున్న పంటలో తేమ 20 నుంచి 30 శాతం వరకు ఉంటుంది. నిబంధనల పేరిట సీసీఐ పంటను నిరాకరిస్తుండడంతో రైతులు తక్కువ ధరకు ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారు. పత్తి పంటలో తేమశాతం తక్కువగా ఉండాలంటే రైతులు పంటను ఇంటి వద్ద ఆరబెట్టుకుని తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. మార్కెట్‌యార్డుకు వచ్చిన రైతులు తేమ ఎక్కువగా ఉండడంతో అక్కడే పంటను ఎండలో ఆరబెడుతున్నారు. తేమ శాతం తగ్గిన తర్వాత సీసీఐ, ప్రైవేటు వ్యాపారులకు అమ్ముతున్నారు.

నిలిచిపోతున్న సోయా కొనుగోళ్లు
జిల్లా వ్యాప్తంగా ఆరు మార్కెట్‌యార్డుల్లో మార్క్‌ఫెడ్ ద్వారా సోయా కొనుగోళ్లు జరుపుతున్నారు. కనీస మద్దతు ధర క్వింటాకు రూ.3,710 చొప్పున రైతులు పంటను విక్రయిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా సోయా పంటలో 12 కన్నా ఎక్కువ శాతం తేమ వస్తుంది. నిబంధనల ప్రకారం పంటలో 12 శాతం వరకు తేమ ఉంటేనే కొనుగోలు చేస్తారు. దీంతో అధికారులు తరచూ కొనుగోళ్లను నిలిపివేస్తున్నారు. ఈ నెల 1 నుంచి మూడ్రోజుల పాటు పంట కొనుగోళ్లు జరుగలేదు. ఎక్కువ శాతం తేమ ఉండడంతో శనివారం నుంచి నాలుగు రోజులు పాటు అధికారులు పంట కొనుగోళ్లను నిలిపివేశారు. రైతుల పంటలో తేమ శాతం తగ్గేలా చూడాలని కోరుతున్నారు. పంటను ఆరబెట్టుకుని విక్రయ కేంద్రాలకు తీసుకురావాలని సూచిస్తున్నారు. జిల్లాలో ఆయా మార్కెట్‌యార్డుల్లో గ్రామాల వారీగా కొనుగోలు తేదీలను ముందుగా తెలియజేసి పంట విక్రయాలు జరుపుతున్నారు. రైతులు వారికి దగ్గరలోని మార్కెట్‌యార్డులకు వెళ్లి ఆరబెట్టిన పంటలో తేమ శాతం నిర్ధారించుకోవాలని, 12 వరకు తేమ ఉంటేనే విక్రయ కేంద్రాలకు తీసుకురావాలని కోరుతున్నారు.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles