పదో రోజూ సాఫీగా ప్రయాణం


Tue,October 15, 2019 01:17 AM

ఆదిలాబాద్ /నమస్తే తెలంగాణ ప్రతినిధి : ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రెవెన్యూ, రవాణా, పోలీసు, ఆర్టీసీ శాఖల అధికారులు సమన్వయంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో ఆదిలాబాద్, ఉట్నూర్ రెండు ఆర్టీసీ డిపోలు ఉండగా తాత్కాలిక పద్ధతిలో నియమించుకున్న డ్రైవర్లు, కండక్టర్‌ల ద్వారా బస్సులను నడిపిస్తున్నారు. వీటితో పాటు పూర్తిస్థాయిలో ఆర్టీసీ అద్దె బస్సులు నడిచేలా చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా 151 వాహనాలను అందుబాటులో ఉంచారు. ఆదిలాబాద్ డిపో పరిధిలో మొత్తం 111 వాహనాలను అధికారులు ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. వీటిలో 46 ఆర్టీసీ బస్సులు, 34 ఆర్టీసీ అద్దె బస్సులు, 15 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు, 20 మ్యాక్స్ క్యాబ్‌లు ఉన్నాయి.


ఉట్నూర్ డిపో పరిధిలో మొత్తం 40 వాహనాల ద్వారా ప్రయాణికులు రాకపోకలు సాగించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. 20 ఆర్టీసీ బస్సులు, 5 ఆర్టీసీ అద్దె బస్సులు, ఒక విద్యా సంస్థల బస్సుతో పాటు 14 మ్యాక్స్ క్యాబ్‌లు అందుబాటులో ఉంచారు. ఆదిలాబాద్ డిపో పరిధిలో 70 శాతం అధికారులు ఆర్టీసీ, ఆర్టీసీ అద్దెబస్సులను నడిపించగా ఉట్నూర్ డిపో పరిధిలో 80 శాతం ఆర్టీసీ, ఆర్టీసీ అద్దె బస్సులను ప్రయాణికుల రాకపోకలు సాగించేలా ఏర్పాట్లు చేశారు. పలు రూట్లలో నడుస్తున్న బస్సులను అధికారులు తనిఖీ చేస్తున్నారు. సమ్మె నేపథ్యంలో కార్మికులు ఆందోళనలు చేస్తుండగా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. డిపోల ముందు, బస్టాండ్ పరిసరాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles