వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి


Thu,September 19, 2019 12:50 AM

-ప్రబలకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలి
-జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్
-గుడిహత్నూర్‌లో రోటావైరస్ వ్యాక్సిన్ ప్రారంభం


గుడిహత్నూర్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం రోటా వైరస్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని డీఎంహెచ్‌వో తొడసం చందుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ప్రతి కుటుంబంలో అప్పుడే పుట్టిన పాప నుంచి వృద్ధుల వరకు అందరూ ఆరోగ్యంగా ఉండడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. మారుమూల గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అం దుబాటులో ఉండి చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్‌వో తొడసం చందు మాట్లాడుతూ.. వర్షాకాలంలో రోటా వైరస్ ద్వారా డయేరియా వస్తుందని, చిన్న పిల్లలకు వచ్చే రోగాల్లో డయేరియా ప్రమాదకరమన్నారు. పుట్టిన శిశువులకు 6, 10, 14వ వారాల్లో క్రమం తప్పకుండా డోసులు ఇవ్వాలని స్థానిక వైద్య సిబ్బందికి సూచించారు. అంతకుముందు రోటా వైరస్ వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీనివాస్, సూపర్‌వైజర్లు, పవార్ రవీందర్, అన్నపూర్ణ, ఏఏన్‌ఎంలు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి చిన్నారికి రోటా వైరస్ వ్యాక్సిన్ వేయాలి
ఇంద్రవెల్లి: గ్రామాల్లో నిర్వహించిన సర్వేలో భాగంగానే గుర్తించిన ప్రతి చిన్నారులకు మూడు సార్లు రోటా వైరస్ వ్యాక్సిన్ వేయాలని డీఐవో శ్రీకాంత్ అన్నారు. బుధవా రం మండలంలోని పిట్ట బొంగురం, ఇంద్రవెల్లి ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేసిన రోటా వైరస్ వ్యాక్సిన్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొని వైద్య సిబ్బందితో పాటు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశవర్కర్లకు వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించారు. ఎంపీపీ పోటే శోభాబాయి కార్యక్రమాన్ని ప్రారంభించి పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఐవో మాట్లాడుతూ.. ప్రభుత్వం పిల్లల కోసం రోటా వైరస్ వ్యాక్సిన్‌ను ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు. ప్రైవేటు దవాఖానల్లో రోటా వైరస్ వ్యాక్సిన్‌కు రూ. 4 వేల నుంచి రూ. 6 వేల వరకు ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వం ఈ వ్యా క్సిన్‌ను ప్రభుత్వ దవాఖానల ద్వారా ఉచితంగానే అందిస్తోందన్నారు. ఈ వ్యాక్సిన్‌పై జిల్లాలో 390 మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ఒక్క చిన్నారికి 2.5ఎంఎల్ వ్యాక్సిన్ వేయాలన్నారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వెట్టి గంగామణి, వైద్యు లు శ్రీధర్, శ్రీకాంత్, సాహిత్య, కో-ఆప్షన్ సభ్యుడు మిర్జా జిలానీబేగ్, ఎంపీటీసీలు ఆశాబాయి, మడావి భీమ్‌రావ్, వైద్యసిబ్బంది రాథోడ్ బాబులాల్, శ్రీనివాస్, అశోక్, జలేంధర్, వెంకటలక్ష్మి, ఆనందర్‌రావ్, విజయ్, సంతోషి, నిర్మల, సుశీల, విజయసుందరి, సునీత పాల్గొన్నారు.

59
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles