పత్తి రైతుకు బాసట


Mon,September 16, 2019 12:33 AM

-మండలాల్లోనే కొనుగోలు కేంద్రాలు
-పీఏసీఎస్, ఐకేపీల ద్వారా కొనుగోళ్లు
-నూతనంగా భీంపూర్‌లో కొనుగోలు కేంద్రం
-ఏర్పాట్లపై అధికారులకు కలెక్టర్ ఆదేశాలు


ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ : రైతుల సౌలభ్యం కోసం కలెక్టర్ దివ్యదేవరాజన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇకపై పంటలను విక్రయించేందుకు మండల కేంద్రాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మార్కెటింగ్, ఐకేపీ, పీఏసీఎస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరో నెల రోజుల్లో పత్తి సీజన్ ప్రారంభం కానుండగా.. రైతులు ఇబ్బందులు పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పీఏసీఎస్, ఐకేపీ (స్వయం సహాయక సంఘాలు)తో సీసీఐ మద్దతు ధర రూ.5,550 చెల్లించి కొనుగోలు చేయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే భీంపూర్ మండల కేంద్రంలో ప్రత్యేక కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు మేలు చేకూరనుండగా.. సర్వత్రా హర్షం వ్యక్తం అవుతున్నది.

పీఏసీఎస్, ఐకేపీ ద్వారా కొనుగోలు
రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట సాగు చేస్తారు. ఈ ఏడాది 1.93 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు కాగా.. పత్తి 1.20 లక్షల హెక్టార్లలో సాగవుతున్నది. హెక్టారుకు సుమారు 15 క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద మార్కెట్ అయిన ఆదిలాబాద్ యార్డుకు భారీ ఎత్తున రైతులు పత్తి విక్రయించడానికి తీసుకొస్తారు. ప్రతి ఏటా రైతులు మార్కెట్ యార్డులో సరైన సమయంలో తూకం కాకా.. ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది రైతులకు ఇబ్బందులు కలుగకుండా ముందస్తు చర్యలకు కలెక్టర్ మార్కెటింగ్, పీఏసీఎస్, ఐకేపీ, వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఏర్పాట్లపై ఆదేశాలు జారీ చేశారు. మండల కేంద్రాల్లో మార్కెటింగ్ గోదాముల వద్ద పీఏసీఎస్, ఐకేపీ (స్వయం సహాయక సంఘాల)తో సీసీఐ మద్దతు ధర రూ.5,550 చెల్లించి కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. ఇటు సీసీఐ సైతం కొనుగోళ్లకు సెంటర్లను గుర్తించింది. ఆదిలాబాద్‌లో 2, బోథ్, బేల, సోనాల, పొచ్చెర, నేరడిగొండ, ఇంద్రవెల్లిలో ఒకటి చొప్పున మొత్తం ఎనిమిది కేంద్రాల్లో కొనుగోలు చేయనుంది. ఈ నూతన పద్ధతి ద్వారా మండల కేంద్రాల్లో రైతుల పత్తిని కొనుగోలు చేస్తే ట్రాన్స్‌పోర్ట్ చార్జీలతో పాటు రైతులకు ఇబ్బందులు తప్పనున్నాయి.

భీంపూర్‌లో కొనుగోలు కేంద్రం
ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు బోథ్, ఆదిలాబాద్ నియోజకవర్గాల నుంచి పత్తి రైతులు విక్రయానికి తీసుకొస్తారు. భారీ ఎత్తున పత్తి వాహనాలు మార్కెట్‌కు పోటెత్తుతుండగా.. సకాలంలో పత్తి బండ్లు తూకం కాక రైతులు ప్రతి ఏటా ఇబ్బందులు పడుతున్నారు. బేలలో మార్కెట్ యార్డు ఏర్పాటు చేయగా.. జైనథ్‌లో సబ్ మార్కెట్‌యార్డు ఏర్పాటు చేశారు. దీంతో అక్కడి గ్రామాల ప్రజలు ఆయా మార్కెట్‌ల పరిధిలోని పత్తిని తూకం చేసి విక్రయిస్తున్నారు. ఇక తాంసి, తలమడుగు మండలాల రైతులు మాత్రం ఆదిలాబాద్ మార్కెట్ యార్డుకు తీసుకొచ్చి పత్తిని విక్రయిస్తున్నారు. భీంపూర్ మండలంలోని కరంజి, కరన్‌వాడీ, గుబ్‌డి, అంతర్గాం, గోముత్రి, అర్లి(టి) గ్రామాల నుంచి పత్తిని మార్కెట్‌యార్డుకు తీసుకరావాలంటే 30 నుంచి 35 కిలో మీటర్ల దూరభారం కాగా.. ట్రాన్స్‌పోర్టు చార్జీలు రైతులపై భారం పడుతున్నది. ఈ మండల రైతుల ఇబ్బందులు పడకుండా భీంపూర్‌లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ నిర్ణయించారు. ఇది అమలైతే మండలాల్లోని అన్ని గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles