పకడ్బందీగా ఓటరు జాబితా

Sat,September 14, 2019 12:52 AM

-తప్పులు లేకుండా రూపొందించేందుకు చర్యలు
-విస్తృతంగా ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రాం
-ఇంటింటా ఓటరు వివరాలు పరిశీలిస్తున్న బీఎల్‌వోలు
-సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు

(ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఓటర్ల జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఎలక్టోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రాం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్నది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలు తమ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలు తమ మొబైల్ ఫోన్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేకించి రూపొందించిన యాప్‌ను వారు ఇన్‌స్టాల్ చేసుకుని ఓటరు జాబితా ఆధారంగా తప్పులుంటే సరిచేస్తున్నారు. జిల్లాలో ఎలక్ట్రోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రాంను విజయవంతం చేసేందుకు అధికారులు సూపర్‌వైజర్లు, విద్యార్థులు, బీఎల్‌వోలకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోనేలా ఓటరు జాబితాను పకడ్బందీగా తయారు చేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘం ఎలక్ట్రోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రాంను చేపట్టింది. ఈ నెల 1 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతున్నది. కార్యక్రమంలో ప్రతి ఓటరు జాబితాలో తన వివరాలను పరిశీలించుకోవడంతో పాటు బీ ఎల్‌వోలు ఇంటింటా ఓటరు వివరాలను పరిశీలిస్తారు. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,23,243 మంది ఓటర్లు, 280 పోలింగ్ కేంద్రాలు, బోథ్ నియోజకవర్గంలో 1,93,346 మంది ఓటర్లు, 300 పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా బీఎల్‌వోలకు తమ వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌లో ఎన్నికల సంఘం ప్రత్యేకించి రూపొందించిన యాప్‌ను వారు ఇన్‌స్టాల్ చేసుకున్నారు. అనంతరం రిజ్టర్ మొబైల్ నంబర్‌తో యాప్‌లో అకౌంట్ నమోదు చేసుకున్న తర్వాత వారి పోలింగ్ పరిధిలోని ఓటరు జాబితా డౌన్‌లోడ్ అవుతుంది.

ఎలక్ట్రోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రాంలో భాగంగా బీఎల్‌వోలు ఇటింటా తిరుగుతూ ఓటరు జాబితా ఆధారంగా వివరాలు సేకరిస్తారు. ఓటర్లు తమ వ్యక్తిగత వివరాలు, పేరు, ఫొటో, పుట్టిన తేదీ, వయస్సు, చిరునామా తప్పులుంటే సరిచేసుకోవచ్చు. ఇందుకు అవసరమైన ధ్రువీకరణపత్రాలను ఓటర్లు బీఎల్‌వోలకు ఇవ్వాల్సి ఉంటుంది. పోస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, ప్రభుత్వ ఉద్యోగులకు జారీ చేసే ఐడెంటిటీ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ వాటిని చూపించాలి. ఈ కార్యక్రమంలో భాగంగా పది మంది బీఎల్‌వోలకు ఒక సూపర్‌వైజర్‌లను నియమించారు. రెవెన్యూ శాఖలో పనిచేసే వీఆర్వోలు, సీనియర్ అసిస్టెంట్‌లు, గిర్దావర్‌లు సూపర్‌వైజ్‌ర్‌గా నియమించగా వీరిపై తహసీల్దార్‌లు మండల పర్యవేక్షకులుగా కొనసాగుతారు. నియోజకవర్గ పర్యవేక్షలుగా అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు వ్యవహరిస్తున్నారు.

ఓటర్ల నుంచి మంచి స్పందన
జిల్లాలో కొనసాగుతున్న ఎలక్ట్రోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రాంకు ఓటర్ల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 580 పోలింగ్ కేంద్రాలు ఉండగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎంలు బీఎల్‌వోలుగా వ్యవహరిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యక్రమంలో పోలింగ్ బూత్ అధికారులను నియమించారు. ఎలక్ట్రోరల్ వెరిఫికేషన్ ప్రోగ్రాంలో భాగంగా బీఎల్‌లవోలు ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్ల జాబితాలో ఉన్నవారి పేర్లను పరిశీలిస్తూ వారికి ఓటరు కార్డులు ఉన్నాయా లేవా అనే వివరాలను తెలుసుకుంటున్నారు. పేర్లు సరిగా ఉన్నాయా లేదా అనే విషయాలు తెలుసుకోవడంతో పాట ఏమైనా తప్పులు ఉంటే అప్పటికప్పుడు తమ వద్ద ఉన్న మొబైల్‌యాప్‌లో సరిచేస్తున్నారు. ఎన్వీఎస్పీ పోర్టల్‌లో సైతం ఓటర్లు జాబితాలో తమ వివరాలను చూసుకునే తప్పులుంటే సరిచేసుకునే అవకాశం కల్పించారు.

కామన్ సర్వీస్ సెంటర్‌లతో పాటు ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లోని అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఓటరు సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్లు జాబితాలోని వారి వివరాలను పరిశీలించుకోవచ్చని ఇందులో భాగంగా విద్యార్థులకు శిక్షణ ఇచ్చామని, వివరాలను కచ్చితంగా సేకరించేందుకు బీఎల్‌వోలు, సూపర్‌వైజర్లకు సైతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 1-1-2020 నాటికి 18 సంవత్సారాలు నిండిన వారు కొత్తగా ఓటరు జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకునే అవకాశం కల్పించగా కొత్త ఓటర్లు సైతం జాబితాలో తమ పేర్లను నమోదు చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహణ ద్వారా ఓటరు జాబితాను పక్కాగా తయారు చేయడంతో పాటు అర్హులైన వారందరు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కలుగుతుంది.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles