మరుగుదొడ్లను వినియోగించుకోవాలి


Fri,September 13, 2019 03:35 AM

- కలెక్టర్ దివ్యదేవరాజన్ సూచన
- వాగాపూర్‌లో 30 రోజుల కార్యాచరణ
- చాందా (టి)లో మొక్కలు నాటిన జేసీ


ఆదిలాబాద్ రూరల్: గ్రామాల్లో ప్రజలు మరుగుదొడ్లను నిర్మించుకొని తప్పని సరిగా వాటిని వినియోగించుకోవాలని కలెక్టర్ దివ్య దేవరాజన్ పిలుపునిచ్చారు. మావల మండలంలోని వాగాపూర్ గ్రామంలో గురువారం 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇతర సమస్యల పరిష్కారం కోసం అధికారులు కృషి చేయాలని, ప్రజలు సైతం అందుకు సహకరించాలని సూచించారు. 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకునేందుకు మంచి అవకాశం లభించిందని, ప్రజలు అధికారులను సంప్రదించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు. విద్యుత్ స్తంభాలు, తీగల మరమ్మతుతో పాటు వీధి దీపాలు ఇతరాత్ర సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉందన్నారు. అంతే కాకుండా పారిశుద్ధ్య పనులు చేపట్టి తమ ఆరోగ్యం కాపాడుకునేందుకు ఐక్యంగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మురికినీటి కాల్వల నిర్మాణంతో పాటు పేరుక పోయిన చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించేందుకు సహకరించాలని కోరారు.

గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందని ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి గ్రామానికీ ప్రత్యేకాధికారులను నియమించామని, ఏ సమస్య ఉన్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధులు సైతం కృషి చేయాలన్నారు. గ్రామాల్లో అక్రమ కట్టడాలు తొలగించడంతో పాటు పిచ్చిమొక్కల తొలగించాలని, హరితహారం కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అన్నారు. పాఠశాలలు, ఖాళీ స్థలాలతో పాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ నల్ల వనిత, ఎంపీపీ చెందాల ఈశ్వరి, వాగాపూర్ సర్పంచ్ మయూరి, ఆర్‌ఐ హన్మంత్‌రావు, ఏపీవో మేఘమాల తదితరులు పాల్గొన్నారు.

చాందా(టి) గ్రామంలో...
చాందా(టి) గ్రామంలో నిర్వహించిన 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా జిల్లా సంయుక్త కలెక్టర్ సంధ్యారాణి పర్యటించారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు పంపిణీ చేసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటించారు. అదే విధంగా గ్రామంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆరె.రాజన్న, జేసీ పలు సమస్యలను పరిశీలించారు. పారిశుద్ధ్య పనులను వెంటనే చేపట్టాలని అధికారులకు సూచించారు. పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు. ఉపాధ్యాయులు సైతం పాఠశాలల్లో విద్యార్థులకు పారిశుద్ధ్య పనులతో పాటు పర్యావరణంపై అవగాహన కల్పించాలన్నారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గండ్రత్ రమేశ్, ఎంపీడీవో రవీందర్ రాథోడ్, ఉప సర్పంచ్ రూప, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శశికళ, గ్రామస్తులు పాల్గొన్నారు.

76
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles