మండలి ఓట్ల లెక్కింపు నేడే..

Tue,March 26, 2019 12:06 AM

నిర్మల్,నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి : ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసనమండలి స్థానానికి సంబంధించి మార్చి 29న సంబంధిత ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియనుంది. ఉపాధ్యాయ స్థానానికి పాతూరి సుధాకర్‌రెడి,్డ పట్టభద్రుల స్థానానికి కె.స్వామిగౌడ్ ఎమ్మెల్సీగా ఉండగా.. వీరి పదవీ కాలం మార్చి 29తో ముగుస్తోంది. దీంతో కరీంనగర్- నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లా ల పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి స్థానాలకు ఈనెల 22న పోలింగ్ నిర్వహించిన విషయం తెలిసిందే. బ్యాలెట్ విధానంలో పోలిం గ్ నిర్వహించగా.. పోలింగ్ పూర్తయ్యాక బ్యాలెట్ బాక్స్‌లను కరీంనగర్‌కు తరలించారు. పట్టభద్రుల, ఉపాధ్యాయుల శాసనమండలి స్థానానికి నిర్వహించిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపును కరీంనగర్‌లో మంగళవారం చేపడుతున్నారు. స్థానిక అంబేద్కర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకే మండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభించేందుకు అధికారులు సర్వం సిద్దం చేశారు. పట్టభద్రుల స్థానానికి సంబంధించి 17 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. ఉపాధ్యాయుల స్థానానికి ఏడుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

శాసన మండలి ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయగా.. 50శాతం ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటిస్తారు. తొలి ప్రాధాన్యత ఓటులో 50శాతం రాకుంటే రెండో ప్రాధాన్యత ఓటును పరిగణలోకి తీసుకొని లెక్కిస్తారు. ఇలా 50శాతం ఓట్లు వచ్చే వరకు లెక్కిస్తునే ఉంటారు. ఉపాధ్యాయులు, పట్టభద్రుల ఓట్ల లెక్కింపు కోసం 14 చొప్పున టేబుళ్లను ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తుండగా.. ఒక్కో రౌండ్‌లో 14వేల చొప్పున ఓట్లను లెక్కిస్తారు. ఉపాధ్యాయుల శాసనమండలి స్థానంలో 19,376 మంది పోలింగ్‌లో పాల్గొన్నారు. దీంతో రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తవుతుండగా.. మధ్యాహ్నానికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల శాసనమండలి స్థానంలో 1,16,156 మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నా రు. దీంతో 9 రౌండ్లలో పట్టభద్రుల ఓట్లను లెక్కించనున్నారు. వీటి ఓట్ల లెక్కింపు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. ఇందుకోసం రెండు షిప్టుల్లో సిబ్బందిని ఓట్ల లెక్కింపు కోసం సిద్ధంగా ఉంచారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ నిర్మల్ జిల్లాలు ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ ఓటర్లు 5134 మం ది ఉండగా.. పట్టభద్రులు ఓటర్లుగా 37,333 మంది ఉన్నారు. ఉపాధ్యాయ ఓటర్లలో పురుషులు 3651 మంది ఉండగా.. మహిళలు 1483 మంది ఉన్నారు. పట్టభద్రుల స్థానానికి సంబంధించి నాలుగు జిల్లాలు కలిపి పట్టభద్రులు ఓటర్లలో 26,173 మంది పురుషులు, 11,156 మంది మహిళలు, నలుగురు ఇతర ఓటర్లు ఉన్నారు. పట్టభద్రులకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో 7789 మందికి గాను 4462 (57.28శాతం) మంది, ఆసిఫాబాద్ జిల్లాలో 4355 మందికిగాను 2676 (61.45శాతం) మంది, మంచిర్యాల జిల్లాలో 11,004 మందికిగాను 5763 (52.37శాతం) మంది, నిర్మల్‌లో 12345 మందికిగాను 6999 (56.69శాతం) మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయులకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో 1554 మందికిగాను 1253 (80.63 శాతం) మంది, ఆసిఫాబాద్‌లో 493 మందికిగాను 383 (77.69శాతం) మంది, మంచిర్యాలలో 1157 మందికిగాను 942 (81.42శాతం) మంది, నిర్మల్ జిల్లాలో 1738 మందికిగాను 1428 (82శాతం) మంది పోలింగ్‌లో పాల్గొన్నారు.

90
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles