విధులను సమర్థంగా నిర్వర్తించాలి

Mon,March 25, 2019 12:22 AM

ఎదులాపురం: పార్లమెంట్ ఎన్నికల విధులను సమర్థవంతంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు ఆదివారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మొదటి దశ శిక్షణ తరగతులలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పోలింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఎన్నికల విధుల నిర్వహణకు అవసరమైన శిక్షణలు ఇస్తామని, ఏమైనా సమస్యలుంటే నివృత్తి చేసుకోవాలన్నారు. మాక్ పోల్‌ను నిర్ణీత సమయానికి నిర్వహించాలని, మాక్‌పోల్ అనంతరం వీవీప్యాట్‌లోని స్లిప్‌లను తీసి నల్లని కవర్‌లో భద్రపర్చి సీల్ వేయాలన్నారు. మాక్‌పోల్‌లో ఎన్ని ఓట్లు వేశారో నమోదు చేసుకోవాలని తెలిపారు. సీఆర్‌సీ (క్లోస్, రిజల్ట్, క్లియర్) బటన్‌లను వెంట వెంటనే నొక్కకుండా నెమ్మదిగా ప్రాసెస్ పూర్తయిన తర్వాతే నొక్కాలని తెలిపారు. దివ్యాంగుల ఓటర్లకు రవాణా సౌకర్యం ప్రత్యేక వాహనాల్లో ఐకేపీ సిబ్బంది సహకారంతో కల్పిస్తామని తెలిపారు. పోలింగ్‌కు ముందు కంట్రోల్, బ్యాలెట్ యూనిట్లు, వీవీప్యాట్‌లు సక్రమంగా కనెక్షన్‌లు ఉన్నాయా.. లేదా... అని పరిశీలించుకోవాలని సూచించారు.

ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బంది ఫారం-12, 12ఏలు సమర్పించాలని, ఇతర లోకసభ నియోజకవర్గాల వారికి పోస్టల్ బ్యాలెట్, ఒకే లోకసభ నియోజకవర్గ ఓటరు జాబితాలో పేరు ఉండి అదే నియోజకవర్గ పరిధిలో ఎన్నికల డ్యూటీ నిర్వహిస్తే సదరు ఉద్యోగి అతను ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ కేంద్రంలోనే ఓటుహక్కు వినియోగించుకునేందుకు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ఇస్తారని, ఆ ఈడీసీ ద్వారా ఆ పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు వినియోగించుకోవచ్చన్నారు. ఉద్యోగి పేరును ఫారం-17ఏలో నమోదు చేసి, ఈడీసీ అని రాయాలని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి మలిదశలో ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఆ పరీక్షలో పాస్ కాని వారికి మరోమారు శిక్షణ ఇప్పించి పరీక్ష నిర్వహిస్తామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ఇచ్చే శిక్షణలో ఆ విషయాలపై సమగ్రంగా తెలుసుకోవాలని, తద్వారా ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ కోసం నమోదు ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్‌ల కోసం సమర్పించిన దరఖాస్తులను పరిశీలించారు. ఉద్యోగి పూర్తి సమాచారాన్ని, ఎపిక్ నంబర్, పార్ట్‌నెంబర్, క్రమ సంఖ్య, చిరునామా, వంటి వివరాలను ఫారాల్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈవో డాక్టర్ రవీందర్‌రెడ్డి, ఆర్డీవో సూర్యనారాయణ, కలెక్టరేట్ పర్యవేక్షకులు వర్ణ, రాజేశ్వర్, ఇతర రెవెన్యూ, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

73
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles