భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేయాలి

Sat,March 23, 2019 11:48 PM

ఆదిలాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి/ఇచ్చోడ/బోథ్, నమస్తే తెలంగాణ: ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థి గొడాం నగేశ్ గెలుపు నిశ్చయమైందని.. నాయకులు, కార్యకర్తలు భారీ మెజార్టీ లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఎంపీ అభ్యర్థి గొడాం నగేశ్ తరఫున జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల శనివారం జిల్లాలోని భీంపూర్ మండలం నిపాని, ఇచ్చోడ, బోథ్‌లో జరిగిన టీఆర్‌ఎస్ నాయకులు, ముఖ్యకార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయిందని ఆ పార్టీకి నాయకులు, కార్యకర్తలు కరువయ్యారని తెలిపారు.

పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా గోడం నగేశ్ ప్రకటన తర్వాత జిల్లాలో టీఆర్‌ఎస్ ప్రచారాన్ని ఉధృతం చేసింది. రాష్ట్ర అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం జిల్లాలో భీంపూర్ మండలం నిపాని, ఇచ్చోడ, బోథ్‌లో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరై దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమాల్లో అల్లోల మాట్లాడుతూ.. లోకసభ ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీకి 130 సీట్లు, కాంగ్రెస్‌కు 100 సీట్ల కంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదన్నారు. మన రాష్ట్రంలో 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకపాత్ర పోషిస్తారని మంత్రి అన్నారు. టీఆర్‌ఎస్ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటైతే రాష్ర్టానికి ఎక్కువ నిధులు వస్తాయని, దీంతో గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయన్నారు. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు సమయం తక్కువగా ఉన్నందున టీఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని, తమ నియోజకవర్గాల్లో భారీ మెజార్టీ వచ్చేలా కృషి చేయాలని సూచించారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఖాళీ అయిపోయిందని గ్రామాల్లో ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి అండగా నిలుస్తున్నారన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆసరా పింఛన్లు ఏప్రిల్ నెల నుంచి రెండింతలు కానున్నట్లు తెలిపారు. ప్రభుత్వం త్వరలో నిరుదోగ్య భృతిని అమలు చేస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుందని ఫలితంగా ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినట్లు తెలిపారు. కార్యకర్తలు గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను తెలియజేయాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన గ్రామపంచాయతీలకు జనాభా ప్రాతిపాదికన నిధులు మంజూరవుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో పర్యటించి అటవీభూముల సమస్యలను పరిష్కరిస్తారని మంత్రి పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గంలో రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చెనాక-కోర్ట, గోముత్రి, పిప్పల్‌కోటీ ప్రాజెక్టులను మంజూరు చేసిందని ఈ ప్రాజెక్టుల నిర్మాణంతో నియోజకవర్గం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కో-ఆర్డినేటర్ అడ్డి భోజారెడ్డి, ఐసీడీఎస్ ఆర్గనైజర్ కాస్తాల ప్రేమల, టీఆర్‌ఎస్ నాయ కులు, జాదవ్ అనిల్ తాటిపల్లి రాజు, యూనీస్ అక్బానీ, రాంకిషన్, గడ్డం లస్మన్న, శ్రీధర్‌రెడ్డి పార్టీ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి ఘన సన్మానం..
నేరడిగొండ: మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటి సారిగా నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా ఐకే రెడ్డిని మండల నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపుకోసం మండలంలోని నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా కృషి చేయాలని సూచించారు. టీఆర్‌ఎస్‌పై అభిమానం ఉన్నప్పటికీ కార్యకర్తలు, నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

79
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles