ఈవీఎం, వీవీప్యాట్లు సిద్ధం!

Sat,March 23, 2019 11:47 PM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండగా అధికారులు అదే తరహాలో ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి విడుతల వారీగా శిక్షణ ఇచ్చి సిద్ధం చేశారు. శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్ నేతృత్వంలో బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీప్యాట్‌ల మొదటి దఫా రాండమైజేషన్‌ను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. పోలింగ్ కేంద్రాలను బట్టి సెగ్మెంట్ల వారీగా బ్యాలెట్, కంట్రోల్ యూనిట్, వీవీప్యాట్‌లను కేటాయించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈవీఎం, వీవీ ప్యాట్లను అందుబాటులో ఉంచుతున్నారు.

ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో సిర్పూర్, ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గాల పరిధిలో 14,78,662మంది ఓటర్లు ఉన్నారు. ఇందుకు గాను అధికారులు 2079 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగనుండగా.. ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. బ్యాలెట్ యూనిట్లు 3351, కంట్రోల్ యూనిట్లు 2517, వీవీప్యాట్‌లు 2785లను కేటాయించారు. శనివారం మొదటి దశ ఆదిలాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లను కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకుల సమక్షంలో జిల్లా కలెక్టర్ ర్యాండమైజేషన్‌ను చేశారు. ఆ తర్వాత నియోజకవర్గాల వారీగా వీటికి కేటాయించారు. ఆదిలాబాద్, బోథ్, సెగ్మెంట్లలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అవసరమైన బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లను రాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదిలాబాద్ సెగ్మెంట్‌లోని 280 పోలింగ్ కేంద్రాలలో బోథ్ సెగ్మెంట్‌లోని 309 పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు అవసరం కాగా.. 18 శాతం ఆదిలాబాద్ సెగ్మెంట్‌కు, 17 శాతం బోథ్ సెగ్మెంట్‌కు అదనంగా, వీవీప్యాట్‌లు ఆదిలాబాద్ 25, బోథ్‌కు 28 శాతం అదనంగా అందుబాటులో ఉంచుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి.సంధ్యారాణి, ఆర్డీవో సూర్యనారాయణ, రాజకీయ పార్టీల ప్రతినిధులు బి.గోవర్ధన్‌రెడ్డి, అరుణ్‌కుమార్, ఆకుల రాము, బండారి సతీశ్, రహమాన్ షానవాజ్, ఓంకార్‌మాల్ శర్మ, రాంమోహన్‌రెడ్డి, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

81
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles