ప్రచారానికి అనుమతి తప్పనిసరి

Thu,March 21, 2019 12:39 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ప్రచారానికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కేంద్రం ఎన్నికల వ్యయ పరిశీలకుడు దేబబ్రత దత్త అన్నారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో సువిధ సింగిల్ విండో కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు మాట్లాడుతూ పోటీ చేసే అభ్యర్థులు రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఎన్నికల ప్రచార నిమిత్తం కావాల్సిన అనుమతులను సువిధ సింగిల్ విండో సెల్‌లో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ప్రచార సమావేశాలు, ర్యాలీలు, వాహనాల అనుమతులు, మైకు, హెలికాప్టర్, హెలిప్యాడ్‌కు అనుమతులు ఈ సెల్‌ద్వారా పొందవచ్చన్నారు. suvidha.eci.gov.in వెబ్‌సైట్ ద్వారా చేసుకోవచ్చని చెప్పారు. ముందుగా మొబైల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఆ తర్వాత మొబైల్‌కు వచ్చిన ఓటీపీ (వన్‌టైం పాస్‌వర్డ్) ద్వారా వెబ్‌సైట్ ప్రారంభించి అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి.సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈవో నరేందర్, నాయబ్ తహసీల్దార్ రాజేశ్వరి పాల్గొన్నారు.

అభ్యర్థుల ఖర్చుల వివరాలు నమోదు చేయాలి
అభ్యర్థుల ప్రచార ఖర్చుల వివరాలు రోజు వారీ నివేదికలను అన్ని విభాగాల నుంచి సేకరించి క్రోడీకరించాలని కేంద్ర ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకుడు దేబబ్రత దత్త అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యయ నోడల్ అధికారులు, సహాయ వ్యయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ స్థానానికి పోటీచేసే అభ్యర్థులకు సంబంధించిన ప్రచారంలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు, సమావేశాలు, వాహన వినియోగాలు, ప్రచార సామగ్రి, చెల్లింపు వార్తలు, అడ్వర్టయిజ్‌మెంట్లు, మైకులు వంటి ఖర్చులను అభ్యర్థి షాడో రిజిష్టర్‌లో నమోదు చేయాలన్నారు. ఎన్నికల పరిశీలకులు నిర్ణయించిన తేదీల్లో అభ్యర్థుల ఖర్చుల రికార్డుల పరిశీలనకు సమర్పించాలన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల అధికారి దివ్యదేవరాజన్ మాట్లాడుతూ రికార్డులను తప్పకుండా నిర్వహించాలని, అభ్యర్థి వ్యయం ఎన్నికల కమిషన్ నిర్ణయించిందన్నారు. రికార్డులను పరిశీలిస్తానని, తనిఖీ కేంద్రాలను ఆకస్మికంగా చూస్తానని తెలిపారు. సమావేశంలో నోడల్ అధికారి రాజ్‌కుమార్, నిర్మల్ డీసీవో సూర్యచందర్, ఆదిలాబాద్ ఏఆర్వో సూర్యనారాయణ, ఏఈవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఎన్నికలకు ప్రశాంత వాతావరణం కల్పించాలి
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల వ్యయ పరిశీలకుడు దేబబ్రత దత్త అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి, సంయుక్త కలెక్టర్‌తో ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ నెల 22న పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికళకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికలకు సైతం సిద్ధం కావాలన్నారు. సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దివ్యదేవరాజన్, సంయుక్త కలెక్టర్ సంధ్యారాణి ఉన్నారు.

దేవాపూర్ చెక్‌పోస్టు పరిశీలన...
ఎమ్మెల్సీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘం వ్యయ పరిశీలకుడు దేబబ్రత దత్త జిల్లా సరిహద్దులో ఏర్పాటు చేసిన పలు చెక్‌పోస్టులను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఇతర జిల్లాలు, రాష్ర్టాల నుంచి మద్యం, డబ్బు అక్రమ రవాణా కాకుండా చూడాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిబంధనల ప్రకారం రూ.50 వేలకు పైగా డబ్బులు తీసుకెళ్తే వాటికి సంబందించిన ఆధారాలు తప్పనిసరి ఉండాలన్నారు. ఆధారాలు లేకపోతే డబ్బును వెంటనే సీజ్ చేయాలన్నారు. ఆయన వెంట ఎన్నికల అధికారులు ఉన్నారు.

104
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles