ముగిసిన పోలీస్ ఎంపిక ప్రక్రియ

Thu,March 21, 2019 12:39 AM

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ బుధవారంతో ప్రశాంతంగా ముగిసింది. అంతకు ముందు నిర్వహించిన ప్రిలిమినరీ రాత పరీక్షలో 13,070 మంది అభ్యర్థులు ఈవెంట్స్‌కు అర్హత సాధించారు. ఇందులో 11,055 మంది పురుషులు, 2,015 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. వీరికి మార్చి 1 నుంచి దేహదారుఢ్య పరీక్షలను నిర్వహించారు. 13,070 మంది అభ్యర్థులకు గాను.. 11,220 మంది అభ్యర్థులు ఈవెంట్స్‌కు హాజరయ్యారు. 1,850 మంది అభ్యర్థులు దేహదారుఢ్య పరీక్షలకు గైర్హాజరయ్యారు. ఇందులో పురుషులు 1,623 మంది, మహిళలు 227 మంది ఉన్నారు. వివిధ విభాగాల్లో నిర్వహించిన దేహదారుఢ్య పరీక్షల్లో 5027 మంది అభ్యర్థులు అనర్హత సాధించి తుదిరాత పరీక్షకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులు, పీఈటీ, సాంకేతిక నిపుణుల సహకారంతోనే ప్రశాంతంగా దారుఢ్య పరీక్షలు పూర్తి చేశామన్నారు. ఉదయం 3 గంటల నుంచి పూర్తి అయ్యే వరకు మైదానంలో విధులు నిర్వహించిన ప్రతి ఒక్కరిని అభినందించారు. సుమారుగా 60 శాతం పై ఉమ్మడి జిల్లా అభ్యర్థులు మైదానంలో ఉత్తమ ప్రతిభ కనబర్చి తుది రాత పరీక్షకు ఎంపికయ్యారని తెలిపారు. పోలీసు శాఖలో ఉద్యోగం సాధించే అభ్యర్థులకు రెండు విభాగాల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని, మొదటిది చదువు, రెండోది శరీర దృడత్వం, చురుకైన అభ్యర్థుల అన్వేషణలో రాష్ట్ర పోలీసుశాఖ అత్యుత్తమమైన ఎంపిక ప్రక్రియను అవలంభిస్తుందని పేర్కొన్నారు. ఎంపిక ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా మూడంచెల భద్రత మధ్య ఎంపిక ప్రక్రియను కొనసాగించినట్లు పేర్కొన్నారు.

దేహదారుఢ్య పరీక్షలకు నెల ముందు నుంచే పరేడ్ మైదానంను చదును చేసి అభ్యర్థుల కోసం సిద్దం చేశామన్నారు. రాష్ట్ర పోలీస్ నియామక మండలి సూచించిన ఆదేశాల మేరకు ఎంపికైన అభ్యర్థుల డాటా ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేశామని పేర్కొన్నారు. కట్టుదిట్టమైన భద్రత వలయం ఏర్పాటు చేసి మైదాన పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లాలో మొదటి సారిగా పోలీసు ఎంపికలో మహిళలు సుమారుగా 85శాతం మంది తమ ప్రతిభను చాటుకొని తుది రాత పరీక్షకు ఎంపిక కావడం గొప్ప పరిణామంగా భావిస్తున్నట్లు తెలిపారు. మైదానంలో అభ్యర్థులకు క్రమశిక్షణతో మార్గనిర్ధేశం, సూచనలు చేయడంలో చురుకైన పాత్ర పోశించిన నిర్మల్, ఆదిలాబాద్ అదనపు ఎస్పీలు దక్షిణామూర్తి, కంచ మోహన్‌లు విశేషమైన కృషి చేశారని కొనియాడారు. రాష్ట్ర పోలీస్ శాఖలో తొలిసారిగా మానవ ప్రమేయం లేకుండా శరీర దారుఢ్య పరీక్షలు నిర్వహించడం, సాంకేతిక పరిజ్ఞానం అవలంబించడంలో పోలీస్ శాఖ ఉత్తమ శిఖరాల వైపు అడుగులు వేస్తుందన్నారు. తుది రాత పరీక్షకు సమయం దగ్గర పడడంతో అభ్యర్థులు ఒక ప్రణాళికను నిర్ధేశించుకొని కష్టపడి సంసిద్దం కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పోలీసు అధికారులు కంచమోహన్, దక్షిణామూర్తి, సుజా ఉద్దీన్, కిషన్‌సింగ్, కె.నర్సింహారెడ్డి, స్పెషల్ బ్రాంచ్ అధికారులు వెంకన్న, అన్వర్ ఉల్‌హక్, సీఐలు సురేష్ నాగరాజు, ప్రదీప్‌కుమార్, లక్ష్మీనారాయణ, పోతారం శ్రీనివాస్, కె.వినోద్, పురుషోత్తం, ఆర్‌ఐలు సుధాకర్‌రావు, వామనమూర్తి, ఎస్సైలు వెంకన్న, పి.రాజు, సుబ్బారావు, రామయ్య, సాంకేతిక నిపుణులు సంజీవ్‌కుమార్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

93
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles