కారు జోరు.. కాంగ్రెస్ బేజారు

Wed,March 20, 2019 12:30 AM

నిర్మల్, నమస్తే తెలంగాణ ప్రధాన ప్రతినిధి: ఎన్నికలు ఏవైనా.. గులాబీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో రణక్షేత్రంలోకి దిగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నయా జోష్ కన్పిస్తోంది. మరోసారి ఎంపీ స్థానం పదిలంగా ఉంచుకునేందుకు కార్యకర్తలు, నాయకులంతా సమన్వయంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే అసెంబ్లీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగురవేయగా.. తాజాగా లోక్‌సభ ఎన్నికల్లోనూ గులాబీ జెండాను ఎగురవేసేందుకు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం టీఆర్‌ఎస్ ఖాతాలో ఉండగా.. గొడాం నగేశ్ ఎంపీగా గెలుపొందారు. తాజాగా ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో ఈ స్థానాన్ని మరోసారి దక్కించుకునేందుకు టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే ఆదిలాబాద్ లోక్‌సభ ఇంచార్జిగా రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే ఆయన పార్లమెంట్ స్థానాల పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా కార్యకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యేలందరితో.. మంత్రి అల్లోల సమన్వయం చేసుకుంటూ కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు పూర్తి చేశారు. తాజాగా పార్లమెంట్ పరిధిలోని ఆయా మండలాల వారీగా కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా.. ఒక్క ఆసిఫాబాద్‌లో మాత్రమే కాంగ్రెస్ నుంచి ఆత్రం సక్కు గెలిచారు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు, గిరిజనులు, ఆదివాసీల కోసం పెద్ద ఎత్తున పథకాలు అమలు చేయడం పట్ల ఆకర్శితులై కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడంతోనే ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా బోథ్‌కు చెందిన అనిల్‌జాదవ్ నేడు టీఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. 2009, 2014 సాధారణ ఎన్నికల్లో బోథ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా.. బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జిగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో అనిల్‌జాదవ్‌కు టిక్కెట్టు ఇవ్వకుండా సోయం బాపురావుకు టికెట్ ఇవ్వడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. తాజాగా ఆయన బుధవారం కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిస్తేజం అలుముకుంది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో తీవ్ర పరాభవం చవిచూడటంతో ఆ పార్టీ శ్రేణుల్లో నిస్తేజం నెలకొంది. తాజాగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు కీలక నేతలు, ప్రజాప్రతినిధుల రాజీనామాలు ఆ పార్టీలో కల్లోలానికి దారి తీస్తోంది. అసలే వరుస పరాజయాలతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ను తాజాగా పార్లమెంట్ ఎన్నికలు పరీక్షగా నిలిచాయి. ప్రజాప్రతినిధులు, కీలక నాయకులు, ఇతర పార్టీల్లోకి వలసలు పోతుండటంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆత్రం సక్కు కాంగ్రెస్‌ను వీడి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ పార్టీకున్న ఏకైక ఎమ్మెల్యే కూడా కారు ఎక్కుతుండటంతో ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాయకులున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ అభ్యర్థిగా రాథోడ్ రమేశ్‌ను ప్రకటించగా.. మిగతా నాయకుల్లో తీవ్ర అసంతృప్తికి దారి తీసింది. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన తమకు అవకాశం ఇవ్వకుండా ఇటీవల పార్టీలో చేరిన, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి టిక్కెట్టు ఇవ్వడం పట్ల అసమ్మతి, అసంతృప్తికి కారణమైంది.

రాథోడ్ రమేశ్‌కు టిక్కెట్టు ఇవ్వడంతో కాంగ్రెస్ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ నరేశ్‌జాదవ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన ఇప్పటికే ఏఐసీసీ సభ్యులు పదవికి రాజీనామా చేశారు. ఒక దశలో బీజేపీలో చేరాలని భావించారు. అక్కడ ఎంపీ టిక్కెట్టుపై స్పష్టమైన హామీ రాకపోవడం, అప్పటికే సోయం బాపురావు పేరు ఎంపీ అభ్యర్థుల జాబితాలో రావడంతో ఆయన ముందుకు వెళ్లలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికి పదవులకు రాజీనామా చేశారు. తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆయనతో పాటు మాజీ మంత్రి రాంచంద్రారెడ్డి వర్గీయులు పార్లమెంట్ ఎన్నికలకు కలిసి పని చేసే పరిస్థితి లేకుండాపోయింది. మరోవైపు బోథ్ మాజీ ఎమ్మెల్యే, ఇటీవల ఎన్నికల్లో బోథ్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయిన సోయం బాపురావు బీజేపీలో చేరారు. ఆయనను బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు లంబాడా, ఆదివాసీ కీలక నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీని వీడడం, తీవ్ర అసంతృప్తితో ఉండటం ఆ పార్టీకి ఈ ఎన్నికలు పరీక్షగా మారాయి. మరోవైపు పార్టీలో గ్రూపు రాజకీయాలు కార్యకర్తలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. నియోజకవర్గాలు, మండలాల వారీగా సమన్వయం చేసే నాయకత్వం లేకపోవడం, కార్యకర్తల్లో తీవ్ర నిస్తేజం అలుముకోవడంతో పార్లమెంటు ఎన్నికలు ఆ పార్టీకి భారంగా మారాయి.

105
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles