కల్లోల కాంగ్రెస్!

Sun,March 17, 2019 12:28 AM

ఆదిలాబాద్ / నమస్తే తెలంగాణ ప్రతినిధి: ఆదిలాబాద్ పార్లమెంట్ టికెట్ కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం సాగుతున్నది. ఎంపీ టికెట్‌ను రాథోడ్ రమేశ్‌కు ఇవ్వడంపై ఆశావహులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడిన ఓ నేత రాజీనామాకు సిద్ధమవగా, మరో నాయకుడు పార్టీ మారే యోచనలో ఉన్నాడు. ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితిలో ఎంపీ టికెట్ కేటాయింపు విషయలో వర్గపోరు తీవ్రరూపం దాల్చింది. పార్టీ నిర్ణయించిన ఎంపీ అభ్యర్థికి ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు మద్దతు ఏ మేరకు లభిస్తుందనేది సందేహంగా మారింది.ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూసిన హస్తం పార్టీకి ప్రజల మద్దతు లేకుండా పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి ముగ్గురు నాయకులు టికెట్‌కోసం ప్రయత్నాలు చేశారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నరేశ్ జాదవ్, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నియోజకవర్గం నుంచి పోటి చేసి ఓడిపోయిన రాథోడ్ రమేశ్, బోథ్ నుంచి పోటీ చేసి పరాజయం పాలైన సోయం బాపురావులు టికెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ముగ్గురు నాయకులు తమకు దగ్గరగా ఉన్న అధిష్టానం పెద్దల ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేశారు.

ఎంతోకాలంగా తాను పార్టీకి సేవచేస్తున్నానని ఈ సారి పార్లమెంట్ ఎన్నికల్లో సైతం తనకు టికెట్ ఇవ్వాలని గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటి చేసి ఓడిపోయిన నరేశ్ జాదవ్ ఏఐసీసీ నేతలను కోరారు. హస్తం పార్టీ తరపున రాథోడ్ రమేశ్, సోయం బాపురావుల పేర్లను పరిశీలించడం ఏంటని ఆయన కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని నాయకులను కోరారు. శుక్రవారం రాత్రి కాంగ్రెస్ పార్టీ లోకసభకు పోటీచేసే ఎనిమిది మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించగా అందులో ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రాథోడ్ రమేశ్ పేరు ఉంది. దీంతో పార్టీ టికెట్ ఆశించి భంగపడిన నరేశ్ జాదవ్, సోయం బాపురావులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఎంపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో నరేశ్ జాదవ్ హస్తం పార్టీకి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ విషయమై సన్నిహితులతో చర్చిస్తున్నట్లు సమాచారం. టికెట్ దక్కని మరో నాయకుడు సోయం బాపురావు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. కమలం పార్టీ తరపున టికెట్ ఇచ్చేందుకు అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చిన దరిమిలా బాపురావు బీజేపీలో చేరనున్నట్లు తెలిసింది. హస్తం పార్టీలో వర్గ విభేదాలు తీవ్ర స్థాయికి చేరడంతో అధిష్టానం ప్రకటించిన అభ్యర్థి రాథోడ్ రమేశ్‌కు మరో వర్గం నాయకులు, కార్యకర్తల మద్దతు సందేహంగా మారింది. ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న తమ నాయకులకు అధిష్టానం ఎంపీ టికెట్ కేటాయించక పోవడంపై ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

141
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles