డిపాజిట్లు గల్లంతైనా.. బీజేపీ నాయకులకు బుద్ధి రాలేదు

Sat,March 16, 2019 12:31 AM

ఆదిలాబాద్ టౌన్ : ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బీజేపీ అభ్యర్థులకు 113 స్థానాల్లో డిపాజిట్లు గల్లంతు చేసినా.. ఆ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. జిల్లా కేంద్రానికి వచ్చిన బీజేపీ రాష్ట్ర నాయకుడు ఇంద్రసేనారెడ్డి టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో మహా కూటమి, బీజేపీలను కాదని ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీపై విశ్వాసం ఉంచి 2/3 మెజార్టీని కట్టబెట్టారన్నారు. సీఎం కేసీఆరే అబద్దాలు చెబితే ఎన్నికల్లో ప్రజలు తమకు ఎందుకు అధికారం ఇచ్చి ఆశీర్వదిస్తారని ప్రశ్నించారు. బీజేపీ నాయకులు ప్రజల తీర్పు గౌరవించి ఆత్మ విమర్శ చేసుకోవాలని హితవు పలికారు. 2014లో సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలనే కాకుండా చెప్పని పథకాలను కూడా అమలు చేశారన్నారు. పింఛన్లు పెంచామని, రైతులకు రుణమాఫీ చేశామన్నారు.

నాలుగేండ్ల మూడు నెలల్లో 95వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పారు. ఇప్పటికే 40వేల ఉద్యోగాలు భర్తీ అయ్యాయన్నారు. ప్రైవేట్ రంగంలో ఏడాదికి లక్ష చొప్పున యువతకు ఉద్యోగాలు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. నాలుగేండ్లలో 6039 పరిశ్రమలకు అనుమతులు ఇచ్చి నాలుగు లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారన్నారు. ఉద్యోగాల విషయమై సీఎం కేసీఆరే స్వయంగా అసెంబ్లీలో నోట్ సమర్పించిన విషయం గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ వంటి పవిత్ర గ్రంథాలుగా భావించి వంద శాతం అమలు చేశారని చెప్పారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా పథకాలు అమలు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పేద పిల్లల ఉన్నత విద్య కోసం 543 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇంత అభివృద్ధి చేసినా.. బీజేపీ నాయకులు ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ను విమర్శించే నైతిక స్థాయి కూడా బీజేపీకి లేదన్నారు. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించే బీజేపీ నాయకులను పిచ్చాసుపత్రిలో చేర్పించాలన్నారు. అసత్య ప్రచారాలు చేస్తున్న నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఐదేండ్లలో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

నల్లధనం వెలికి తీసి ప్రతి పేదోడి ఖాతాలో రూ.15లక్షలు జమ చేస్తామని ఆశ చూపి ఒక్క రూపాయి కూడా వేయలేదన్నారు. నోట్లు రద్దు చేసి ప్రజలను బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిప్పి ఇబ్బందుల పాలు చేశారన్నారు. బీజేపీ నాయకులు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు మానుకోకపోతే స్థానిక నాయకుల భూకబ్జాల బాగోతాలు, అవినీతి చరిత్ర బయటకు తీస్తామని హెచ్చరించారు. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్‌రెడ్డి తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే చట్టసభలో గళం వినిపిస్తానని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా, చట్టసభలో సీనియర్ నేతగా ఇప్పటి వరకు ఏం గళం వినిపించారని ప్రశ్నించారు. ఎన్నికల్లో మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్‌కే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఆరె రాజన్న, పార్టీ నాయకులు సాజిదొద్దీన్, తల్లెల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

116
Tags

More News

VIRAL NEWS

target delhi
country oven

LATEST NEWS

Cinema News

Health Articles