రైతులు శాస్త్రవేత్తల సలహాలు పాటించాలి


Sat,February 16, 2019 01:04 AM

ఆదిలాబాద్ టౌన్: రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సలహాలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని ఎస్పీ విష్ణు వారియర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆలిండియా రేడియో కేంద్రంలో శుక్రవారం రేడియో కిసాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎస్పీ విష్ణు వారియర్ హాజరై మాట్లాడారు. రైతులు అప్పుల నుంచి బయటపడేందుకు లాభసాటి, నాణ్యమైన పంటలు పండించాలన్నారు. దుకాణాదారుల మోసపూరిత మాటలు నమ్మకూడదని, సారవంతమైన భూములను కాపాడుకోవాలని సూచించారు. పంట కాపాడుకొనే సమయంలో ఫెన్సింగ్‌కు విద్యుత్ అమర్చడంతో రైతులు మరణించడం, ఆ రైతు కుటుంబాలు అనాథలు అవుతున్నారని తెలిపారు. పంట చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మార్కెట్‌లో డిమాండ్, అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని చెప్పారు. రసాయన ఎరువులు వాడడంతో రైతులు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. సబ్ కలెక్టర్ గోపి మాట్లాడుతూ రైతులు ఒకే సమయంలో ఒకే రకమైన పంటలు పండించడంతో నష్టపోతున్నారని అన్నారు. జిల్లాలో తన శిక్షణ కాలంలో పరిశీలించిన అంశాలను అంశాలను ఆయన గుర్తు చేశారు. జొన్న, మొక్కజొన్న వంటి సంప్రదాయ పంటలను పండించాలని సూచించారు.


రైతులు పత్తిని సీసీఐ వారికి అమ్మకుండా ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్మడంతో నష్టపోతున్నారని తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్యవక్త డాక్టర్ దొంతి నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని, అంతరిస్తున్న అటవీ సంపదను కాపాడుకోవాలని అన్నారు. 267 రకాల పురుగులు పంటలను నాశనం చేస్తున్నాయని, జిల్లాలో వంద ఏండ్లకు పైగా పత్తి పంట సాగు చేస్తున్నారని, నిపుణులు, అనుభవజ్ఞులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనల ప్రకారం వ్యవసాయం చేయాలని సూచించారు. దిగుబడి పెరుగుతున్న కొద్దీ ధరలు కూడా పెరుగుతున్నాయని, వ్యవసాయ రంగంలో పురాతన పద్ధతులను పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతకు ముందు వివిధ శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు వారి అనుభవాలను, సూచనలను అందించారు. అనంతరం వివిధ పంటలు, పరిశ్రమల్లో ప్రగతి సాధించిన ఉమ్మడి జిల్లాల రైతులను సన్మానించారు. ఆకాశవాణి డైరెక్టర్ వి.రాజేశ్వర్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు ఆశాకుమారి, అమరేష్ కుమార్, ఆసిఫాబాద్ జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శంకర్ రాథోడ్, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి కె.వెంకటేశ్వర్లు, కృషి విజ్ఞాన కేంద్ర సమన్వయకర్త వై.ప్రవీణ్‌కుమార్, సీనియర్ శాస్త్రవేత్త శ్రీధర్ చౌహాన్, ఏరువాక సమన్వయకర్త డాక్టర్ సుధాన్షు కస్బే, ఉద్యాన పరిశోధన స్థానం అధికారి ఆర్.ప్రీతం, ముఖ్య కార్యనిర్వహణాధికారి సుమనస్పతిరెడ్డి పాల్గొన్నారు.

216
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles